`కాంతార` (2022) ఘన విజయం తర్వాత రిషబ్ శెట్టి రేంజ్ అమాంతం స్కైని తాకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కాంతారా ప్రీక్వెల్ `కాంతారా చాప్టర్ 1` చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రీక్వెల్ ప్రీలుక్ కి అద్భుత స్పందన వచ్చింది. మరోసారి దైవం అనే ఎలిమెంట్ కి చారిత్రక, జానపద ఇతి వృత్తాలను మేళవించి అతడు మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో భారీ ప్రయోగం చేయబోతున్నాడని అందిరికీ అర్థమైంది.
కాంతార చిత్రానికి రిషబ్ అన్నీ తానే అయ్యి పని చేసాడు. స్క్రిప్టు సహా దర్శకత్వంలో అతడు వందశాతం విజయం సాధించాడు. ఇక నటుడిగా పతాక స్థాయి అంటే ఏమిటో చూపించాడు. అందుకే ఇప్పుడు ప్రీక్వెల్ కోసం అతడు పారితోషికం అమాంతం పెంచేసాడని చర్చ సాగుతోంది. కాంతార చిత్రానికి రచించి దర్శకత్వం వహించిన శెట్టికి దాదాపు రూ. 4 కోట్లు చెల్లించారు. ఇది చాలా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ కాంతారా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ విజయం తర్వాత 2025లో విడుదలకు రానున్న మోస్ట్ అవైటెడ్ ప్రీక్వెల్ కోసం ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా అంది సమాచారం మేరకు ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 కోసం రూ. 100 కోట్ల పారితోషికం వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. దీనికి అదనంగా రిషబ్ లాభాల్లో వాటా అందుకునేలా భాగస్వామ్య ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాడు. ఇది సినిమా వర్కవుటయ్యే తీరును బట్టి లాభాల నుంచి వాటా రూ. 50 కోట్లు అదనంగా పెరిగే ఛాన్సుంటుందని అంచనా. ఆ మేరకు హోంబాలే ఫిల్మ్స్ తో ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు.
కాంతర చాప్టర్ 1 అక్టోబర్ 2025లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో పెద్ద ఎత్తున యుద్ధ సన్నివేశం ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికోసం 500 మందికి పైగా శిక్షణ పొందిన యోధులతో రిషభ్ ఢీకొడతాడని కూడా చెబుతున్నారు. ఈ ఒక్క సీన్ లో దాదాపు 3000 మంది కనిపిస్తారని తెలుస్తోంది. దీనిని 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా నిర్మించిన పట్టణంలో 45 నుండి 50 రోజులకు పైగా చిత్రీకరించారు. ఇది భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చిత్రీకరించిన అత్యంత భీకరమైన యాక్షన్ సన్నివేశాలలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.