షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన డాన్, డాన్ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో మూడో చిత్రం తెరకెక్కించేందుకు ఫర్హాన్ కి చెందిన ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ కొంతకాలంగా సన్నాహకాల్లో ఉంది. రణ్ వీర్ సింగ్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తుండగా, కృతి సనోన్ కథానాయికగా ఎంపికైంది. కియరా స్థానంలో కృతిని ఎంపిక చేసినట్టు కథనాలొచ్చాయి.
అయితే చాలా కాలంగా విలన్ పాత్రధారి కోసం వెతుకుతున్నా ఫర్హాన్ కి సరైన నటుడు దొరకడం లేదు. మొదట డాన్ 3లో విలన్ గా విక్రాంత్ మాస్సే నటిస్తున్నారని కథనాలొచ్చాయి. ట్వల్త్ ఫెయిల్ సహా పలు విజయవంతమైన చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్న విక్రాంత్ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు అనగానే అభిమానులు ఎగ్జయిట్ అయ్యారు. కానీ అతడు సృజనాత్మక విభేధాల కారణంగా డాన్ 3 నుంచి తప్పుకున్నట్టు కథనాలొచ్చాయి. ఆ తర్వాత తెలుగు హీరో విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. కానీ అతడు కూడా నటించడం లేదు. విజయ్ ప్రణాళికలకు నెగెటివ్ పాత్ర చేయడం ఇబ్బందిని సృష్టిస్తుంది. అందుకే కాదనుకున్నాడు. మరో హిందీ నటుడు ఆదిత్యా రాయ్ కపూర్ నటిస్తాడని కూడా గుసగుస వినిపించింది. కానీ ఇది కూడా నిజం కాలేదు.
తాజా సమాచారం మేరకు.. సల్మాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ 18 విజేత కరణ్ వీర్ సింగ్ ని ఫర్మాన్ బృందం ఎంపిక చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా కానీ, కరణ్ నట ప్రతిభ, స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫర్హాన్ ఆకర్షితుడయ్యాడని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ విజేత పంట పండినట్టే. 2026లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.