హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హిందీ సహా దక్షిణాది అన్ని భాషల్లో ఈ చిత్రం అత్యంత భారీగా విడుదల కానుంది. YRF స్పై యూనివర్స్‌లో ఈ సినిమా ఒక భాగం. సిద్ధార్థ్ ఆనంద్ 2019 చిత్రం `వార్`కి సీక్వెల్.
గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కిన మొదటి భాగంలో హృతిక్ వర్సెస్ టైగర్ ష్రాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్, డ్యాన్సులు ఒక రేంజులో వర్కవుటయ్యాయి. అందుకే ఇప్పుడు ఉత్తరాది- దక్షిణాది స్టార్ల కలయికలో రూపొందుతున్న `వార్ 2`పైనా భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రంలో ఇద్దరు భిన్న నేపథ్యాలు, ప్రాంతాల నుంచి వచ్చిన డ్యాన్సింగ్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే వార్ 2 కథాంశం ఏమిటన్నది ఇప్పటివరకూ యష్ రాజ్ ఫిలింస్ కానీ, ఇతరులు కానీ రివీల్ చేయలేదు. తాజాగా అమెరికా టికెటింగ్ వెబ్ సైట్ ఫండగోలో వార్ 2 థీమ్ లీకైంది. ఈ వెబ్ సైట్ వివరాల ప్రకారం.. భారతదేశానికి అత్యంత ప్రమాదకర విలన్ గా మారిన కబీర్ ను ఆపేందుకు అతడి తర్వాత అంతటి వాడైన ఏజెంట్ విక్రమ్ ని భారత ప్రభుత్వం నియమిస్తుంది. అతడు అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన ఏజెంట్. కబీర్‌ను పట్టుకోవాలని బరిలో దిగిన విక్రమ్ అనే స్పెషల్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడని సమాచారం.
ఏజెంట్ విక్రమ్ కబీర్ తో సమాన హోదా ఉన్న ఆపీసర్. తన సొంత రాక్షస గ్యాంగ్ తో ముందుకు సాగే, కనికరంలేని టెర్మినేటర్. ఎలాగైనా కబీర్ పుర్రెలోకి బుల్లెట్ దించాలనే ప్రయత్నంలో ఉంటాడు. అదే క్రమంలో ఆ ఇద్దరూ తలపడటంతో అసలైన క్రూరమైన యుద్ధం మొదలవుతుంది. వారి రాకతో ప్రపంచం ఒక యుద్ధభూమిగా మారుతుంది. వారు ఒకరికొకరు ఎదురుపడితే పరిస్థితి భయానకంగా మారుతుంది. రక్తపాతం, హింసకు కొదవేమీ లేదు. భారీ యాక్షన్ తో ఇది నెవ్వర్ బిఫోర్ అనే విధంగా రూపొందుతోందని సమాచారం.