దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి దాదాపు 2200 కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. భారతీయ సినీపరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద ఇలాంటి మరొక సంచలనం వేరొకటి లేదు. బాహుబలి గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా `కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?` అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రతిధ్వనించింది. ఇప్పుడు బాహుబలి: ది ఎపిక్ పేరుతో బాహుబలి రెండు భాగాలను ఒకే సినిమాగా రిలీజ్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 31న బాహుబలి- ది ఎపిక్ సినిమాను విడుదల చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ సౌండ్ సహా అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రీమాస్టర్ చేసిన వెర్షన్ ని రిలీజ్ చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సమయంలో సినిమాలో ప్రతినాయకుడు భళ్లాలదేవ`గా నటించిన రానా దగ్గుబాటి రెడ్డిట్‌లో AMA సెషన్‌ను నిర్వహించగా దానికి అద్భుత స్పందన వచ్చింది. ఒక అభిమాని, ``బాహుబలిని చంపినందుకు మీరు చింతిస్తున్నారా?` అని ప్రశ్నించగా.. `అస్సలు చింతించలేదు!` అని రానా అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి సర్ వల్లనే ఈ రెండు భాగాల చిత్రం అద్భుతమైన ఇతిహాసంగా మారిందని మీరు నమ్ముతున్నారా? అని మరొక అభిమాని ప్రశ్నించారు. `అవును- ప్రతిరోజూ` అంటూ జవాబిచ్చాడు రానా. `మీరు ఇప్పటికీ ప్రభాస్‌తో టచ్‌లో ఉన్నారా?` అని మరొక అభిమాని ప్రశ్నించగా, `అవును.. చాలా` అని రానా సమాధానమిచ్చారు.
బాహుబలిలో చాలా సన్నివేశాల్లో లావుగా ఉన్నారు కదా? ఇప్పుడు బరువు తగ్గారు.. వేరే సినిమాల కోసమేనా.. ఆ ఎద్దుతో పోరాటం నాకు స్ఫూర్తినిస్తుంది! అని ప్రశ్నించగా, `సంవత్సరాలుగా అదే స్థిరత్వాన్ని కొనసాగించడం చాలా కష్టం. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ పాత్ర కోసం ఆ మార్పు చాలా విలువైనది` అని తెలిపారు. ఒకవేళ బాహుబలిలో ప్రభాస్ పాత్రను మీరు పోషించాల్సి వస్తే పోషిస్తారా? భళ్లాల దేవ పాత్రనే ఇష్టపడతారా? అని ప్రశ్నించగా.. భళ్లా రాజు అని రిప్లయ్ ఇచ్చారు. భళ్లాలదేవ పాత్రలో అత్యంత కష్టమైన భాగం ఏమిటి? అని ఒక అభిమాని ప్రశ్నించగా, `సవాళ్లతో కూడుకున్న పాత్ర ఇది.. కానీ ఆనందంగా ఉంది` అని అన్నారు.
బాహుబలి - ది కన్ క్లూజన్ లో విరామం ముందు సీన్‌లో అందరూ బాహుబలి నామం జపిస్తున్నప్పుడు భళ్లాలదేవుడు నిజంగా సంతోషంగా కనిపిస్తాడు.. బాహుబలి అతడికి గొడుగు పెట్టే వరకు అలా.. ఇది నిజమైన చిరునవ్వా లేదా చెడు చిరునవ్వా? అని ప్రశ్నించగా, `ఇప్పుడు కూడా ప్రజలు బాహుబలి అని జపించినప్పుడు నాకు కోపం వస్తుంది` అని అన్నారు రానా. అభిమానులతో సరదా చిట్ చాట్ లో రానా ప్రతిస్పందనలు ఆసక్తిని రేకెత్తించాయి.