Advertisement

సినీజోష్ రివ్యూ : నేను మీకు బాగా కావాల్సినవాడిని


సినీజోష్ రివ్యూ : నేను మీకు బాగా కావాల్సినవాడిని

Advertisement

బేనర్ : కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్

నటీనటులు : కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, ఎస్.వి.కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ తదితరులు

సంగీతం : మణిశర్మ  

సినిమాటోగ్రఫీ : రాజ్ కె నల్లి

ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి

నిర్మాత : కోడి దివ్య దీప్తి

దర్శకత్వం : శ్రీధర్ గాదె

విడుదల తేదీ : 16-09-2022

రాజావారు రాణిగారు, SR కల్యాణ మండపం చిత్రాలతో ఈ తరం ప్రేక్షకులను ఆకర్షించిన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని అంటూ నేడు తన తాజా చిత్రంతో దిగాడు. శతాధిక చిత్రాల దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మించడం ముఖ్య విశేషం. మరిక శ్రీధర్ గాదె దర్శకత్వంలో వచ్చిన నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఏ మేరకు ఉన్నాయో సమీక్షలో చూద్దాం.

బేసిక్ పాయింట్ : క్యాబ్ డ్రైవర్ అయిన వివేక్ (కిరణ్ అబ్బవరం) తరచుగా తేజు (సంజన) అనే అమ్మాయిని డ్రాప్ చేస్తూ ఉంటాడు. నిత్యం మద్యం మత్తులో మునుగుతూ ఒంటరిగా ఉండే ఆ అమ్మాయి పట్ల ఆసక్తి కలుగుతుంది వివేక్ కి. ఆమెనే ప్రశ్నిస్తాడు. ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తేజు జీవితంలో ఏం జరిగింది, ఆమె లైఫ్ లో, లివింగ్ స్టైల్ లో చేంజ్ తెచ్చేందుకు వివేక్ ఏం చేసాడు, వివేక్ కి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అన్నదే మిగిలిన మ్యాటర్. చదువుతున్నప్పుడు ఇంతేనా బాబు అనీ, చూస్తున్నప్పుడు ఇందేట్రా బాబోయ్ అనీ అనిపించే కథ ఇది. ఇంతకుమించి ఏం చెప్పుకోగలం ఈ కావాల్సిన వాడు థియేటర్ లో కలిగించిన కష్టం గురించి.!

ప్లస్ పాయింట్ : ఇదీ ఈ చిత్రంలో ప్లస్ పాయింట్ అని ప్రస్తావించే అవసరం లేకుండా స్టార్ట్ టు ఎండ్ ఒకే ఫేజ్ తో, ఒకే రకమైన బోరింగ్ ఫీలింగ్ తో ఆడియన్స్ ఈ సినిమాని చూసేలా చేసాడు దర్శకుడు శ్రీధర్ గాదె. ఎంత చిన్న సినిమాలో అయినా, ఎలాంటి మాములు సినిమాలో అయినా ఇంటర్వెల్ లో బ్యాంగ్ అని, క్లైమాక్స్ లో ట్విస్ట్ అని, కథలో పాయింట్ అని చెప్పుకునే స్కోప్ ఉంటుంది. కానీ ఆ అవకాశం మనకు అస్సలు ఇవ్వని సినిమాగా మిగిలిపోయింది నేను మీకు బాగా కావాల్సినవాడిని. హీరో కిరణ్ అబ్బవరం స్వయంగా స్కీన్ ప్లే, డైలాగ్స్ రాయడం ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అన్నారు కానీ.. ఫైనల్ గా అదెలా మారిందన్నది ప్రేక్షకుల స్పందన ద్వారా ఇప్పటికే సదరు సినిమా టీం కి అర్దమైపోయుంటుంది.

మైనస్ పాయింట్ : కిరణ్ అబ్బవరం యాక్టింగ్ లో ఈజ్ ఉంటుంది. లేదని చెప్పం. అతని డైలాగ్ డెలివరీ బావుంటుంది. కాదని అనం. అతడు నెక్స్ట్ డోర్ బాయ్ కేరెక్టర్స్ చేస్తే చూస్తాం. వద్దనం అనేది ప్రేక్షకుల మాట. కానీ అతడు అకస్మాత్తుగా మాస్ హీరో అయ్యిపోవాలని, స్టార్ ఇమేజ్ తెచ్చేసుకోవాలని తొందరపడిపోతే మాత్రం ఇలాంటి తప్పులే జరుగుతాయి. ఇటువంటి సినిమాలే వస్తాయనే దానికి నిదర్శనం నేను మీకు బాగా కావాల్సినవాడిని. సంజన విషయానికొస్తే కెమెరా ఎఫెక్టో, ఆ అమ్మాయిలో డిఫెక్టో ఏదైతేనేం ఆమె అస్సలు హీరోయిన్ గా అనిపించలేదు. ఏ యాంగిల్ లోను తనలోని కథానాయిక కనిపించలేదు. హీరోయిన్ తండ్రిగా కీలకపాత్ర పోషించిన సీనియర్ డైరెక్టర్ SV కృష్ణారెడ్డి తాను చేసేందుకేమి లేక తెల్లబోయి చూస్తూ ఉంటే.. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ చెయ్యాల్సినదానికంటే ఎక్కువ చేసేసి.. తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసాడు. తన రికార్డింగ్ స్టూడియో లో అట్టడుగున పడి వున్న ఓ ఆరు పాటలను తీసి దుమ్ము దులిపి ఇచ్చేసి సొమ్ము చేసుకున్నాడు మణిశర్మ. కెమెరామన్ రాజ్ కె నల్లి టేకింగ్ కూడా అదే స్థాయిలో ఆ పాతకాలంనాటి రీతిలోనే ఉంది. ఎడిటర్ గా ప్రవీణ్ పూడి పని చేసాడని చెప్పడం కంటే ఏదో పని కానిచ్చేసాడనడం కరెక్ట్.

ఫైనల్ పాయింట్ : వందకు పైగా సినిమాలు చేసిన దర్శకుడి కూతురు, త్వరలోనే తానూ దర్శకత్వం చేస్తానంటున్న కోడి దివ్య దీప్తి కోరి కోరి ఈ సినిమాని ఎందుకు నిర్మించిందో తనకే తెలియాలి. నటుడిగా తనకి లభించిన గుర్తింపుని నిలబెట్టుకోవడంలో ఎందుకు తడబడుతున్నాడో, తప్పటడుగులు వేస్తున్నాడో కిరణ్ తనని తానే తరచి చూసుకోవాలి. SR కల్యాణమండపంలో పేలిన డైలాగ్ ని పట్టుకొచ్చి టైటిల్ పెట్టేసినంత ఈజీ కాదు మళ్ళీ అటువంటి ఫలితాన్నే రాబట్టడం. అది గుర్తిస్తే కిరణ్ మళ్ళీ ట్రాక్ లోకి రావొచ్చు. ఇదంతా అర్ధం చేసుకుంటే దివ్య దీప్తి మరో మంచి ప్రాజెక్ట్ తో తానేంటో ప్రూవ్ చేసుకోవచ్చు. ఈ సినిమావరకు వస్తే మాత్రం.. ఓవరాల్ గా ఓటిటిలో చూడడానికి కూడా ఆలోచించదగ్గ నేను మీకు బాగా కావాల్సినవాడిని థియేటర్స్ నుంచి అతి త్వరలోనే అదృశ్యమైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పంచ్ లైన్ : నేను మీకు బాగా కావాల్సినవాడిని - ఇరవై ఏళ్ళ క్రితం రావాల్సినవాడివి.!

సినీజోష్ రేటింగ్ : 1.75/5

Cinejosh Review: Nenu Meeku Baga Kavalsinavadini :

Nenu Meeku Baga Kavalsinavadini Review 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement