Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : కూలీ


సినీజోష్ రివ్యూ : కూలీ 

Advertisement
CJ Advs

నిర్మాణం : సన్ పిక్చర్స్ 

నటీనటులు : రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ సాహిర్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర మరియు ఆమిర్ ఖాన్ తదితరులు 

సంగీతం : అనిరుధ్ రవిచందర్ 

సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్

నిర్మాత : కళానిధి మారన్

రచన, దర్శకత్వం : లోకేష్ కనగరాజ్

విడుదల తేదీ : 14-08-2025

వ్యక్తిగా ఏడు వసంతాల వయసు 

యాక్టర్ గా ఐదు దశాబ్దాల మెరుపు 

నేటికీ తరగలేదు తన జనాకర్షణ 

నేటి తరంతోనూ పోటీ పడే నట విలక్షణ 

సూపర్ స్టార్ రజినీకాంత్ 

వయసు మీద పడుతున్నా వరస మార్చేదే లేదంటూ యంగ్ డైరెక్టర్స్ తో జత కడుతోన్న రజిని ఈసారి కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. అండగా మన టాలీవుడ్ కింగ్ నాగార్జునని, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నీ, శాండల్ వుడ్ స్టార్ ఉపేంద్రనీ పెట్టుకుని కూలీగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి తారా స్థాయికి చేరిన అంచనాల వల్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ కూలీ ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ కి వచ్చిన సగటు ప్రేక్షకుడిని కూల్ చేశాడా లేక ఫూల్ చేశాడా అనేది ఇప్పుడీ రివ్యూ లో చూద్దాం .!

సబ్జెక్ట్ సో సో... క్యాస్టింగ్ సూపరహో.!

కథగా చూసుకుంటే ఈ కూలీని రజిని కెరీర్ బిగినింగ్ డేస్ కి తోసేయ్యొచ్చు. తన స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకునే ఒక పాత చింతకాయ పచ్చడిని అచ్చంగా తీసుకొచ్చి దానికి స్టైలిష్ మాసీ లుక్ ఇచ్చే ప్రయత్నం చేసారు లోకేష్ కనగరాజ్. అయితే సబ్జెక్ట్ సో సో అని తేల్చేసినా అందుకు ఎన్నుకున్న స్టార్ క్యాస్టింగ్ ఈ కూలీకి కాస్త కొత్త కలర్ ఇచ్చింది. ఆయా పాత్రల తీరుతెన్నులు, వాటి హంగామా ప్రథమార్ధం వరకూ బండిని లాగేసినా ద్వితీయార్ధం మాత్రం దొరికేసాడు దర్శకుడు. కథలో ఉన్న మేటర్ ఇదేనంటూ, ఇక బాధ్యత క్యాస్టింగ్ దే నంటూ జారిపోయాడు. అయితే అభిమానులకి నచ్చే స్టార్ కాస్ట్ ఉంది కనుక ఓకే అనిపించుకోగలిగిన కూలీ జనం చెల్లించిన మొత్తానికి తగిన కూలీ చేసానని అనిపించుకోవడంతో ఈ సినిమా గట్టెక్కింది. 

స్క్రీన్ ప్లే వీక్.. స్క్రీన్ ప్రెజెన్స్ వీర లెవెల్.!

కూలీ స్క్రీన్ ప్లే పడి లేస్తున్నా జనం కొంచెం కూల్ గా చూడగలిగారంటే అందుకు కారణం స్టార్స్ స్క్రీన్ ప్రెజెన్సే. దేవాగా రజినీకాంత్ తనదైన స్టైల్ అండ్ మేనరిజమ్స్ తో ఎంటర్ టైన్ చేస్తే, తనకు ఇచ్చిన స్కోప్ లోనే సైమన్ గా చెలరేగిపోయారు నాగార్జున. ఆమిర్ ఖాన్ రోల్ విక్రమ్ లోని రోలెక్స్ ని తలపిస్తే, ఉపేంద్ర పాత్ర ఉన్నంతలో ఉనికిని చాటుకుంది. సత్యరాజ్, శృతి హాసన్ క్యారెక్టర్స్ వారికి అలవాటైనవే. మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ మాత్రం బలమైన నటనతోనే కాదు నృత్యంతో కూడా బలమైన ముద్ర వేసాడు. ఓవరాల్ గా కథనంలో కుంటుతూ సాగిన కూలీకి ఈ స్టార్స్ స్క్రీన్  ప్రెజెన్సే సాయపడింది అనడంలో సందేహం లేదు.

ఫాలో అయ్యాడు.. డీలా పడ్డారు.!

కమల్ హాసన్ తో విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన విధానాన్నే కూలీకి కూడా ఎంచుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అక్కడ కొడుకు కి జరిగిన అన్యాయం విషయంలో కమల్ రియాక్ట్ అయితే ఇక్కడ ఫ్రెండ్ కోసం రజిని రియాక్ట్ అవడం. సేమ్ సెటప్. సేమ్ టీమ్. సేమ్ స్కేల్. బట్ సేమ్ రిజల్ట్ వస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే అక్కడున్న మేజిక్ ఇక్కడ మిస్ అయింది. అప్పుడు కుదిరిన ఎమోషన్ ఇప్పుడు లోపించింది. ఫ్యాన్స్ స్టఫ్ అయితే ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు కానీ ఈసారి తన మార్క్, తనదైన స్పార్క్ కోల్పోయారు లోకేష్.

స్టార్సే హలం.. ఫ్యాన్సే బలం.!

ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉన్నా జనం చూడనంతవరకే. టాక్ రానంతవరకే. ఇప్పటికే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. సినిమాలో విషయం గురించి  రివీల్ అవుతోంది. మరిక ఈ కూలీని చూసేందుకు ఎవరెంతవరకు ఖర్చు పెట్టొచ్చనే విషయం వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతం అయిపోతోంది కనుక ఇక భారం తారలదే. బాక్సాఫీస్ పొలాన్ని దున్నాల్సిన హలం ఆ స్టార్సే. ఈ రజిని కూలీకి బలం ఫ్యాన్సే.!

పంచ్ లైన్ : జస్ట్ రజిని ఇమేజు - లోకేష్ క్రేజు !

 

 

Cinejosh Review : Coolie:

Cinejosh Telugu Review Coolie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs