మహా కుంభమేళాలో పూసలమ్ముతూ తనదైన అందం కవ్వింపుతో ఆకర్షించింది మోనాలిసా భోంస్లే. మధ్య ప్రదేశ్ కి చెందిన ఈ నేచురల్ బ్యూటీ తీరైన రూపం, చిరునవ్వు యువతరాన్ని ఆకర్షించాయి. మోనాలిసా సోషల్ మీడియాల్లో పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. ఆ తర్వాత పలువురు బాలీవుడ్ దర్శకులు మోనాలిసాకు తమ సినిమాల్లో అవకాశం కల్పిస్తామంటూ వెంటపడ్డారు.
కానీ సనోజ్ మిశ్రా దర్శకత్వంలో `ది డైరీ ఆఫ్ మణిపూర్`లో నటించే అవకాశం వచ్చినా దురదృష్టవశాత్తూ ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దర్శకుడు సనోజ్ పలు వివాదాల్లో చిక్కుకోవడంతో ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ తర్వాత సింగర్ ఉత్కర్ష్ తో ఒక మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఏకంగా సౌత్ లో అడుగుపెట్టబోతోంది. మలయాళంలో రూపొందనున్న ఈ సినిమా టైటిల్ - నాగమ్మ. కైలాష్ లాంటి సీనియర్ నటుడి సరసన మోనాలిసా కథానాయికగా నటించనుంది. సెప్టెంబర్ చివరిలో షూటింగ్ ప్రారంభించనున్నారు. మోనాలిసాకు అవకాశాలు కల్పిస్తున్నామంటూ చాలా మంది దర్శకులు ప్రకటించినా కానీ ఇప్పటివరకూ సినిమాలేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఒక సౌత్ సినిమాతో మోనాలిసా తెరంగేట్రం ఆసక్తిని కలిగిస్తోంది.