Advertisement

సినీజోష్‌ రివ్యూ: రాయుడు

Sat 28th May 2016 02:21 PM
vishal new movie rayudu,telugu movie rayudu reveiw,rayudu movie review in cinejosh,rayudu movie cinejosh review  సినీజోష్‌ రివ్యూ: రాయుడు
సినీజోష్‌ రివ్యూ: రాయుడు
Advertisement

విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ 

హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ 

రాయుడు 

తారాగణం: విశాల్‌, శ్రీదివ్య, రాధారవి, ఆర్‌.కె.సురేష్‌, 

కులప్పులి లీల, సూరి తదితరులు 

సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌ 

సంగీతం: డి.ఇమాన్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌. 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

సమర్పణ: విశాల్‌ 

నిర్మాత: జి.హరి 

రచన, దర్శకత్వం: ముత్తయ్య 

విడుదల తేదీ: 27.05.2016 

హీరో విశాల్‌ చేసే సినిమాలన్నీ దాదాపు మాస్‌ ఎంటర్‌టైనర్సే. తమిళ్‌తోపాటు తెలుగులోనూ అతనికి మంచి ఫాలోయింగ్‌ వుంది. విశాల్‌ సినిమా అంటే తెలుగులో కూడా మినిమం గ్యారెంటీ అనే నమ్మకం బయ్యర్స్‌లోనూ, డిస్ట్రిబ్యూటర్స్‌లోనూ వుంది. దానికి తగ్గట్టుగానే దాదాపు విశాల్‌ తమిళ్‌లో చేసిన ప్రతి సినిమానీ తెలుగులో రిలీజ్‌ చేస్తూ వుంటారు. అలా తమిళ్‌లో ముత్తయ్య దర్శకత్వంలో మరుదుగా రూపొందిన చిత్రాన్ని తెలుగులో రాయుడు పేరుతో విడుదల చేశారు. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్న విశాల్‌ పందెంకోడి నుంచి ఇటీవల వచ్చిన కథకళి చిత్రం వరకు అతని గెటప్‌లో ఎలాంటి మార్పు వుండేది కాదు. కానీ, లేటెస్ట్‌ మూవీ రాయుడులో మాత్రం చాలా డిఫరెంట్‌గా కనిపించాడు. గతవారం తమిళ్‌లో రిలీజ్‌ అయిన మరుదు విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఒక వారం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయుడు ఇక్కడి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాడు? విశాల్‌ కొత్త గెటప్‌ని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేర ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

రాయుడు(విశాల్‌) ఓ మార్కెట్‌లో మూటలు మోసే కూలీ. తల్లిదండ్రులు లేని రాయుడు తను అన్నమ్మ అని పిలిచే అమ్మమ్మ (కులప్పులి లీల) దగ్గరే పెరిగాడు. అతనికి అన్నమ్మ అంటే అంతులేని ప్రేమ. అన్నమ్మకి రాయుడు అంటే ప్రాణం. ఎక్కడ అన్యాయం జరిగినా సహించలేని వ్యక్తిత్వం కలిగిన రాయుడు ఎప్పుడూ ఎవరో ఒకరితో తలపడుతూ వుంటాడు. అది అన్నమ్మకు నచ్చదు. కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో పరిచయమైన భాగ్యలక్ష్మీ(శ్రీదివ్య)ను ప్రేమించమని మనవడ్ని ప్రోత్సహిస్తుంది అన్నమ్మ. కాబోయే తన భర్తకి కొన్ని క్వాలిటీస్‌ వుండాలన్నది భాగ్య అభిప్రాయం. ఆమె ఇష్టపడే విధంగా నడుచుకుంటూ ఆమెను ఇంప్రెస్‌ చేస్తాడు రాయుడు. కథలో మరో వైపు రోలెక్స్‌ బాచి(ఆర్‌.కె.సురేష్‌) ఎమ్మెల్యే కావాలని కలలు గనే వ్యక్తి. భైరవుడు అనే బడా వ్యాపారికి అనుచరుడుగా వుంటూ అతని వల్ల పదవులు పొందుతూ వుంటాడు. ఆ ఊరిలో అతి క్రూరుడుగా పేరు తెచ్చుకున్న బాచి తన అక్రమ వ్యాపారాలకు అడ్డు వచ్చిన వారిని మట్టు పెడుతూ ప్రజల్లో భయాన్ని కలిగిస్తుంటాడు. అలాంటి బాచి.. భాగ్యలక్ష్మీ తల్లిని కొంత కాలం క్రితం నడిరోడ్డులో హత్య చేస్తాడు. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబానికి అన్యాయం చేసిన రోలెక్స్‌ బాచితో కయ్యానికి దిగుతాడు రాయుడు. భాగ్యలక్ష్మీ తల్లిని బాచి ఎందుకు చంపాడు? ఆ హత్య వెనుక అసలు కథ ఏమిటి? బాచితో తలపడిన రాయుడుకి కుటుంబ పరంగా ఎలాంటి నష్టం జరిగింది? చివరికి బాచిపై రాయుడు ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది మిగతా కథ. 

పూర్తి తమిళ నేటివిటీతో రూపొందిన సినిమా ఇది. విశాల్‌, శ్రీదివ్య, సూరి తప్ప తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ఆర్టిస్టులు ఎవ్వరూ లేరు. పైగా ఆర్టిస్టులకు మేకప్‌ లేకుండా నేచురల్‌గా తియ్యడంతో తమిళ్‌ సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది తప్ప తెలుగులోకి డబ్‌ అయిన సినిమా చూస్తున్నట్టుగా అనిపించదు. అయితే ఇందులో లవ్‌ ట్రాక్‌ వుంది, అమ్మమ్మ, మనవడి మధ్య మంచి సెంటిమెంట్‌ వుంది, మంచి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. కథగా చెప్పుకుంటే చాలా సాధారణమైన కథ. దానికి మంచి కథనాన్ని జోడించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌ ముత్తయ్య. రాయుడుగా విశాల్‌ చాలా కొత్తగా కనిపించాడు. అతని గెటప్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ, డైలాగ్స్‌గానీ అతను ఇంతకుముందు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా వున్నాయి. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో, సెంటిమెంట్‌ సీన్స్‌లో తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు విశాల్‌. ఇక హీరోయిన్‌ శ్రీదివ్య విషయానికి వస్తే సినిమాలో ఓ కీలక పాత్ర అయినప్పటికీ ఆమె క్యారెక్టర్‌ అంతగా ఎస్టాబ్లిష్‌ అవ్వదు. సినిమా మొత్తంలో స్క్రీన్‌ మీద ఎక్కువ కనిపించిన ఆర్టిస్టులు అన్నమ్మగా నటించిన లీల, రోలెక్స్‌ బాచిగా నటించిన ఆర్‌.కె.సురేష్‌. వీళ్ళిద్దరూ తమ క్యారెక్టర్స్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. ముఖ్యంగా లీల పెర్‌ఫార్మెన్స్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పాల్సి వస్తే సినిమాటోగ్రాఫర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సినిమాకి ఒక లుక్‌ని తీసుకొచ్చారు. వేల్‌రాజ్‌ ప్రతి ఫ్రేమ్‌ని చాలా నేచురల్‌గా తీశాడు. అతని వర్క్‌ ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇమాన్‌ చేసిన పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం సూపర్బ్‌ అనిపించాడు. డైరెక్టర్‌ ముత్తయ్య గురించి చెప్పాలంటే విలన్‌ రోలెక్స్‌ బాచిపై సినిమా స్టార్టింగ్‌లోనే ఇంట్రడక్షన్‌ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సీన్స్‌లో అతని ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ గురించి చూపిస్తూ అసలు కథలోకి రాకుండా తాత్సారం చేశాడు. మధ్యలో హీరో, హీరోయిన్‌ల లవ్‌ ట్రాక్‌ పరమ సుత్తిగా అనిపిస్తుంది. లవ్‌ ట్రాక్‌ చాలా ఎపిసోడ్స్‌గా వచ్చి ఆడియన్స్‌ని ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సెకండాఫ్‌ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించలేకపోయింది. అంటే అసలు కథలోకి సెకండాఫ్‌లోనే వెళ్ళాడు డైరెక్టర్‌. కథను రకరకాల మలుపులు తిప్పి ఒక భారీ క్లైమాక్స్‌తో ఎండ్‌ చేశాడు. 

విశాల్‌ కెరీర్‌లో డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌, డిఫరెంట్‌ గెటప్‌తో వచ్చిన ఈ సినిమా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. హీరో, హీరోయిన్‌, విలన్‌ ఇంట్రడక్షన్స్‌ తర్వాత అసలు కథలోకి వెళ్ళకుండా విశాల్‌, శ్రీదివ్య ల లవ్‌ ట్రాక్‌ ఆడియన్స్‌ విసిగించేంత లెంగ్తీగా అనిపిస్తుంది. కథలో ఎలాంటి కదలిక లేకుండా ఒక ట్విస్ట్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. సెకండాఫ్‌లో దఫ దఫాలుగా ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌ రన్‌ అవుతాయి. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చిన సినిమా స్పీడ్‌ పెరుగుతుంది. భారీ యాక్షన్‌తో కూడి క్లైమాక్స్‌లో విలన్‌ని హీరో హతమార్చడంతో సినిమా ఎండ్‌ అవుతుంది. విశాల్‌, లీల, ఆర్‌.కె.సురేష్‌ పెర్‌ఫార్మెన్స్‌, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్స్‌ సినిమాకి ప్లస్‌ అవ్వగా, విసిగించే లవ్‌ ట్రాక్‌, పాత కథ, ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచని అంశాలు సినిమాకి మైనస్‌ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే విశాల్‌ డిఫరెంట్‌గా కనిపించినా, బ్యాక్‌డ్రాప్‌ కొత్తగా అనిపించినా కథ, కథనాలు పాతవే కావడం, ఆడియన్స్‌లో క్యూరియాసిటీని కలిగించలేకపోవడంతో రాయుడు ఓ సాధారణ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. 

ఫినిషింగ్‌ టచ్‌: మాస్‌ ఎంటర్‌టైనరే. కానీ... 

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement