Advertisement

సినీజోష్‌ రివ్యూ: కేరాఫ్‌ సూర్య


లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

Advertisement

కేరాఫ్‌ సూర్య  

తారాగణం: సందీప్‌ కిషన్‌, మెహరీన్‌, హరీష్‌ ఉత్తమన్‌, విక్రాంత్‌, తులసి, ప్రవీణ్‌, సత్య, ధన్‌రాజ్‌, నాగినీడు తదితరులు 

సినిమాటోగ్రఫీ: జె.లక్ష్మణ్‌ 

ఎడిటింగ్‌: కాశీవిశ్వనాథన్‌ 

సంగీతం: డి.ఇమాన్‌ 

మాటలు: సత్య 

సమర్పణ: శంకర్‌ చిగురుపాటి 

నిర్మాత: చక్రి చిగురుపాటి 

రచన, దర్శకత్వం: సుశీంద్రన్‌ 

విడుదల తేదీ: 10.11.2017 

డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న దర్శకుడు సుశీంద్రన్‌. కార్తీ హీరోగా సుశీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన నా పేరు శివ తెలుగులో మంచి విజయం సాధించింది. తను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా వుండాలని కోరుకునే హీరో సందీప్‌ కిషన్‌. వీరిద్దరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందిందంటే ప్రేక్షకుల్లో తప్పకుండా ఆ సినిమాపై అంచనాలు ఏర్పడతాయి. అలా కేరాఫ్‌ సూర్య చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కేరాఫ్‌ సూర్య ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకుంది? సుశీంద్రన్‌ తన మ్యాజిక్‌తో మరోసారి ప్రేక్షకుల్ని థ్రిల్‌ చెయ్యగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు సూర్య(సందీప్‌ కిషన్‌). ఓ కేటరింగ్‌ కంపెనీలో వర్క్‌ చేస్తుంటాడు. అతని స్నేహితుల్లో ఒకడైన మహేష్‌(విక్రాంత్‌) కూడా అక్కడే పనిచేస్తుంటాడు. ఫ్రెండ్స్‌లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరూ స్పందిస్తారు. ఒకరికి ఒకరు అండగా వుంటారు. అయితే మహేష్‌ అంటే సూర్య తల్లికి మంచి అభిప్రాయం వుండదు. సూర్యకి, అతని తల్లికి తెలియకుండా సూర్య చెల్లెలు, మహేష్‌ ప్రేమించుకుంటూ వుంటారు. కట్‌ చేస్తే... అతని పేరు సాంబశివుడు(హరీష్‌ ఉత్తమన్‌). సెటిల్‌మెంట్లు, అవసరమైతే మర్డర్‌ కూడా చేస్తాడు. ఏది చేసినా ఎవిడెన్స్‌ పెట్టుకొని తన చేతికి మట్టి అంటకుండా చేస్తాడు. అలాంటి సాంబశివుడి కన్ను సూర్య చెల్లెలిపై పడుతుంది. ఆమెని చంపితే అతనికి 50 కోట్లు వస్తాయి. ఏ క్రైమ్‌ చేసినా తెలివిగా చేసే సాంబశివుడు సూర్య చెల్లెల్ని చంపడానికి ఎలాంటి ప్లాన్‌ వేశాడు? ఆమెను చంపితే అతనికి 50 కోట్లు ఎలా వస్తాయి? తన చెల్లెల్ని కాపాడుకోవడానికి సూర్య ఎలాంటి సాహసాలు చేశాడు? చివరికి సాంబశివుడి ఆట కట్టించాడా? అనేది మిగతా కథ. 

స్నేహితుడ్ని, చెల్లెల్ని.. విలన్‌ బారి నుంచి కాపాడుకునేందుకు టెన్షన్‌ పడే క్యారెక్టర్‌లో సందీప్‌ కిషన్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ మెహరీన్‌ ఏ మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌ చేసింది. సినిమా కనిపించేది తక్కువే అయినా పెర్‌ఫార్మెన్స్‌కి ఏమాత్రం స్కోప్‌ లేదు. సూర్య స్నేహితుడు మహేష్‌గా విక్రాంత్‌ నటన కూడా బాగుంది. సత్య తన కామెడీతో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే కామెడీకి ఎక్కువ స్కోప్‌ వున్న సబ్జెక్ట్‌ కాకపోవడం వల్ల ఆ కామెడీ ఎంజాయ్‌ చేసేలా వుండదు. సూర్య తల్లిగా తులసి నటన ఫర్వాలేదు. ఇక విలన్‌గా నటించిన హరీష్‌ ఉత్తమన్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా సెటిల్డ్‌గా అనిపిస్తుంది. తన క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టుగానే అతని లుక్‌ కూడా వుంది. డబ్బు కోసం దేనికైనా తెగించే క్రిమినల్‌గా తన నటనతో ఆడియన్స్‌లో టెన్షన్‌ క్రియేట్‌ చేశాడు. సినిమా ప్రారంభంలో కనిపించే నాగినీడు ఒక్క సీన్‌కే పరిమితమైపోయాడు. ప్రవీణ్‌, ధన్‌రాజ్‌ క్యారెక్టర్లు నిడివి కోసం తప్ప కథకు ఎంత మాత్రం ఉపయోగపడలేదు. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పాల్సి వస్తే లక్ష్మణ్‌ ఫోటోగ్రఫీ చాలా నేచురల్‌గా వుంది. సాధారణంగా సుశీంద్రన్‌ సినిమాల్లో వుండే ఫ్రేమింగ్‌, లైటింగ్‌ ఈ సినిమాలోనూ కనిపించాయి. నైట్‌ ఎఫెక్ట్‌లో తీసిన చాలా సీన్స్‌ ఎంతో ఎఫెక్టివ్‌గా వున్నాయి. కాశీవిశ్వనాథన్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఫస్ట్‌హాఫ్‌లో విలన్‌ యాక్టివిటీస్‌ తప్ప మిగతా సీన్స్‌ అన్నీ దాదాపుగా వేస్ట్‌గానే అనిపిస్తాయి. అయితే అది కంటెంట్‌లో వున్న లోపమే తప్ప ఎడిటర్‌ది కాదు. ఇమాన్‌ చేసిన పాటల్లో మొదలవుతోందా... అనే మెలోడీ సాంగ్‌ వినబుల్‌గా వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఎంగేజింగ్‌గా వుంది. సత్య రాసిన మాటల్లో కొన్ని ఆలోచింపజేసేవిగా వున్నాయి. డైరెక్టర్‌ సుశీంద్రన్‌ గురించి చెప్పాలంటే తన ప్రతి సినిమాలోనూ ఏదో క్రైమ్‌ని బేస్‌ చేసుకొని కథ అల్లుకుంటాడు. అలాగే ఈ సినిమాలో కూడా క్రైమ్‌నే ప్రధానాంశంగా ఎంచుకున్నాడు. అసలు కథలోకి వెళ్ళడం కోసం ఫస్ట్‌హాఫ్‌ అంతా చెత్తతో నింపేశాడు. ఫస్ట్‌హాఫ్‌లో హరీష్‌ ఉత్తమన్‌ సీన్స్‌ తప్ప ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా వుండదు. ఇక సెకండాఫ్‌ స్టార్ట్‌ అయిన దగ్గర నుంచి సినిమా గ్రాఫ్‌ ఒక్కసారిగా పైకి లేస్తుంది. అనుక్షణం సస్పెన్స్‌తో నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందన్న క్యూరియాసిటీని పెంచాడు సుశీంద్రన్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌లను రకరకాల కాన్పెప్ట్‌లతో బాగా డిజైన్‌ చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లు ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తాయి. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కేరాఫ్‌ సూర్య బాగా కనెక్ట్‌ అవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్ట్‌హాఫ్‌ సోసోగా, సెకండాఫ్‌ థ్రిల్లింగ్‌గా అనిపించే ఈ సినిమా మెజారిటీ ఆడియన్స్‌కి నచ్చే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: థ్రిల్‌ చేసే కేరాఫ్‌ సూర్య

care of surya review:

telugu movie care of surya review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement