సినీజోష్ రివ్యూ: వార్ 2
బ్యానర్ : యశ్ రాజ్ ఫిల్మ్స్
నటీనటులు : హృతిక్ రోషన్, ఎన్ఠీఆర్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రానా తదితరులు
సంగీతం : ప్రీతమ్
నేపథ్య సంగీతం : సంచిత్ - అంకిత్
సినిమాటోగ్రఫీ : బెంజమిన్ జాస్ఫర్
నిర్మాత : ఆదిత్య చోప్రా
దర్శకత్వం : అయాన్ ముఖర్జీ
విడుదల తేదీ : 14-08-2025
నటనలో ఢీ కొట్టగల సమఉజ్జీలు
నాట్యంలో సై అనగల సమర్థులు
పోరాటాల్లో పోటీ పడగల ఉద్దండులు
హృతిక్ రోషన్ - ఎన్ఠీఆర్
ఈ ఇద్దరి కలయికలో వార్ 2 వంటి అత్యంత భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే ఉబ్బితబ్బిబ్బయ్యారు అభిమానులు.. ఊహల్లోకి వెళ్లిపోయారు ప్రేక్షకులు. రిలీజ్ టైమ్ కి పోటీ చిత్రంతో పోల్చి చూసుకుంటే ప్రమోషన్సులో కాస్త వెనుకబడ్డా, స్టార్ పవర్ అనేదే మెయిన్ అసెట్ గా నేడు బాక్సాఫీస్ బరిలోకి దిగిన వార్ 2 మొత్తానికి ఫ్యాన్సుని మెప్పించిందా, ఆడియన్సుని ఒప్పించిందా అనేది రివ్యూ లో చూద్దాం.
రెగ్యులర్ కథ... రొటీన్ పంథా !
దేశానికి ముప్పు ముంచుకు వచ్చే ఓ సందర్భం. అది తప్పించేందుకు స్పై ఏజెంట్ రంగంలోకి దిగడం. అందుకు అవరోధాలు, అందులోని అపాయాలు, అందులోనే అనూహ్య మలుపులు, అంతిమంగా గెలుపులు. ఇదే స్పై యూనివర్స్ టెంప్లేట్ ని వార్ 2 కి కూడా ఫాలో అయిపొయింది యశ్ రాజ్ సంస్థ. దర్శకుడిగా బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ రంగంలోకి దిగినా అదే పాత కథనీ, అదే పాత పంథాని మార్చలేకపోయారు. ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే దీన్ని బెటర్ గా మలచలేకపోయారు. దాంతో YRF స్పై యూనివర్స్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చేందుకు తప్ప ఇంకెందుకు కొరవడని, కొత్తదనం కనిపించని జస్ట్ జనరల్ యాక్షన్ సినిమాగా తెరపైకి వచ్చింది వార్ 2 .
మెరిసిన స్టార్లు.. వెలిసిన స్క్రిప్ట్ !
సినిమా సంగతి దర్శక నిర్మాతలది, స్క్రీన్ ప్రెజన్స్ సంగతి మాది అంటూ హృతిక్ - ఎన్ఠీఆర్ ఇద్దరూ తమ తమ పాత్రల్లో తళుకులు, మెరుపులు చూపించారు. తనకు అలవాటే అయిన కబీర్ క్యారక్టర్ లోకి హృతిక్ మరోమారు ఇన్ వాల్వ్ అయిపోగా, ఏజెంట్ విక్రమ్ గా ఎన్ఠీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్సుని ఆకట్టుకుంటాయి. అలాగే క్లయిమాక్ ఆయువుపట్టుగా నిలుస్తుంది. కానీ స్టార్లు ఎంతగా మెరిసినా వెలిసిపోయిన ఈ స్క్రిప్ట్ సినిమాకి మేజర్ మైనస్ అయింది. అదే మిక్సడ్ టాక్ కి కారణంగా నిలిచింది. కియారా అద్వానీ రోల్ హ్రితిక్ తో ఒక పాటకి, కూసింత గ్లామర్ టచ్ కి పనికొస్తే, అనిల్ కపూర్, అశుతోష్ రానా తదితరులు తమ పనెంతో అంతే చేసి సరిపెట్టేసారు.
VFX దండగ.. ఎమోషన్సే అండగా !
వార్ 2 సినిమాకి సంబంధించి అంతటా వినిపిస్తోన్న అతి పెద్ద కంప్లైంట్ VFX పైనే. నెలల తరబడి వెచ్చించి, కోట్ల కొద్దీ వెదజల్లి ఇంత నాసిరకం VFX ని తెరపైకి తెస్తారా అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు విమర్శకులు. ఇదైతే నూటికి నూరు శాతం దర్శక, నిర్మాతల ఫెయిల్యూరే. అయితే ఇలా VFX దండగ అంటున్న వారే క్లయిమాక్స్ లో ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయని అంటున్నారంటే అదే వార్ 2 కి అండగా నిలుస్తుందనేది విశ్లేషకుల మాట. ఆ మాటే నిజమైతే వార్ 2 గట్టెక్కేసినట్టే.. హిట్టు మెట్టేక్కేసినట్టే !
సపోర్ట్ గా స్ట్రాంగ్ ఇమేజ్.. లాంగ్ వీకెండ్ !
బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉంది. మౌత్ టాక్ ఇపుడిపుడే స్ప్రెడ్ అవుతోంది. ఓ వైపు హృతిక్ - ఎన్ఠీఆర్ ల స్ట్రాంగ్ ఇమేజ్ సపోర్ట్ గా ఉంది. మరోవైపు లాంగ్ వీకెండ్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో వార్ 2 ఆశించిన ఫలితం దిశగా దూసుకుపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే తారక రాముడి బాలీవుడ్ ఎంట్రీ ఫలప్రదం అయినట్టే.. అదే నెరవేరకుంటే అందుకు బాధ్యుడిగా అయాన్ ముఖర్జీ కి ఆదిపురుష్ ఫేమ్ ఓం రావత్ లా అభిమానుల నుంచి అక్షింతలు తప్పవన్నట్టే !!
పంచ్ లైన్ : స్పైస్ లెస్ స్పై థ్రిల్లర్ !