ముక్కు సూటిగా ఉన్న విషయాన్ని మాట్లాడేయడంలో సీనియర్ నటి కాజోల్ ఎప్పుడూ వెనకాడరు. సోషల్ మీడియాల్లో రకరకాల ప్రశ్నలకు కాజోల్ వెంటనే రియాక్టవుతున్నారు. ఇంతకుముందు ఈ జనరేషన్ నటీనటులు చాలా పోటీని ఎదుర్కొంటున్నరని, స్క్రిప్టు ఎంపికల నుంచి ప్రతిదీ కఠినంగా మారాయని, నటన పరంగాను మునుపటి తరాలతో పోలిస్తే ఈతరం చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారని కాజోల్ విశ్లేషించారు.
ఇటీవల ఈ భామ ఎనిమిది గంటల పని దినాల గురించి కూడా మాట్లాడారు. దీపికను స్పిరిట్ నుంచి తొలగించాక, బిడ్డ తల్లులకు పని సమయంలో వెసులుబాటు ఉండాలని సమర్థించారు. తాజాగా ది లల్లాంటాప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజోల్ సినిమాల్లో నటీనటుల మధ్య 30 సంవత్సరాల వయస్సు గ్యాప్ సరికాదని అభిప్రాయపడ్డారు.
ఈ రకమైన వివక్ష చాలా కాలంగా ఆమోదయోగ్యమైనదేనని భావిస్తున్నా.. దీనిని ఎవరూ నిలదీయలేదని అన్నారు. ఉదాహరణకు రజనీ సర్ లేదా ఏ ఇతర హీరోనైనా తీసుకోండి. తమ కంటే 30 ఏళ్లు చిన్నవాళ్ళతో పని చేయని ఒక్క నటుడు కూడా లేడు... అని అన్నారు. ఇది చాలా కాలంగా జరుగుతూనే ఉంది.. ఎవరూ నిజంగా దీనిని ప్రశ్నించలేదు.. ఎవరూ అడగలేదు.. ఇది ఎందుకు జరుగుతోంది? ఇది ఇంకా జరగాలా? మనం ఏం సందేశాన్ని పంపుతున్నాము? అని ప్రశ్నించారు.