కూలి చిత్రంలో కింగ్ నాగార్జున విలన్ గా చేస్తున్నారనే వార్త ఎప్పుడో రివీల్ అయ్యింది. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కలయికలో టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలి ఆగష్టు 14 న విడుదలవుతుంది. ఈరోజు హైదరాబాద్ జరిగిన మీట్ లో నాగార్జున తన విలన్ రోల్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నిన్నేపెళ్లాడతా చేసిన తర్వాత అన్నమయ్య చేస్తుంటే.. ఇప్పుడెందుకు ఇలాంటి కథ అని కొందరు నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయితే నాకు కొత్తదనం ఇష్టం. సెట్‌కు వెళ్లాక బోర్ కొట్టకూడదంటే డిఫరెంట్ పాత్రలు చేయాలి. ఆ ప్రయత్నంతోనే ఇంతకాలం పని చేశాను. కొన్ని దెబ్బలు తిన్నా. మంచి మంచి విజయాలూ అందుకున్నాను. ఒకరోజు లోకేశ్ నన్ను కలిసి మీరు విలన్‌గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా అన్నారు.
లోకేష్ ఖైదీ, విక్రమ్ నా ఫేవరట్ ఫిలిమ్స్. ఆ సినిమాలు చూసిన తర్వాత ఎప్పటికైనా ఈ దర్శకుడితో పనిచేయాలని బలంగా అనుకున్నా. కూలీ కథ చెప్పిన తర్వాత నాకు చాలా నచ్చింది. రజనీ సర్ ఈ కథ ఒప్పుకొన్నారా అని అడిగా. ఎందుకంటే ఈ కథలో సైమన్ పాత్ర కథలో ఆల్ మోస్ట్ హీరోలాంటిది. లోకేష్ హీరో విలన్స్ ని ఈక్వెల్ గా చూపిస్తాడు. నా కెరీర్‌లో మొదటిసారి లోకేశ్ కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నా. ఇంటికి వెళ్లాక మళ్లీ మళ్లీ విన్నా. నాకు అనిపించిన కొన్ని మార్పులు చెప్పా. మరొకరైతే, ఈజీగా తీసుకుంటారు. కానీ, నేను చెప్పిన విషయాలు పరిగణనలోకి తీసుకుని సైమన్ పాత్రను లోకేశ్ తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది.
రజనీ సర్ చెప్పినట్లు ఎప్పుడూ మంచి వాళ్లగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా (నవ్వుతూ). వైజాగ్‌లో మా ఫస్ట్ షూట్ జరిగింది. రెండో రోజు షూటింగ్ సందర్భంగా రికార్డు చేసిన వీడియో సోషల్‌మీడియాలో లీకై వైరల్ అయింది. అది సీన్ చూసి మనుషులు ఇంత ఈవిల్ గా ఉంటారా? అని లోకేష్ ని అడిగాను. ఇంతకంటే ఈవిల్ గా ఉంటారని చెప్పారు. మీలో లోపల కూడా ఒక ఈవిల్ ఉన్నారని చెప్పారు. క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కి అది కాంప్లీమెంట్ గా తీసుకున్నాను.
నాకు మూవీలో నెగెటివ్ రోల్ ఇచ్చినా ఈ పాత్ర చేసిన అనుభూతి పాజిటివ్‌గా ఉంది. సత్యరాజ్, శ్రుతిహాసన్, సౌబిన్, ఉపేంద్ర అందరూ చాలా అద్భుతంగా నటించారు. ఈ షూటింగ్ సమయంలో రజనీ సర్ స్వయంగా వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. అది ఆయన గొప్పదనం. నన్ను కలిసినప్పుడు కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. మీరు ఇలా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాగార్జున వద్దని లోకేశ్‌కు చెప్పేవాడిని అని అన్నారు.(నవ్వుతూ) ఆయనతో కూర్చొని మాట్లాడటం అద్భుతం. ఆయన యాక్టింగ్, స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని సినిమాలు చేసినా కూడా రజనీ సర్ పక్కకు వెళ్లి డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తారు.
థాయ్‌లాండ్‌లో 17 రోజుల పాటు రాత్రి పూట యాక్షన్ సీక్వెన్స్ తీశాం. దాదాపు 350మందికి పైగా చాలా కష్టపడ్డాం. చివరి రోజు మొత్తం అందరినీ రజనీ సర్ పిలిచి తలో ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లలకు ఏమైనా తీసుకెళ్లండి అన్నారు. అంత మంచి హృదయం ఉన్న వ్యక్తి ఆయన. ఆయన కలిసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇక అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా హిట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది.. అన్నారు నాగ్.