Advertisement

సినీజోష్‌ రివ్యూ: నేను లోకల్‌

Fri 03rd Feb 2017 08:37 PM
telugu movie nenu local,nani new movie nenu local,dilraju new movie nenu local,nenu local movie review,nenu local review in cinejosh,nenu local cinejosh review  సినీజోష్‌ రివ్యూ: నేను లోకల్‌
సినీజోష్‌ రివ్యూ: నేను లోకల్‌
Advertisement

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ 

నేను లోకల్‌ 

తారాగణం: నాని, కీర్తి సురేష్‌, సచిన్‌ ఖేడ్కర్‌, నవీన్‌ చంద్ర, పోసాని, ఈశ్వరీరావు, తులసి, రావు రమేష్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫి 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి 

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ 

సమర్పణ: దిల్‌రాజు 

నిర్మాత: శిరీష్‌ 

దర్శకత్వం: త్రినాథరావు నక్కిన 

విడుదల తేదీ: 03.02.2017 

ఆనందం అనేది ఆస్తిపాస్తుల్లో, లగ్జరీ లైఫ్‌లో లేదని, నిజమైన ప్రేమలోనే వుందని చెప్పడానికి చేసిన మరో ప్రయత్నమే నేను లోకల్‌ చిత్రం. సగటు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తూ వరస విజయాలతో ముందుకు వెళ్తూ నేచురల్‌ స్టార్‌ అనిపించుకుంటున్న నాని చేసిన మరో లోకల్‌ సబ్జెక్ట్‌ ఇది. పైన చెప్పుకున్న విషయాల్ని మనం ఎన్నో సినిమాల్లో చూసేశాం. ఇందులో కొత్తగా ఏం చెప్పారు? అనే డౌట్‌ అందరికీ వస్తుంది. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈమధ్య రాజ్‌ తరుణ్‌తో సినిమా చూపిస్త మావ చిత్రాన్ని రూపొందించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినడానికి రెగ్యులర్‌ సినిమా పాయింట్‌లాగే అనిపించినా ప్రేక్షకుల్ని కట్టి పడేసే అంశాలు ఇందులో ఏం వున్నాయి? నానికి ఇది ఎలాంటి సినిమా అయింది? సంక్రాంతికి శతమానం భవతి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన దిల్‌రాజుకి ఈ సినిమా మరో కమర్షియల్‌ హిట్‌ అవుతుందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

చదువును నెగ్లెట్‌ చేసి జాలీగా ఎంజాయ్‌ చేసే మన సినిమాల్లోని రెగ్యులర్‌ హీరోల్లాగే ఇందులో బాబు(నాని) కూడా కనిపిస్తాడు. నానా కష్టాలు పడి ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తాడు. ఓ ఫైన్‌ మార్నింగ్‌ అనుకోకుండా కీర్తి(కీర్తి సురేష్‌)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తన మాటలతో, చేష్టలతో కీర్తిని డిస్ట్రబ్‌ చేస్తుంటాడు. తండ్రి మాట జవదాటని ఆ అమ్మాయి బాబును ఎవాయిడ్‌ చేస్తూ వుంటుంది. అయితే ఎలాగోలా కీర్తి ప్రేమను సంపాదిస్తాడు. కీర్తి తనను ప్రేమిస్తున్నానని చెప్పే టైమ్‌కి బాబుకి ఓ షాకింగ్‌ న్యూస్‌ తెలుస్తుంది. కీర్తికి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సిద్ధార్థవర్మ(నవీన్‌చంద్ర)కి పెళ్ళి అని తెలుసుకొని షాక్‌ అవుతాడు. బాబు అంటే మంచి అభిప్రాయం లేని కీర్తి తండ్రి అతన్ని మొదటి నుంచీ అసహ్యించుకుంటూ వుంటాడు. తన తండ్రి ఎవర్ని పెళ్ళి చేసుకోమంటే అతన్నే చేసుకుంటానని కీర్తి చెప్తుంది. కీర్తి తండ్రిని ఇంప్రెస్‌ చెయ్యడానికి ఓ మంచి మూమెంట్‌ కోసం ఎదురుచూస్తుంటాడు బాబు. ఇన్ని సమస్యల మధ్య కీర్తి, బాబుల పెళ్ళి జరిగిందా? వీరిద్దరి పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి? కీర్తి తండ్రి వీరి పెళ్ళికి ఒప్పుకున్నాడా? అనేది మిగతా కథ. 

డిఫరెంట్‌ యాటిట్యూడ్‌ వున్న బాబు లాంటి క్యారెక్టర్‌ చెయ్యడం నాని లాంటి హీరోకి కొట్టిన పిండి. కాబట్టి అతని పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేచురల్‌గానే తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌లో అతని పంచ్‌ డైలాగ్స్‌కి థియేటర్‌లో చాలా సార్లు నవ్వులు వినిపించాయి. అలాగే క్లైమాక్స్‌లో అతను చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్స్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. హీరోయిన్‌ కీర్తి సురేష్‌ గురించి చెప్పాలంటే ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ అందంగా కనిపించినా, కొన్నిచోట్ల మాత్రం ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌గానీ, గ్లామర్‌గానీ ఇబ్బంది పెడుతుంది. ఇది చాలా సాదా సీదా కథ కావడంతో రెగ్యులర్‌గా తండ్రి పాత్రలు చేసే రావు రమేష్‌, మురళీశర్మలను కాకుండా సచిన్‌ ఖేడ్కర్‌తో హీరోయిన్‌ తండ్రి పాత్ర చేయించడంతో కొంతలో కొంత కొత్త సినిమా అనే భావన కలిగింది. కేవలం రెండు సీన్లలోనే కనిపించే రావు రమేష్‌ పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేదు సరికదా సరైన డైలాగ్స్‌ కూడా లేవు. ఇక మిగతా క్యారెక్టర్ల గురించి, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. 

సాంకేతిక పరంగా చూస్తే నిజార్‌ షఫీ ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా చూపించడంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. రెండు పాటలు మాత్రం విజువల్‌గా బాగున్నాయి. నాని, దేవిశ్రీప్రసాద్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఫర్వాలేదు అనిపించాడు. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఇక డైరెక్టర్‌ త్రినాథరావు నక్కిన గురించి చెప్పాలంటే రాజ్‌ తరుణ్‌తో అతను చేసిన సినిమా చూపిస్త మావ చిత్రానికి మరో కోణం ఈ సినిమా అనిపిస్తుంది. ఆ చిత్రంలో మాదిరిగానే హీరోతో గొడవ పడిన వ్యక్తి కూతుర్నే అనుకోకుండా హీరో ప్రేమిస్తాడు. ఆమెను పెళ్ళి చేసుకోవడానికి కొన్ని ఛాలెంజ్‌లు కూడా చేస్తాడు. అయితే అది ఓ ప్యాట్రన్‌లో వుంటే ఈ సినిమా మరో ప్యాట్రన్‌లో వుంది తప్ప మెయిన్‌ కాన్సెప్ట్‌ మాత్రం అదే అనిపిస్తుంది. సినిమా స్టార్ట్‌ అయిన క్షణం నుంచి ప్రతి సీన్‌ చాలా రొటీన్‌గా వుంది అనే ఫీలింగ్‌ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. హీరో కనిపించగానే ఓ ఇండ్రక్షన్‌ సాంగ్‌, హీరోయిన్‌ని చూడగానే ఆమెను టీజ్‌ చేస్తూ ఓ సాంగ్‌... మధ్య మధ్యలో హీరో ఫ్యామిలీతో కొన్ని కామెడీ సీన్స్‌ లేదా హీరోయిన్‌ తండ్రితో మాటల యుద్ధం.. ఇలా అన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి తప్ప ఏ దశలోనూ ఓ కొత్త సినిమా చూస్తున్నామన్న భావన కలగదు. బాబు, కీర్తిల మధ్య నవీన్‌ చంద్ర ఎంటర్‌ అయిన దగ్గర నుంచి హీరో హవా తగ్గుతుంది. కీర్తి తండ్రిని ఇంప్రెస్‌ చెయ్యడానికి ఒక మంచి మూమెంట్‌ కోసం ఎదురుచూస్తుంటాడు. ఎంతగా ఎదురు చూస్తాడంటే సెకండాఫ్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి క్లైమాక్స్‌ వరకు ఎదురు చూస్తూనే వుంటాడు. ఈలోగా జరిగే సంఘటనలు ఏదీ నేచురల్‌గా అనిపించవు. అన్నీ సినిమాటిక్‌గానే వుంటాయి. అన్నీ హీరోకి అనుకూలంగానే జరుగుతుంటాయి. అయితే పావుగంట పాటు సాగే క్లైమాక్స్‌ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. అది కూడా కొత్తగా అనిపించదుగానీ ఆ సీన్‌కి రాసిన డైలాగ్స్‌, నాని వాటిని చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రజెంట్‌ జనరేషన్‌కి ఆ డైలాగ్స్‌ బాగా కనెక్ట్‌ అవుతాయి. హీరోయిన్‌ని ప్రేమించిన తర్వాత హీరో ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని తన ప్రేమను గెలిపించుకుంటాడు కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే అది ఎలా జరిగింది అనేది కొంచెం కొత్తగా చెప్పాలనుకున్నారు. అది కూడా రొటీన్‌గానే అనిపించినా క్లైమాక్స్‌ చూసి బయటికి వచ్చే ప్రేక్షకులు సినిమా ఫర్వాలేదు అనుకునేలా మాత్రం వుంది. కథకు తగ్గట్టు సినిమా బాగా రావడానికి నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవలేదని విజువల్స్‌ చూస్తే అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే రెగుల్యర్‌ కథ, రొటీన్‌ సీన్స్‌తో తీసిన సినిమా అయినప్పటికీ ఆడియన్స్‌లో నానికి వున్న ఫాలోయింగ్‌, ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్‌, క్లైమాక్స్‌ వల్ల ఇది నానికి మరో మంచి సినిమా అయ్యే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: నేను రొటీన్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement