Advertisement
Google Ads BL

PR పంచ్: జనం నమ్మట్లేదు దొరా.!


బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం, నాగాస్త్రం వంటివి పురాణాల్లోని శక్తివంతమైన అస్త్రాలైతే... నేటి కపట ప్రపంచానికి మాత్రం ప్రధాన అస్త్రం ప్రచార అస్త్రమే !!

Advertisement
CJ Advs

పాల ప్యాకెట్ల నుంచీ పాలిటిక్స్ వరకు, పాన్ మసాలా నుంచి ప్యాన్ ఇండియా సినిమాల వరకు అన్నిటికీ అత్యవసరం అయిపోయింది అపరిమితమైన పబ్లిసిటీ. ముఖ్యంగా మూవీస్ ప్రమోషన్స్ అయితే వింత దారులు వెతుక్కుంటున్నాయి. వికృత పోకడలకు పోతున్నాయి. దానిపైనే ఈ సినీజోష్ స్పెషల్ స్టోరీ.

పర్స్ తో ప్రేక్షకుల పల్స్ మార్చేసే ప్రయత్నం !

మా క్రేజీ ప్రాజెస్ట్ గురించి రేపే అనౌన్స్ మెంట్ అంటారు 

(ఆ డీటైల్స్ ఆల్రెడీ మీడియాలో వచ్చేసి ఉంటాయి) 

ఆత్రం ప్రదర్శించే అభిమానుల కోసం ప్రీ లుక్ ఇస్తారు 

(ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ రెడీ అవుతాయి)

ఆపై ఫస్ట్ లుక్ వదులుతారు 

(ఆహా ఓహో అనే ఫీడ్ బ్యాక్ రప్పిస్తారు)

ఆన్ బోర్డ్ అంటూ ఒక్కొక్కరి పోస్టర్స్ పడుతుంటాయి. 

(ఏదో కొంతమంది తప్ప ఎవ్వరూ పట్టించుకోరు)

విరగబాదుడు మ్యూజిక్ తో టీజర్ వదులుతారు.

(విజువల్ గా బాగుంటేనే వర్కవుట్ అవ్వుద్ది)

ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అంటూ సాంగ్స్ వస్తూ ఉంటాయి 

(ఒక్కటి క్లిక్ అయినా ఓపెనింగ్స్ కి హెల్ప్ చేస్తుంది)

ఇక ఆఖర్లో తిమ్మిని బమ్మిలా చూపే ట్రైలర్ దిగుతుంది. 

(అదీ తేడా కొడితే మరో రిలీజ్ ట్రైలర్ ఉంటుంది)

అవసరం అనుకుంటే ఆకర్షించే కాంటెస్టులు 

ఆర్టిస్టులు అందుబాటులో ఉంటే కాలేజీలకు విజిట్లు

అట్టహాసంగా జరిపే ప్రీ రిలీజ్ ఫంక్షన్ సరేసరి.

ఇబ్బడి ముబ్బడిగా ఇంటర్ వ్యూలూ తప్పవు మరి.

ఓవరాల్ గా ఇన్నిరోజులు, ఇంత కష్టపడ్డా 

ఒకే ఒక్క షో తో జాతకం తేలిపోతోంది.

జనం ఇచ్చే తీర్పుతో గుండె జారిపోతోంది.

స్వయంగా బేతాళుడే ఈ సమస్యను విక్రమార్కుని ముందు ఉంచినా సమాధానం దొరికేదో లేదో కానీ మన సినీ పరిశ్రమలోని కొందరు త్రివిక్రమార్కులు తమ పర్స్ తో ప్రేక్షకుల పల్స్ మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు.

నెట్టింట రాజుకుంటున్న రచ్చ !

రేటింగ్ లతో ముప్పు - రివ్యూలది తప్పు అనడం అయిపోయింది.

పాపం అంతా పాప్ కార్న్ రేట్ల పైకి నెట్టేయడం పూర్తయింది.

ఓటీటీలకి అలవాటు పడ్డారని జనాన్ని నిందించడం జరిగింది.

ఇక చిట్టచివరిగా కనిపించింది నెట్టింట రాజుకుంటున్న రచ్చ.

టాప్ హీరోల సినిమాల నుంచి మిడ్ రేంజ్ హీరోల సినిమాల వరకూ అన్నిటికి షో స్టార్ట్ అవ్వడమే ఆలస్యం... అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా లైవ్ అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. అభిప్రాయాలతో పాటు ఆ సినిమా భవితవ్యాన్ని కూడా చెప్పేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన నేటి యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అక్కడ కూడా డబ్బులు వెదజల్లి పెయిడ్ పోస్టులు పెట్టిస్తున్నారు. అబ్బో బ్రహ్మాండం బద్దలైపోయింది అనే భ్రమ కల్పించి మరీ కామన్ ఆడియన్ కాసులు కాజేసే గాలం వేస్తున్నారు. 

పెయిడ్ క్యాపెయినింగ్ పుణ్యమా అని.!

స్టార్ హీరోలకైతే వీరాభిమానులు వుంటారు (అది ఏ ప్రాతిపదికన అయినా కావచ్చు). తెరపై ఆ హీరోలు కనిపిస్తే వీళ్ళకి పులకింతలు, కాలు కదిపితే చాలు పూనకాలు. ఆయా హీరోల సినిమాల రిలీజ్ లు అంటే పోటెత్తే పోస్టులు పడతాయి. పోటా పోటీగా వాదనలు జరుగుతాయి. అయితే ఇప్పుడు పెయిడ్ క్యాపెయినింగ్ పుణ్యమా అని అన్ని సినిమాలకీ అదే వరస. అందరిదీ ఒకే నస. టైటిల్ కార్డుకే గూస్ బంప్స్ అంటాడొకడు. ఇంట్రో సీన్ ఇరగ్గొట్టేసారు అంటాడు ఇంకొకడు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని, క్లయిమాక్స్ అరాచకమనీ అంటాడు మరొకడు. ఫలానా ఫైట్, ఫలానా సాంగ్, ఫలానా ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అనేసే మైండ్ లెస్ పోస్టులకైతే లోటుండదు. BGM భీభత్సం అనీ, సినిమాటోగ్రఫీ చించేశారనీ చెప్పేసే కుహనా మేధావులకూ కొదవుండదు. విశేషం ఏమిటంటే మళ్ళీ మళ్ళీ అదే అదే మ్యాటర్ వివిధ హ్యాండిల్స్ నుంచి పబ్లిష్ అవుతూ ఉంటుంది. అదేదో యునానిమస్ రెస్పాన్స్ అనే అపోహ కలిగిస్తుంది. తీరా అది నమ్మి థియేటర్ కి వెళితే గుల్ల పడిన జేబులతో తెల్ల మొహం వెయ్యాలి. కంటికి కనిపించని ఆ సోషల్ మీడియా శత్రువులతో బయటికి కనిపించని యుద్ధం చెయ్యాలి. ఆ అనుభవాన్ని కూడా ఇటీవల వరుసగా చవి చూసారు కనుక ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులపై సాధారణ ప్రేక్షకుల నుంచి ఒకే మాట వినిపిస్తోంది... మాకు నమ్మకం లేదు దొరా.!

అసత్యపు ప్రచారం.. అంతిమంగా విచారం !

నిజానికి ఇదంతా తాము ఎంతో ఖర్చుపెట్టి చేయిస్తున్నామని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో యువ నిర్మాత నాగవంశీ ఓపెన్ గానే ఒప్పుకున్నారు. ఫేక్ కలెక్షన్స్ తో పోస్టర్ వేయడం తమకూ తప్పలేదని అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం మీడియాతో చెప్పుకున్నారు. దాంతో పెయిడ్ పోస్టులు, ఫేక్ పోస్టర్ల గుట్టు రట్టయిపోయింది. హాష్ ట్యాగ్ తో టైటిల్ టైప్ చేసి ఆ సినిమాపై అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందామనే సగటు సినీ ప్రేమికుల ఆసక్తి సన్నగిల్లుతోంది. ఎప్పుడో శతాబ్దం క్రిందట పాల్ జోసెఫ్ గోబెల్స్ అనే జర్మన్ ప్రవేశపెట్టిన ప్రచారపు ప్రక్రియ ఆపై గోబెల్స్ ప్రచారం గా ప్రసిద్ధి చెందిన విషయం విజ్ఞులకు విదితమే. లేనిది ఉన్నట్టుగా చూపడం, గోరంతను కొండంతలుగా మార్చడమే గోబెల్స్ ప్రచారపు ప్రధాన సిద్ధాంతం. ఇప్పటివరకూ రాజకీయాల్లో మాత్రమే వినవచ్చిన ఈ పదం ఇప్పుడు సినిమాల విషయంలో కూడా చోటు చేసుకుంటోంది. అయితే అబద్ధపు ప్రచారం అంతిమంగా విచారాన్నే మిగుల్చుతుందనే విషయాన్ని విస్మరించకూడదు సుమా !!

- పర్వతనేని రాంబాబు ✍️ 

People not trusting fake posts:

People are annoyed by fake posts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs