పాటల పూదోట విహారిగా అలుపెరగని పయనం సాగించారు స్వర మాంత్రికుడు, సంగీత జ్ఞాని ఇళయరాజా. కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ఒరిజినల్ సాంగ్ క్రియేషన్‌లో ఆయన లెజెండ్ అనడంలో సందేహం లేదు. దశాబ్ధాల కెరీర్ లో దాదాపు 4500 పాటల్ని సృజించిన అపర భగీరథుడు.. భారతీయ సినీరంగంలో సంగీత దర్శకుడిగా ఆయన ఒక చరిత్ర. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ అంతటి వాడు తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అని, తనకు ఎప్పుడూ స్ఫూర్తి అని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఇళయరాజాకు కోట్లాదిగా వీరాభిమానులున్నారు. ఎందుకంటే స్వరాల సృజనలో ఆయన శిఖరం.
కానీ ఇటీవల ఇళయరాజా వివాదాస్పద వైఖరి కొందరికి మింగడుపడని విషయం. ఆయన `ఈ పాట నాదే... సర్వ హక్కులు నాకే చెందుతాయి!` అని వాదిస్తూ న్యాయపోరాటానికి దిగడం అందరినీ విస్మయపరుస్తోంది. రాజా తన పాటల హక్కుల విషయంలో రాజీ అన్నదే లేని పోరాటం సాగిస్తున్నారు. ఇతరులు తన పాటను ఏదో ఒక కోణంలో ఉపయోగించుకుంటే ఆయన అస్సలు క్షమించరు. తన బాణీని పాక్షికంగా ఉపయోగించుకున్నా ఆయన ఒప్పుకోరు. కేసులు, కోర్టులు అంటూ చాలామంది ప్రముఖుల్ని రచ్చకీడుస్తున్నారు. రాయల్టీ కోసం, రైట్స్ కోసం ఇళయరాజా కోర్టుల పరిధిలో పోరాడుతున్నారు. ఇంతకుముందు చెన్నైలోని ప్రసాద్స్ స్టూడియోస్ లో తన ఖాన్ దాన్ ని ఖాళీ చేయనని మొరాయిస్తూ కోర్టులో పోరాడటం విస్మయపరిచింది. అది వేరొకరి ప్రాపర్టీ అయినా తనకు దానిపై హక్కులు ఉన్నాయని వాదించడం చర్చనీయాంశమైంది.
ఇది ఒక్కటే కాదు.. 80లలో ఇళయరాజా కంపోజిషన్స్ కి సంబంధించిన 30 సినిమాల పాటలపై హక్కులు తనకే పూర్తిగా చెందుతాయని గతంలో ఒక ప్రముఖ మ్యూజిక్ కంపెనీపైనే పోరాడిన ఇళయరాజా, ఆ తర్వాత కూడా తన సినిమాల నుంచి ఎక్కడైనా కాపీ చేసారని అనుమానించిన ప్రతి సంగీత దర్శకుడు లేదా చిత్ర నిర్మాత పైనా కేసులు భనాయించి కోర్టుల్లో పోరాడారు. ఇంతకుముందు మంజుమ్మల్ బోయ్స్ లాంటి బ్లాక్ బస్టర్ మలయాల మూవీ నిర్మాతలు రాజాతో రాజీ బేరం కుదుర్చుకోవడానికి బిగ్ డీల్ మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఆయన మొండి పట్టు ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవాలి. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా పాట విషయంలోను రాజా అంతే ఇదిగా పట్టుబట్టారు. తన స్వరాలను అనుమతి లేకుండా కాపీ చేసారని ఆయన ఫైట్ చేస్తున్నారు. తన సినిమాల్లోని మూడు క్లాసిక్ పాటల్ని కాపీ చేసినందుకు 5 కోట్లు రాయల్టీ చెల్లించాలని రాజా కోర్టులో పోరాడుతున్నారు. తన అనుమతి లేకుండా పాటల్ని కాపీ చేసినందుకు చిత్ర నిర్మాతలు పబ్లిగ్గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే మ్యాస్ట్రో ఇళయరాజా ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నిజానికి ఒక పాట పుట్టుక ఎలా మొదలవుతుంది? సంగీత దర్శకుడు ట్యూన్ కట్టాలంటే సదరు సన్నివేశాన్ని వివరించే దర్శకుడు ఉండాలి. సందర్భోచితంగా సాహిత్యం అందించే గీత రచయిత ఉండాలి. అంతే మధురంగా ఆలపించే గాయని, గాయకులు కావాలి. అలాగే స్టూడియోలో రికార్డింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకుని మంచి ఔట్ పుట్ తో పాట బయటకు రావాలంటే కచ్ఛితంగా పెట్టుబడులు పెట్టే నిర్మాత కావాలి. నిజానికి సంగీత దర్శకుడు, గాయనీ గాయకులు, రచయితలు అందరికీ పారితోషికం చెల్లించేది నిర్మాత కాబట్టి, ఆ పాటపై సర్వ హక్కులు నిర్మాతకే చెందుతాయని గతంలో న్యాయస్థానాలు తీర్పును వెలువరించాయి. రాయల్టీ మొత్తం నిర్మాతకే చెందుతుందని ఇంతకుముందు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అయితే పాట విషయంలో సంగీత దర్శకుడికి రాయల్టీ దక్కాలని ఇళయరాజా కోర్టుల్లో పోరాడటం అందరికీ షాకిచ్చింది. 80 వయసులో ఆయన ఎనర్జిటిక్ గా పోరాడుతుంటే కొందరు వృద్ధాప్యం వచ్చే కొద్దీ చాదస్తం పెరుగుతోందని విమర్శించారు. అయినా ఆయన వైఖరి మారలేదు. ఇతరుల అభిప్రాయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తన మార్గాన్ని తాను అనుసరిస్తున్నారు.
నిజానికి రాజాను అమితంగా ప్రేమించి ఆరాధించే వీరాభిమానులు దీనిని తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. ఒక మ్యూజిక్ లెజెండ్ పాటల్ని తమ సినిమాల్లో నేటితరం స్ఫూర్తి పొంది ఉపయోగించుకుంటే అది సరైన నివాళి అవుతుందని అంటున్నారు. ఇళయరాజా గౌరవం పెంచే ప్రయత్నమే కదా అనే వాదిస్తున్నారు. ఇళయరాజా అభిమానులుగా వారు ఆయన పాటల నుంచి స్ఫూర్తి పొంది కొత్త పాటల్ని సృజించే ప్రయత్నం చేయడం తప్పు ఎలా అవుతుంది? ఒక లెజెండరీ సంగీత దర్శకుడికి వారు ఇచ్చే నివాళిగా దీనిని అర్థం చేసుకోవాలి కానీ అయినదానికి కానిదానికి ఎందుకింత రచ్చ? అన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదానికి కోర్టులు, కేసులు, గొడవలు సమంజసమేనా? ఒక సీనియర్ ని, దిగ్గజ సంగీత దర్శకుడిని స్ఫూర్తిగా తీసుకుని నేటితరం ఎంతో సాధించాలని వెటరన్ సంగీత దర్శకుడు ఎందుకు కోరుకోవడం లేదు? ఇప్పుడు పుట్టుకొచ్చేవారంతా ఆయన స్కూల్ విద్యార్థులేనని భావించి దీనిని ఎందుకు లైట్ తీస్కోవడం లేదు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే రాయల్టీలు, రైట్స్ అంటూ వివాదాలతో ఆర్జనకు ఇది కొత్త మార్గం!.. దీనిని ఇళయరాజాకు లాయర్లు నూరి పోస్తున్నారని కూడా కొందరు ఊహాగానాలు సాగిస్తున్నారు. రాజాకు లేని ఐడియా ఇచ్చి ఇలా పబ్లిక్ లో విలన్ ని చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఆయన ఇలాంటి చాదస్తంతో హ్యుమానిటీ గ్రౌండ్స్ లో `రాయల్టీ`ని ఎందుకు కోల్పోవాలి? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
-పర్వతనేని రాంబాబు✍️