నిర్మాతలతో కార్మికుల గొడవకు పరిష్కారం కనిపించలేదు. ఐదురోజులు గడుస్తున్నా, చర్చల పేరుతో సినీపెద్దలు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫెడరేషన్ దిగి రాలేదు. 30 శాతం వేతనం పెంచితేనే సమ్మెను విరమిస్తామని కార్మిక ఫెడరేషన్ భీష్మించుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. కానీ ఏదీ ఫలించడం లేదని సమాచారం.
అయితే ఈ సమ్మె కారణంగా ఎవరికి ఇబ్బంది? అన్నది ఆరా తీస్తే.. ముగ్గురు మెగా హీరోలకు కచ్ఛితంగా ఇబ్బంది ఉంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ల సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. పవన్ - హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ కి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ప్లాన్ చేస్తున్నామని చెబుతున్నా, సమ్మె ప్రభావం అంతో ఇంతో ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర పెండింగ్ చిత్రీకరణతో పాటు, తదుపరి నయనతారతో అనీల్ రావిపూడి మూవీ షెడ్యూల్ ప్రారంభించాల్సి ఉంది. కానీ కార్మిక సమ్మెతో అందరి కాల్షీట్లు డిస్ట్రబ్ అవుతున్నాయి.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఒకటి సితార ఎంటర్ టైన్ మెంట్స్ మూవీ, అలాగే సుధాకర్ చెరుకూరితో సినిమా చిత్రీకరణల దశలో ఉన్నాయి. సితారలో మూవీకి మాంటేజ్ సాంగ్ షూట్ పెండింగ్ లో ఉందని తెలిసింది. సుధాకర్ చెరుకూరితో రవితేజ మూవీ సంక్రాంతి 2026 బరిలో విడుదల కానుంది. డిలే అయితే చెప్పిన సమయానికి సినిమాలను రిలీజ్ చేయడం కుదరదు.
మరోవైపు రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ మూవీ పెద్ది చిత్రీకరణను వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ సమ్మెతో చాలా ఇబ్బందికరంగా మారింది. ఇంకా బయటకు చెప్పుకోలేని నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అందుకే ఫెడరేషన్ తో చర్చలను ఫలవంతం చేసి సమ్మెకు ముగింపు పలకాలని అందరూ కోరుకుంటున్నారు. ఏం జరగనుందో వేచి చూడాలి.