సినీజోష్ రివ్యూ : OG (They Call Him OG)
నిర్మాణ సంస్థ : డి వి వి ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు : పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, అజయ్ ఘోష్, అభిమన్యు సింగ్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు
సినిమాటోగ్రఫీ : రవి కె. చంద్రన్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సంగీతం : ఎస్ ఎస్ థమన్
నిర్మాత : డి వి వి దానయ్య
రచన, దర్శకత్వం : సుజీత్
విడుదల తేదీ : 25-09-2025
రెండేళ్లుగా అభిమానులు కలవరిస్తోన్న పేరు
రెండు నెలలుగా మరింత పెరిగిన జోరు
రెండు వారాలుగా చేరిపోయింది టాప్ గేరు
రెండు రోజులుగా రెండు రాష్ట్రాల్లో ఒకటే హోరు
OG - OG - OG
ప్లాన్డ్ పబ్లిసిటీ జరగలేదు. ప్రాపర్ ప్రమోషన్స్ కుదరలేదు. అయినా OG ఫీవర్ వ్యాపించింది. అంతటా OG మ్యానియా కనిపించింది. బాహుబలి 2, పుష్ప 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల తరువాత మళ్ళీ ఆ రేంజ్ హైప్ తో, అన్ని చోట్లా ప్రీమియర్స్ తో, అద్భుతమైన ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ హంట్ స్టార్ట్ చేసాడు OG. మరి కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ అండ్ ఫ్యాన్ బేస్ ఆధారంగా అపరిమిత అంచనాలతో వచ్చిన ఈ క్రేజీ OG అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయిందా, సగటు ప్రేక్షకుడిని శాటిస్ ఫై చేయగలిగిందా అనే అంశంపై సినీజోష్ OG స్టైల్ రివ్యూ.!
OG - Original Game
ముందునుంచీ అందరు అనుకున్నట్టే ప్యూర్ గ్యాంగ్ స్టర్ డ్రామా OG. సింపుల్ గా చెప్పాలి అంటే ఓ దశలో ముంబైని వణికించి వెళ్లిన ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) అనే భయంకరమైన గ్యాంగ్ స్టర్ ఓ దశాబ్దం తర్వాత మళ్ళీ ముంబైకి రావడం, ఓమి అనేవాడిని ఈ ఓజీ అంతం చేయడం అనేదే కథ. నిజానికి జానర్ ప్రకారం గ్యాంగ్ స్టర్ డ్రామా అనాలి తప్ప ఇందులో గ్యాంగ్ స్టర్స్ హడావిడి మరీ ఎక్కువ. డ్రామా చాలా తక్కువ. హీరో ఎలివేషన్లు స్ట్రాంగు. అసలు విలనిజం వీకు. కానీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్ కథా లోపాన్ని కనిపించకుండా కాపాడాయి.. ఓవరాల్ గా OG ని ఓకే అనిపించేలా చేసాయి.
OG - Original Glow
కథ కాసింతే వున్నా కావాల్సినంత మసాలా దట్టించిన దర్శకుడు సుజీత్ పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చాడు. పవన్ ఇంట్రో సీన్ తోనే తన కల్ట్ ఫ్యానిజాన్ని చాటుకున్న సుజీత్ అడుగడుగునా ఎలివేషన్ సీన్స్ తో అభిమానులని అలరించాడు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే సుజీత్ వీరంగానికి థమన్ తాండవం తోడై OG జోష్ ని ఓ రేంజ్ కి చేర్చింది. ఆపై వచ్చే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ పవర్ స్టార్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ సీక్వెన్స్ గా నిలుస్తుంది. తరువాతి కథనం కాస్త నిదానించినా క్లయిమాక్స్ మళ్ళీ మంచి ఊపుతోనే ముగుస్తుంది. ముఖ్యంగా పవన్ జానీ, ట్రావెలింగ్ సోల్జర్ రిఫరెన్సులని క్లయిమాక్స్ ఎపిసోడ్ కి కరెక్ట్ గా కనెక్ట్ చేసిన విధానం సుజీత్ లోని ఫ్యానిజానికి నిలువెత్తు నిదర్శనం. లెక్కకు మిక్కిలి క్యారెక్టర్లతో కాస్త కన్ ఫ్యూజ్ చేసినా ఎక్కడ తిరగాల్సిన మలుపులు అక్కడ తిరిగే మెరుపులతో OG కి ఒరిజినల్ గ్లో అయింది సుజీత్ స్క్రీన్ ప్లే.
OG - Original Goat
కొన్నాళ్లుగా వరుస రీ మేకులతో ఫ్యాన్సుని విసిగించిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఒరిజినల్ సినిమాల బాట పట్టారు. మరీ ముఖ్యంగా OG లో తన ఒరిజినల్ శ్వాగ్ చూపించి అదరగొట్టారు. స్వతహాగా తనకి వున్న మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ఓజాస్ గంభీర పాత్రకు ఆపాదిస్తూ స్టయిలిష్ యాక్షన్ ఫీట్స్ తో మెస్మరైజ్ చేసారు పవన్. అలాగే సినిమా అంతా సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేసినా పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ లో మాత్రం చెలరేగి చెడుగుడు ఆడేసారు. మొత్తంగా OGకి Original Goat అని చెప్పదగ్గ పవన్ తన కాస్ట్యూమ్స్ తో, క్యారెక్టర్ కి తగ్గ బాడీ లాంగ్వేజ్ తో, పదునైన నటనతో, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కి OGగా ఓ రేంజ్ ట్రీట్ ఇచ్చారు. ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు కెమెరా ముందుకు రాగానే ఆ పాత్రలా మారిపోవడం, దానికి తగ్గ న్యాయం చేయడం నిజంగా అభినందించదగ్గ విషయమేనండోయ్.!
OG - Original Grace
సినిమాలోని సాలిడ్ స్టార్ క్యాస్ట్ OG కి ఒరిజినల్ గ్రేస్ గా నిలిచింది. OG తో పోరుకి సై అనే ఓమి పాత్రలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఇమిడిపోయారు. విలనిజం వీక్ గానే ఉన్నా తన అప్పియరెన్స్ తో ఆ రోల్ కి స్ట్రెంగ్త్ ఇచ్చారు. ఓజాస్ వైఫ్ కన్మణిగా ప్రియాంక మోహన్ ఆకర్షణీయంగా ఉంది కానీ ఆమెది పరిమితి కలిగిన పాత్ర మాత్రమే. శ్రీయా రెడ్డి ఉన్నంతలో ఉనికిని చాటుకుంటే.. ప్రకాష్ రాజ్ ఎప్పట్లాగే తనదైన తీరుని చూపించాడు. అర్జున్ దాస్ ని, అతడి బేస్ వాయిస్ ని OG టీజర్ ఎలివేషన్ కి ఉపయోగించుకున్నట్టే సినిమాలోనూ బాగానే వాడేసాడు సుజీత్. శుభలేఖ సుధాకర్, అజయ్ ఘోష్, అభిమన్యు సింగ్, రాహుల్ రవీంద్రన్ ఇలా తెరపై కనిపించే నటీనటులు ఎందరో ఉన్నారు కానీ అందరివీ అంతంత మాత్రం పాత్రలే. ఎంత కావాలో అంత కనిపించేవే !
OG - Original Gold
అలాగే OG కి ఒరిజినల్ గోల్డ్ టెక్నిషియన్స్ అని చెప్పొచ్చు. మెయిన్ గా రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ కళ్ళు చెదిరేలా ఉంది. ప్రతి ఫ్రేమ్ లోను తన ప్రత్యేకతను చూపించిన రవి కె చంద్రన్ కథా నేపథ్యం పట్ల ఎంత శ్రద్ద తీసుకున్నారో యాక్షన్ ఎపిసోడ్స్ కి అంతకు రెండింతలు కేర్ ప్రదర్శించారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ OG కి మరో ప్లస్ పాయింట్. స్టంట్ కొరియోగ్రాఫర్స్ కి చేతినిండా పని దొరికింది. స్టైలిష్ యాక్షన్ కంపోజ్ చేసే ఛాన్స్ కుదిరింది. అలాగే ఆర్ట్ డిపార్ట్ మెంట్, కాస్ట్యూమ్స్ డిపార్ట్ మెంట్, మేకప్ డిపార్ట్ మెంట్స్ పనితనం కూడా ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మేకింగ్ లో కీ రోల్ ప్లే చేసాయి.
OG - Original Gem
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పవర్ ఏమిటో OGతో ప్రూవ్ చేస్తానని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చిన థమన్ అన్నంత పనీ చేసాడు. అదరగొట్టేసాడు. OGలోని ఫైర్ స్టోర్మ్ తోనే ట్రెండీ సౌండింగ్ కి శ్రీకారం చుట్టిన థమన్ సినిమాలోని నేపథ్య సంగీతం కోసం ఎక్కడెక్కడి వాయిద్యాలనో వాడి, ఎన్నెన్నో ప్రయోగాలు చేసి సరికొత్త సంగీతాన్ని సృష్టించాడు. సాంగ్స్ కంటే BGM పైనే ఎక్కువ ఫోకస్ చేసాడేమో అనుకునేలా స్క్రీన్ పై జరిగే ప్రతి సీన్ కీ ఇంపాక్ట్ పెంచుతూ, యాక్షన్ బ్లాక్స్ కి ఇంకాస్త ఇంటెన్స్ యాడ్ చేస్తూ Original Gem of OG అనిపించుకున్నాడు థమన్.
OG - Original Genius
పవన్ కళ్యాణ్ కి కథ చెప్పడం కష్టం. చెప్పి ఒప్పించడం ఇంకా కష్టం. ఆ రెండిటినీ త్రివిక్రమ్ అండతో దాటేశాడు కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అనే చాలా పెద్ద కష్టం అధిగమించడానికి మూడేళ్లు పట్టింది దర్శకుడు సుజీత్ కి. ఎన్నికల ప్రచారం, ఆపై గెలుపు, పదవి, బాధ్యతలు ఇలా ఎంతో బిజీ అయిపోయిన పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సద్వినియోగం చేసుకుంటూ, క్యారెక్టర్ కంటిన్యుటీ, ఇంటెన్సిటీ బ్యాలెన్స్ చేసుకుంటూ షూట్ కంప్లీట్ చేయడం అంటే అదే సుజీత్ కి అతి పెద్ద సక్సెస్. అభిమానిగా కమిట్ మెంట్ - దర్శకుడిగా కన్విక్షన్ రెండూ చూపిస్తూ OGని హై స్టాండర్డ్స్ లో తెరకెక్కించిన తీరు సుజీత్ కి అందరి అభినందనలు అందేలా చేస్తోంది. సాహోతో తృటిలో మిస్ అయిన సాలిడ్ సక్సెస్ ఈసారి గర్వంగా పొందేలా చేస్తోంది.
OG - Original Gain
కూల్ అండ్ కామ్ ప్రొడ్యూసర్ దానయ్యకు భలే మంచి ప్రాజెక్టులు తగులుతోన్న తరుణమిది. టాలీవుడ్ ప్రైడ్ రాజమౌళి ప్లాన్ చేసిన తిరుగులేని మల్టీ స్టారర్ RRR ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్సు కారణంగా దానయ్య బ్యానర్ కే దక్కింది. అలాగే పవన్ CMGR టైమ్ లో ఇచ్చిన మాట ప్రకారం OG కుదిరింది. నిర్మాణంలో జాప్యం జరిగినా హై రేంజ్ క్రేజ్ తో స్కై లెవెల్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన OGకి ప్రస్తుతం అంతటా మంచి రెస్పాన్సే వస్తోంది కనుక నిర్మాతగా దానయ్య మరో జాక్ పాట్ కొట్టినట్లే. దాదాపు ౩౦౦ కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన OG ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే వంద కోట్ల మార్కుని దాటేస్తోంది. ఇక ఫ్యాన్స్ సపోర్ట్, పాజిటివ్ రిపోర్ట్, లాంగ్ వీకెండ్ ఉండనే ఉన్నాయి కనుక బ్రేక్ ఈవెన్ అనేది కేక్ వాక్ అంటోంది ట్రేడ్ వర్గం. కాదు కాదు రికార్డు బ్రేకింగ్ రెవిన్యూ చూస్తారంటోంది మరో వర్గం. అఫ్ కోర్స్.. అభిమానులకైతే ఒరిజినల్ గిఫ్ట్ అనిపించే ఈ OG జనరల్ ఆడియన్సుకి కూడా కనెక్ట్ అయిందంటే జాతరే బాక్సాఫీసుకి !!
పంచ్ లైన్ : OG - Original Gift for fans !
సినీజోష్ రేటింగ్ : 3/5