ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అల్లు అరవింద్ మల్టీప్లెక్స్ రంగంలో దూసుకెళుతున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో కలిసి మల్టీప్లెక్స్ ల రంగంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్ అమీర్ పేట్ లో ప్రారంభించిన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ గొప్ప విజయం సాధించింది. ఇప్పుడు ఇతర నగరాలకు ఏఏఏ సినిమాస్ ని విస్తరించనున్నారని సమాచారం.
తొలిగా విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ లో AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఏషియన్ నారంగ్- అల్లు అరవింద్ బృందాలు ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇది ఆషాడం అయినా కానీ, ఇనార్బిట్ వర్గాల డిమాండ్ మేరకు వెంటనే ఈ నిర్మాణ పనుల్ని ప్రారంభించాల్సి వచ్చిందని , దాదాపు 9నెలల్లో పనులన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి నాటికి మల్టీప్లెక్స్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ ఏఏఏ సినిమాస్ తరహాలోనే అత్యంత విలాసవంతమైన యాంబియెన్స్ తో విశాఖ ఏఏఏ సినిమాస్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటీరియర్ డిజైన్స్ ని ఫైనల్ చేసారని తెలుస్తోంది. 2026 వేసవి నాటికి ఏఏఏ సినిమాస్ ఆకర్షణతో విశాఖ ఇనార్బిట్ లాంచ్ అవుతుందని కూడా కథనాలొస్తున్నాయి