Advertisement

సినీజోష్‌ రివ్యూ: బాబు బంగారం

Fri 12th Aug 2016 07:27 PM
telugu movie babu bangaram,babu bangaram movie review,babu bangaram review in cinejosh,babu bangaram cinejosh review,venkatesh new movie babu bangaram,maruthi new movie babu bangaram  సినీజోష్‌ రివ్యూ: బాబు బంగారం
సినీజోష్‌ రివ్యూ: బాబు బంగారం
Advertisement

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

బాబు బంగారం 

తారాగణం: వెంకటేష్‌, నయనతార, పృథ్వీ, పోసాని, 

సంపత్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, మురళీశర్మ, షావుకారు జానకి, 

బ్రహ్మానందం తదితరులు 

సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌ 

సంగీతం: జిబ్రాన్‌ 

ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్దవ్‌ 

మాటలు: మారుతి, డార్లింగ్‌ స్వామి 

సమర్పణ: ఎస్‌.రాధాకృష్ణ 

నిర్మాతలు: ఎస్‌.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌ 

రచన, దర్శకత్వం: మారుతి 

విడుదల తేదీ: 12.08.2016 

భలే భలే మగాడివోయ్‌ రిలీజ్‌ అయ్యే వరకు మారుతికి డైరెక్టర్‌గా సరైన పేరు లేదు. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆ చిత్రం అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్‌ అయింది. దీంతో మారుతి మంచి డైరెక్టర్‌ అనిపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్‌, మారుతి కాంబినేషన్‌లో ఎస్‌.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌ ఎంతో ప్రెస్టీజియస్‌గా నిర్మించిన బాబు బంగారంపై అందరికీ మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. మతిమరుపు అనే ఓ బలహీనతపై భలే భలే మగాడివోయ్‌ చిత్రాన్ని తీసి ఆద్యంతం ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసిన మారుతి మనిషిలోని మంచితనం, జాలి అనే మరో బలహీనతని తీసుకొని మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలని ప్రయత్నించాడు. మరి ఈసారి మారుతి పాచిక పారిందా? అతను అనుకున్నట్టు ఈ కథతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగాడా? ఇటీవలి కాలంలో వెంకటేష్‌ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం చెయ్యలేదు. ఈ చిత్రంలో వెంకటేష్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంగిల్‌ని మారుతి ఎంతవరకు ఉపయోగించుకున్నాడు? ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఆడియన్స్‌ ఎంతవరకు కనెక్ట్‌ అయ్యారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఎవరు కష్టాల్లో వున్నా చలించిపోయే కృష్ణ(వెంకటేష్‌).. ఎదుటివారి కన్నీళ్ళు చూసి తనూ కనీళ్ళ పర్యంతమవుతాడు. అలాంటి వ్యక్తి క్రైమ్‌ బ్రాంచ్‌లో ఎసిపి. హీరోయిన్‌ శైలజ(నయనతార) పడే కష్టాన్ని చూసి యధావిధిగా బాధపడతాడు. ఆమెను అన్నివిధాలా ఆదుకుంటాడు. నెలరోజులు సెలవు పెట్టి ఆమె వెన్నెంటే వుంటాడు. తన జీవిత భాగస్వామి శైలజేనని ఫిక్స్‌ అవుతాడు. ఇక అసలు కథలోకి వెళ్తే శైలజ తండ్రి శాస్త్రి(జయప్రకాష్‌) ఓ ఐ.టి. ఆఫీసర్‌. మర్డర్‌ చేశాడన్న ఆరోపణపై పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. దాంతో అతను అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళిపోతాడు. అతని ఆచూకీ చెప్పమని విలన్‌ గ్యాంగ్‌ శైలజను బెదిరిస్తూ వుంటుంది. శాస్త్రి తల్లి(షావుకారు జానకి)కి హార్ట్‌ స్ట్రోక్‌ రావడంతో ఆమెను హాస్పిటల్‌లో జాయిన్‌ చేస్తారు. ఆమెకు అర్జెంట్‌గా ఆపరేషన్‌ చెయ్యాలంటాడు డాక్టర్‌. తన కొడుకు వస్తేనే కానీ ఆపరేషన్‌ చేయించుకోనని పట్టుపడుతుంది అతని తల్లి. ఆమెను చూడడానికి శాస్త్రి వస్తాడు. అదే టైమ్‌లో పోలీసులు చుట్టు ముట్టి యు ఆర్‌ అండర్‌ అరెస్ట్‌ అనేస్తారు. అందులో ఓ ఆఫీసర్‌ అయిన బ్రహ్మాజీ ఇదంతా కృష్ణ స్కెచ్‌ అనీ, శాస్త్రిని బయటికి రప్పించడానికే ఆమెకు దగ్గరయ్యాడనే నిజాన్ని శైలజకు చెప్తాడు. అప్పుడు శైలజ రియాక్షన్‌ ఏమిటి? శాస్త్రి అండర్‌ గ్రౌండ్‌కి ఎందుకు వెళ్ళిపోయాడు? శైలజకు దగ్గరైన కృష్ణ నిజంగానే ఆమెను ప్రేమించాడా లేక తన ప్లాన్‌లో భాగంగానే అలా చేశాడా? శాస్త్రి కోసం విలన్‌ గ్యాంగ్‌ ఎందుకు వెతుకుతోంది? శాస్త్రి నిర్దోషి అని కృష్ణ ఎలా ప్రూవ్‌ చేశాడు? అనేది మిగతా కథ. 

ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా మారుతి రాసుకున్న ఈ కథలో చాలా లొసుగులు వున్నాయి. ఎసిపి స్థాయిలో వున్న ఓ పోలీస్‌ ఆఫీసర్‌ చిన్న చిన్న విషయాలకు బెండ్‌ అయిపోవడం, ప్రతి చిన్న దానికి కంటతడి పెట్టుకోవడం అనేది సిల్లీగా అనిపిస్తుంది. కనిపించకుండా పోయిన శాస్త్రి ఆచూకీ తెలుసుకోవడం కోసం కృష్ణ అతని కూతురుకి దగ్గరవడం, లక్షలకు లక్షలు ఆమెకు సాయం చేయడం విచిత్రంగా అనిపిస్తుంది. రెగ్యులర్‌గా కుటుంబ సభ్యులతో ఫోన్‌ టచ్‌లో వుండే ఓ నేరస్తుడు ఎక్కడ వున్నాడో కనిపెట్టడం పోలీసులకు అంత కష్టమైన పనేం కాదు. అలాగే విలన్‌, అతని అనుచరులకు కూడా అది అంత రిస్క్‌ అనిపించే విషయం కాదు. కానీ, సినిమా ఎండింగ్‌ వరకు పోలీసులు గానీ, విలన్‌ మనుషులు కానీ అతన్ని పట్టుకోలేకపోతారు. పోలీసుల వలలో ఓసారి చిక్కుకున్న శాస్త్రి చాలా తమాషాగా తప్పించుకొని పారిపోతాడు. ఇలాంటి తల, తోక లేని సీన్స్‌ సినిమాలో చాలా వున్నాయి. కేసుకు సంబంధించిన విషయంలోనే శైలజకు కృష్ణ దగ్గరైనట్టు నటిస్తున్నాడని సినిమా స్టార్ట్‌ అయిన కొద్దిసేపటికే ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. 

పెర్‌ఫార్మెన్స్‌ విషయానికి వస్తే వెంకటేష్‌కి ఇలాంటి క్యారెక్టర్‌ చెయ్యడం కొత్తేమీ కాదు. కాబట్టి తన లిమిట్స్‌లో క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. నయనతారది కూడా చాలా రొటీన్‌ క్యారెక్టర్‌. ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ అవసరం లేని క్యారెక్టర్‌ ఆమెది. ఈ సినిమాలో ఫస్ట్‌ హాఫ్‌ అంతా పృథ్వీ కోసమే రాసినట్టు అనిపిస్తుంది. బత్తాయి బాబ్జీగా పృథ్వీ మరోసారి పూర్తి స్థాయిలో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేశాడు. గతంలో అతను చేసిన క్యారెక్టర్లను పోలి వున్న క్యారెక్టరే అయినప్పటికీ కొన్ని డైలాగ్స్‌ కొత్తగా వుండడం వల్ల అతన్నుంచి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ వచ్చింది. ఒక దశలో ఫస్ట్‌ హాఫ్‌ హీరో పృథ్వీయేనా అనే డౌట్‌ కూడా ఆడియన్స్‌కి వస్తుంది. దీన్ని బట్టి అతని క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ ఇచ్చారన్నది అర్థమవుతుంది. మిగతా క్యారెక్టర్లలో పోసాని, సంపత్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌ రొటీన్‌ పెర్‌ఫార్మెన్సే కనిపిస్తుంది. సెకండాఫ్‌లో మెజీషియన్‌గా కనిపించే బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షగా మారిపోయింది. 

రిచర్డ్‌ ప్రసాద్‌ ఫోటోగ్రఫీ సినిమాకి మంచి రిచ్‌ లుక్‌ని తీసుకొచ్చింది. సీన్స్‌లోగానీ, సాంగ్స్‌లోగానీ, ఫైట్స్‌లోగానీ ఫోటోగ్రఫీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. జిబ్రాన్‌ చేసిన పాటల్లో మూడు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. ఫారిన్‌ లొకేషన్స్‌లో తీసిన పాటలు విజువల్‌గా బాగున్నాయి. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఉద్దవ్‌ ఎడిటింగ్‌ కూడా ఫర్వాలేదు. ఫస్ట్‌ హాఫ్‌లో పృథ్వీకి మారుతి, డార్లింగ్‌ స్వామి రాసిన మాటలు బాగా పేలాయి. డైరెక్టర్‌ మారుతి విషయానికి వస్తే ఈ సినిమాకి అతను రాసుకున్న కథ అంత గ్రిప్పింగ్‌గా లేదన్నది నిజం. ఈమధ్యకాలంలో వచ్చిన చాలా తెలుగు సినిమాల్లోని రొటీన్‌ కథలాగే ఈ కథ కూడా అనిపిస్తుంది. మంచితనం, జాలి అనే పాయింట్‌తో ఎంటర్‌టైన్‌ చేద్దామనుకున్న అతని ఆలోచన వర్కవుట్‌ అవ్వలేదు సరికదా చాలా సీన్స్‌లో చిరాకు కూడా తెప్పించింది. సినిమాలోని మెయిన్‌ పాయింట్‌ చెప్పుకోదగ్గది కాకపోవడంతో నెక్స్‌ట్‌ సీన్‌లో ఏం జరగబోతోందనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో కలగదు. సెకండాఫ్‌కి వచ్చేసరికి ఎక్కడ వదిలేసిన కథ అక్కడే వుండడం, రకరకాల సీన్స్‌తో ఎంటర్‌టైన్‌ చెయ్యాలని ట్రై చెయ్యడంతోనే సినిమాని క్లైమాక్స్‌ వరకు లాక్కొచ్చాడు. కథ, కథనాలను బట్టి క్లైమాక్స్‌ అంత భారీగా వుండదు అని ఆడియన్స్‌ ఊహిస్తారు. దానికి తగ్గట్టుగానే ఓ పేలవమైన ఫైట్‌తో సినిమా ఎండ్‌ అవుతుంది. సినిమాలో కాస్తో కూస్తో ఎంటర్‌టైన్‌మెంట్‌ వుందీ అంటే అది పృథ్వీ క్యారెక్టర్‌ వల్లే. అంతకుమించి సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలుగానీ, విశేషాలుగానీ ఏమీ లేవు. సినిమాలో ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. మేకింగ్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే పేలవమైన కథ, కథనాలతో, రొటీన్‌ క్యారెక్టరైజేషన్స్‌తో మారుతి చేసిన బాబు బంగారం ఎక్స్‌పెక్ట్‌ చేసిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యలేకపోయింది. 

ఫినిషింగ్‌ టచ్‌: అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement