Advertisement

సినీజోష్ రివ్యూ : ఓరి దేవుడా


సినీజోష్ రివ్యూ : ఓరి దేవుడా  

Advertisement

బేనర్ : పివిపి సినిమా - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  

నటీనటులు : వెంకటేష్ (స్పెషల్ రోల్), విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, మురళీ శర్మ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ తదితరులు

డైలాగ్స్ : తరుణ్ భాస్కర్

సినిమాటోగ్రఫీ : విధు అయ్యన్న  

ఎడిటింగ్ : విజయ్  

మ్యూజిక్ : లియోన్ జేమ్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశి కాక

ప్రొడ్యూసర్స్ : పెరల్ వి పొట్లూరి - పరమ్ వి పొట్లూరి  

దర్శకత్వం : అశ్వత్ మారిముత్తు  

విడుదల తేదీ :  21-10-2022

2020లో కరోనా కల్లోలానికి మునుపు తమిళ పరిశ్రమ చవి చూసిన చక్కని విజయం ఓహ్ మై కడవులే. వాలంటైన్స్ డే గిఫ్ట్ గా విడుదలై యువతను మెప్పించడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా పొంది టొరంటోలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితమైన విభిన్న కథా చిత్రమది. అటువంటి న్యూ ఏజ్ స్టోరీని తెలుగు ప్రేక్షకుల ముందుకు సైతం తీసుకురావాలని ఓరి దేవుడా చిత్రానికి శ్రీకారం చుట్టింది పివిపి టీమ్. ఒరిజినల్ ఫిలిం డైరెక్టర్ నే ఈ రీమేక్ కి కూడా తెచ్చుకోవడంతో పాటు ఈ జనరేషన్ ఆడియన్సుకి ఐడెంటిఫైబుల్ హీరో అనిపించే విశ్వక్ సేన్ ని హీరోగా ఎంచుకుని సగం సక్సెస్ సాదించేసిన మేకర్స్... గాడ్ క్యారెక్టర్ కోసం విక్టరీ వెంకటేష్ ని ఒప్పించి ఓవరాల్ సక్సెస్ కోసం ఓ స్ట్రాంగ్ రూట్ రెడీ చేసుకుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ నుంచే ఓ మోస్తరు అంచనాలు సృష్టించుకున్న ఓరి దేవుడా చిత్రం వెంకీ ఎంట్రీ తో నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయింది. ఆ ఎక్స్ పెక్టషన్స్ కి ట్రైలర్ మ్యాచ్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ కావడం, విశ్వక్ సేన్ మాటలు యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ ఫ్యాన్సుని ఆకర్షించడం, పలువురు యువ హీరోలు ఓరి దేవుడా అంటూ వేదికపై డాన్స్ చేయడం అభిమాన ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై కేంద్రీకృతం అయ్యేలా చేసాయి. దాంతో ప్రామిసింగ్ ఫిలింగా మారిన ఓరి దేవుడా నేడు దీపావళి గిఫ్ట్ గా థియేటర్స్ కి వచ్చిన నేపథ్యంలో చిత్ర వివరాలని, విశేషాలని సమీక్షించుకుందాం.

స్టోరీ : అర్జున్ దుర్గరాజు(విశ్వక్ సేన్) - అను పాల్ రాజ్(మిథిలా పాల్కర్) - మీరా(ఆశా భట్) అనే మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. ఆ పాత్రల సందిగ్దాన్ని, ఆ కథలోని సంఘర్షణని సరైన తీరానికి చేర్చే బాధ్యతను సాక్షాత్తూ దేవుడే స్వీకరిస్తే ఎలా ఉంటుందనే ఫాంటసీ ఎలిమెంట్ కలిగిన ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ సబ్జెక్ట్. ఇక కథలోని బేసిక్స్ లోకి వస్తే.. అర్జున్ - అను స్నేహితులు. పెళ్లి చేసుకుందామా అంటూ అను పెట్టిన ప్రపోజల్ కి అర్జున్ అంగీకారం తెలుపడంతో ఇద్దరూ దంపతులవుతారు. అయితే అనుపై తనకు ఉన్నది స్నేహ భావమే తప్ప మరో ఫీలింగ్ ఏదీ లేదని రియలైజ్ అయిన అర్జున్ ఆమెకి దగ్గర కాలేకపోతాడు. అక్కడ్నుంచీ మొదలవుతుంది అంతర్యుద్ధం. ఆపై కథలోకి స్కూల్ డేస్ లో అర్జున్ క్రష్ అయిన మీరా రాకతో అర్జున్ - అనుల ఘర్షణ మరింత ముదురుతుంది. అనుతో వైవాహిక బంధం విడాకుల వరకు వెళ్ళిపోయి, జవాబు చెప్పలేనంత జఠిలంగా మారిపోయిన జీవితంతో అర్జున్ ఆపసోపాలు పడుతుంటే ఆదుకునేందుకు వచ్చిన దేవుడు(వెంకటేష్) అర్జున్ ని ఆటపట్టిస్తూ, అల్లరి చేస్తూనే అతని లైఫ్ చేంజ్ చేసుకునేందుకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. మరి ఆ అవకాశాన్ని అర్జున్ వినియోగించుకున్నాడా, తన ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకున్నాడా అన్నదే మిగిలిన కథ.

స్క్రీన్ ప్లే : ప్రతి స్టోరీకి ఎంగేజింగ్ నేరేషన్ ఎంత ముఖ్యమో.. ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా కథ చెప్పగల స్క్రీన్ ప్లే అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఆ విషయంలో మంచి మార్కులు వేయించుకునే ఓరి దేవుడా చిత్రం ప్రథమార్థం మొత్తం తెరపై పరుగులు పెట్టింది. అర్జున్ - అనుల కెమిస్ట్రీని అర్ధవంతంగా చూపిస్తూనే ఎక్కడా హ్యూమర్ మిస్ కాకుండా కేర్ తీసుకున్న డైరెక్టర్ ఫస్టాఫ్ వరకు ఆడియన్సుని ఫుల్ గా సాటిస్ ఫై చేస్తాడు. అయితే అంత లైటర్ వీన్ గా సాగిన ఫస్టాఫ్ నుంచి కాస్త హెవీగా మారే సెకండ్ హాఫ్ లోకి గేర్స్ షిఫ్ట్ చేయడంలో మాత్రం తడబాటు కనిపించింది. అక్కడక్కడా డ్రామా డోస్ ఎక్కువైందేమో అని కూడా అనిపించింది. కానీ ఆఖరికి కుదురుకున్న దర్శకుడు మరీ ఎక్కువ డ్యామేజ్ జరక్కుండా జాగ్రత్త పడ్డాడు. ప్రెడిక్టబుల్ క్లయిమాక్స్ నే ఇచ్చినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే చిత్రంగానే ఓరి దేవుడా ను మలిచాడు. ముఖ్యంగా ఒరిజినల్ లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి చేసిన దేవుడి పాత్రని మన వెర్సటైల్ హీరో వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కి, ఆయన మేనరిజమ్స్ కి అనుగుణంగా అమర్చిన తీరు మెప్పిస్తుంది.

ఎఫర్ట్స్ : అర్జున్ పాత్రలో అచ్చంగా ఒదిగిపోయిన విశ్వక్ నటుడిగా ఇంకాస్త ఎదిగాను అనిపించుకుంటాడు. ఎంటర్ టైన్ చేయడంలోనూ - ఎమోషన్సుని పండించడంలోనూ రెండింటా సక్సెస్ అయిన విశ్వక్ సేన్ ని అతను ఆశించినట్టే ఈ చిత్రం ఓ మెట్టు ఎక్కిస్తుంది అనడంలో సందేహం లేదు. నటనలోనే కాకుండా డ్యాన్సులోనూ విశ్వక్ మంచి ఈజ్ చూపించడం విశేషం. అను పాత్రలో మిథిలా పాల్కర్ సైతం ఆకట్టుకుంటుంది. మీరా రోల్ లో ఆశా భట్ ఆకర్షణీయంగా వుంది. అను ఫాదర్ గా మురళి శర్మతో పాటు అర్జున్ ఫ్రెండ్ గా చేసిన నటుడు కూడా ఈ కథకి కొత్త తరహా హ్యూమర్ అద్దారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ చిన్న గెస్ట్ రోల్ లో తెరపై తళుక్కున మెరిశారు.  ఇక వెంకీ విషయానికి వస్తే.. ఆయన అనుభవం - అభినయం రెండూ  ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అయ్యాయి. వెంకటేష్ స్టైల్ అఫ్ యాక్టింగ్, తన స్క్రీన్ ప్రెజెన్స్ ఓరి దేవుడా లోని మోడ్రన్ గాడ్ రోల్ ని 100 పర్శంట్ జస్టిఫై చేసాయి. మెయిన్ గా వెంకీ ఎనర్జీ విక్టరీ ఫ్యాన్సునే కాక వీక్షకులందర్నీ ఇంప్రెస్ చేస్తుంది.

టెక్నిషియన్స్ లో ముగ్గురు ముఖ్యులు ముచ్చటైన ఎఫర్ట్ తో ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యారు. వారే మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్, కెమెరామెన్ విధు అయ్యన్న, దర్శకుడు అశ్వత్. ముందుగా మ్యూజిక్ పరంగా చెప్పాలంటే లియోన్ జేమ్స్ తనే చేసిన ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా ఓరి దేవుడా కి బెటర్ మ్యూజిక్ ఇచ్చారు. గుండెల్లోనా సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ కాగా సినిమాలోనూ ఆద్యంతం అదే పట్టుదలను చూపిస్తూ సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రతి ఇంపార్టెంట్ సీన్ కీ ప్రాణం పోసాడు లియోన్ జేమ్స్. అదే కోవలో విధు అయ్యన్న కూడా మాతృక కంటే మరింత అందమైన విజువల్స్ తో ఓరి దేవుడాను తెరపైకి తెచ్చారు. ఈ చిత్రం ఇంత క్వాలిటీ అవుట్ ఫుట్ తో రావడానికి అయ్యన్న ఫోటోగ్రఫీయే దోహదపడిందని అనొచ్చు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రియలిస్టిక్ అప్రోచ్ తో రిఫ్రెషింగ్ గా ఉన్నాయి. విజయ్ ఎడిటింగ్ ఓకే. ఫ్రెండ్స్ - లవర్స్ అయిపోయి ఆపై పెళ్లితో ఒకటైపోవడమనే పాయింట్ లోని కొత్త యాంగిల్ టచ్ చేస్తూ, దానికి ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేస్తూ న్యూ కైండ్ అఫ్ వే లో ఈ కథ రాసుకున్న దర్శకుడు అశ్వత్ అంతే సిన్సియర్ గా సినిమా తీసి తమిళ్ లో హిట్ కొట్టారు. తెలుగులోనూ అదే తరహా మ్యాజిక్ ని మరోసారి చేసి చూపించారు. ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడంలోనూ, పర్ ఫెక్ట్ గా ప్రమోట్ చేయడంలోనూ తన సమర్ధత నిరూపించుకున్న ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాకాను అభినందించాలి. అలాగే తమ అభిరుచిని మరోమారు చాటుకున్న పివిపి సంస్థని కూడా ప్రశంసించాలి.

ఎనాలసిస్ : రీమేక్ సినిమా చేసే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ప్రధానమైన సవాల్ ఏమిటంటే... వినిపించిన ప్రతి అభిప్రాయాన్ని విశ్లేషించుకోవడం, అనిపించిన ప్రతి సందేహానికి సరైన సమాధానం వెతుక్కోవడం.! అలాగని ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఏం చేసినా..  ఏ మార్పులు చేయకుండా తీస్తే కాపీ పేస్ట్ అంటారు. ఏవైనా మార్చితే కథలోని అసలు మ్యాటర్ కరప్ట్ అయింది అంటారు. అందుకే అనే వ్యక్తుల గురించి కాకుండా చూసే ప్రేక్షకుల గురించే ఆలోచించడం అత్యుత్తమం. అందుకు ఈ చిత్రం ఓ తాజా నిదర్శనం. ఎక్కువ ప్రయోగాల జోలికి పోకుండా కరెక్ట్ క్యాస్టింగ్ చూజ్ చేసుకుని, కథలోని సోల్ ని చాలా బ్యాలెన్సెడ్ గా ప్రెజెంట్ చేసింది ఓరి దేవుడా టీమ్. అటు ఫ్యామిలీ ఆడియన్సుని ఒప్పించి - ఇటు యూత్ ఆడియన్సుని మెప్పించే ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక ఈ దీపావళికి ఓరి దేవుడా ఓ రేంజ్ లో వెలుగుతుందని ఆశించొచ్చు.

పంచ్ లైన్ : ఓరి దేవుడా.. ఓసారి సరదాగా చూసెయ్యొచ్చు.!

సినీజోష్ రేటింగ్ : 3/5

Cinejosh Review: Ori Devuda :

Ori Devuda movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement