సినీజోష్ రివ్యూ: శంబాల
నటీనటులు: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, శ్వాసిక విజయ్, మధు నందన్, హర్ష వర్ధన్, రవి వర్మ, శివ కార్తీక్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్
ఎడిటర్: శర్వన్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నిర్మాతలు: మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు
దర్శకత్వం: యుగంధర్ ముని
విడుదల తేదీ: 25-12-2025
థియేటర్స్ కి తిరుగులేని క్రౌడ్ పుల్లర్
అందర్నీ ఆకర్షిస్తోన్న రియల్ కిల్లర్
మిస్టిక్ థ్రిల్లర్ !!
సరిగ్గా ఇదే జోనర్ ని ఏరికోరి ఎంచుకున్నాడు
ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్న ఆది సాయికుమార్.
టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన శంబాల టీజర్ అండ్ ట్రైలర్స్ తో మాంచి మిస్టికల్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ తెచ్చుకుంది. ప్రభాస్, నాని, సాయి తేజ్, సందీప్ కిషన్, అనిల్ రావిపూడి, థమన్ వంటి వారంతా అండగా నిలవడంతో శంబాల ప్రమోషన్స్ పీక్ కి చేరుకున్నాయి. ఫైనల్ గా నిన్న ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ తెచ్చుకున్న శంబాల నేడు ఘనంగా విడుదలైన నేపథ్యంలో ఈ చిత్రం రిజల్ట్ ఏంటో, దక్కుతున్న రిసెప్షన్ ఎలా వుందో, ఆది సాయికుమార్ కి ఆశించిన కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో రివ్యూలో చూద్దాం.
శంబాల.. కథగా ఏం చెప్పింది ?
వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన శంబాల అనే ఊరిలో ఆకాశం నుంచి ఓ ఉల్క పడుతుంది. అప్పట్నుంచి అక్కడ జనాల విచిత్ర ప్రవర్తనలు, హత్యలు, ఆత్మహత్యలతో ఊరు ఊరంతా అట్టుడికిపోతుంది. తమకేదో బండ భూతం ఆవహించేసిందనే మూఢ నమ్మకంతో గ్రామస్తులంతా భయబ్రాంతులకు లోనవుతారు. ఆ విపత్కర పరిస్థితిని చక్కదిద్ధేందుకు ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయికుమార్) అనే శాస్త్రవేత్తను నియమిస్తుంది. ఓ శాస్త్రవేత్తగా పూర్తిగా సైన్స్ నే నమ్మే విక్రమ్ ఆ ఊరిలో జరిగే వింత సంఘటనలను ఎలా విశ్లేషిస్తాడు, ఏ విధంగా పరిష్కరిస్తాడు, ఈ ప్రాసెస్ లో ఎటువంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తాడు అనేదే శంబాల కథ.
శంబాల.. కథనం ఎటు సాగింది ?
1980 నేపథ్యంతో సాగే ఈ కథలో ఆ ఊరి చరిత్ర వెనుక దాగిన శాస్త్రానికి.. సైంటిస్ట్ విక్రమ్ నమ్మే సైన్సుకీ కరెక్ట్ కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ చేయడమే శంబాలకు మెయిన్ ప్లస్ పాయింట్ అయింది. ఉత్కంఠ రేకెత్తించే రహస్య కోణంతో ఒక ఊరి కథగా ప్రారంభమై పలు గగుర్పొడిచే సన్నివేశాలతో కథా గమనం పరుగులు పెడుతుంది. అందులో భలేగా అనిపించేవి కొన్ని. భయపెట్టేవి ఇంకొన్ని. మొత్తానికి చకచకా సాగిన కథనం విరామ ఘట్టంతో ప్రేక్షకుడి ఆసక్తిని తారాస్థాయికి చేరుస్తుంది. ప్రథమార్ధమంతా ప్రశ్నలతో నింపేసిన దర్శకుడు ద్వితీయార్ధంలో అసలు సిసలు శంబాల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారు. ఊరి దేవత చరిత్ర, అరిషడ్వార్గాల కోణం, ఉల్క పడే పరిణామం వంటి అంశాలతో ప్రతి ప్రశ్నకు ప్రేక్షకుడికి సముచిత సమాధానం ఇవ్వడం దర్శకుడి ప్రతిభకు తార్కాణం. సినిమా ముగింపు దశకు చేరేసరికి హీరో చేసే పోరాటం అబ్బురపరుస్తుంది, చిన్నారితో ముడిపెట్టడం భావోద్వేగాన్ని పంచుతుంది కానీ ఆద్యంతం ఉత్కంఠభరితంగానే అనిపించడంతో శంబాల సక్సెస్ సంభవం అనేది అలవోకగా జరిగిపోయింది.
శంబాల.. ఆదిని ఎలా చూపించింది ?
వరుసగా సినిమాలు చేస్తున్నా, ఓటీటీలో అవి బాగానే రీచ్ పొందుతున్నా సరైన థియేట్రికల్ సక్సెస్ లేక సఫర్ అవుతున్న ఆది సాయికుమార్ కి వరంలా దొరికింది శంబాల స్క్రిప్ట్. జనం మెచ్చే జానర్ నీ, తనకు నప్పే పాత్రనీ ఎంచుకోవడంలో పరిణతి చూపిన ఆది సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో తన నట ప్రతిభనూ ప్రదర్శించాడు. ఇన్ని డ్యూయెట్లు కావాలి, అన్ని ఫైట్లు ఉండాలి అనే లెక్కలకు పోకుండా కథకు, కథలోని పాత్రకు సరైన న్యాయం చేస్తూ సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో శెభాష్ అనిపించుకున్నాడు ఆది. అతను ఆశించిన కమ్ బ్యాక్ సక్సెస్ శంబాల అందించడం ఇక అనివార్యమే అనొచ్చు. కథానాయిక అర్చన అయ్యర్ క్యారెక్టర్ ఆడియెన్సుని థ్రిల్ చేస్తుంది. రవి వర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్, శ్వాసిక, శైలజ, బేబీ చైత్ర, తదితరుల పాత్రలు సైతం కథలో భాగంగా కలిసిపోయి కథనం రక్తి కట్టేందుకు కారణమయ్యాయి.
శంబాల.. టీమ్ ఎంత ఎఫర్ట్ పెట్టింది ?
శంబాల టీమ్ లో మొదటగా అభినందించాల్సింది దర్శక, నిర్మాతలనే. ఓ మిస్టికల్ థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని అంశాలను మేళవిస్తూ కథని రాసుకున్న విధానంలో దర్శకుడు యుగంధర్ ముని కన్విక్షన్ కనిపిస్తే, దాన్ని తెరపైకి తీసుకురావడంలో నిర్మాతలు మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు చూపిన రాజీ పడని ధోరణి తెలుస్తుంది. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ సినిమాని మరో స్థాయికి చేర్చింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందుకు మరింతగా తోడ్పడింది. ఎడిటిండ్ అండ్ ఆర్ట్ విభాగాలు కూడా తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించాయి.
శంబాల.. ఎంతవరకూ ఆకట్టుకుంటుంది ?
ఓవరాల్ గా శంబాల ఎలా ఉందనే ఎనాలసిస్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్ మొత్తం ఉత్సుకత రేపుతోంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉత్కంఠను పెంచుతుంది. ఆపై సెకండాఫ్ లో అన్ని క్వశ్చన్సుకి కన్విన్సింగ్ ఆన్సర్ లభిస్తుంది. సంతృప్తికరమైన ముగింపుతో ప్రేక్షకుడిని పంపిస్తుంది. VFX ఇంకా బెటర్ గా ఉండాలని చెప్పే విమర్శకులు ఈ బడ్జెట్ లో ఇటువంటి అవుట్ ఫుట్ తేవడం వెనుక నిర్మాతల కృషిని మరిచిపోకూడదు. అలాగే ముగింపు మరికాస్త బలంగా ఉండాలని కోరుకునే విశ్లేషకులు దర్శకుడు మరో భాగం ఉందని చెప్పిన విషయాన్ని విస్మరించకూడదు. మిగతా జనాలకు మాత్రం ఇది నచ్చే సినిమానే. మిస్టిక్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారందరూ మెచ్చే సినిమానే.
పంచ్ లైన్ : శాటిస్ ఫై చేసేలా.. శంబాల !
సినీజోష్ రేటింగ్ : 3/5