`సయ్యారా` చిత్రంతో కథానాయికగా పరిచయమైంది అనీత్ పద్దా. అహాన్ పాండే ఈ చిత్రంలో కథానాయకుడు. `ఆషిఖి 2` దర్శకుడు మోహిత్ సూరి దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. టైగర్ 3, వార్ 2 లాంటి భారీ చిత్రాలు డిజాస్టర్లుగా మారడంతో పూర్తిగా డీలా పడిపోయిన యష్ రాజ్ ఫిలింస్‌కి `సయ్యారా` బ్లాక్ బస్టర్ విజయం పెద్ద ఊరటనిచ్చింది.
ఇద్దరు డెబ్యూ తారల్ని యష్ రాజ్ ఫిలింస్ గ్రాండ్ గా లాంచ్ చేయడమే కాకుండా, యువతారలతో మూడు సినిమాల డీల్ కూడా కుదుర్చుకుంది. ముఖ్యంగా అందమైన కథానాయిక అనీత్ పద్ధాతో ఆదిత్య చోప్రా బృందం మూడు సినిమాల డీల్ కుదుర్చుకుందని గుసగుస వినిపిస్తోంది. అనీత్ కెరీర్ కి అంత పెద్ద బ్యానర్ అండగా నిలవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజా సమాచారం మేరకు `టైగర్ 3` దర్శకుడు మనీష్ శర్మ రూపొందించే రొమాంటిక్ లవ్ స్టోరిలో అనీత్ పద్దా నటించనుందని తెలిసింది. దీనిని యష్ రాజ్ ఫిలింస్ నిర్మించనుంది. మనీష్ శర్మ గతంలో శుధ్ దేశీ రొమాన్స్, బ్యాండ్ బాజా బారాత్ లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. అతడు తిరిగి తన జానర్ సినిమానే రూపొందిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి అనీత్ పద్దా ఎంపిక అదనపు ఆకర్షణగా మారనుంది. అయితే అనీత్ పద్దా ఇప్పుడు ప్రేమకథా చిత్రాలకు మాత్రమే యాప్ట్ గా కనిపిస్తోంది. అందువల్ల పదే పదే అలాంటి టైప్ కాస్టింగ్ (ఒకే తరహా పాత్రలు)ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని కూడా విశ్లేషిస్తున్నారు.