Advertisement

సినీజోష్‌ రివ్యూ: ఎటాక్‌

Sat 02nd Apr 2016 12:13 PM
ramgopal varma latest movie attack,telugu movie attack review,attack movie review in cinejosh,attack cinejosh review,jagapathi babu in attack,surabhi in attack  సినీజోష్‌ రివ్యూ: ఎటాక్‌
సినీజోష్‌ రివ్యూ: ఎటాక్‌
Advertisement

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ 

శ్రీశుభశ్వేత ఫిలింస్‌ 

ఎటాక్‌ 

తారాగణం: మంచు మనోజ్‌, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, 

వడ్డే నవీన్‌, అభిమన్యు సింగ్‌, సురభి, పూనమ్‌ కౌర్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: అంజి 

సంగీతం: రవిశంకర్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: శేషు కె.ఎం.ఆర్‌. 

ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ 

నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు 

రచన, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ 

విడుదల తేదీ: 01.04.2016 

తెలుగు సినిమా ఫార్మాట్‌ మార్చిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. మూసకథల ఊబి నుంచి తెలుగు సినిమాని బయటికి లాగి కొత్త టెక్నిక్‌ పరిచయం చేసి టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో వుండే ఎన్నో సినిమాలు రావడానికి మూల కారకుడయ్యాడు. టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ట్రెండ్‌కి భిన్నంగా వుండే సినిమాలు చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన రామ్‌గోపాల్‌వర్మ ఈమధ్యకాలంలో కొన్ని సిల్లీ మూవీస్‌ చేసి అతన్ని అభిమానించే వారి నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇటీవల వచ్చిన కిల్లింగ్‌ వీరప్పన్‌ చిత్రంతో హి ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకున్నాడు. లేటెస్ట్‌గా మంచు మనోజ్‌, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో తనకెంతో ఇష్టమైన పగ, ప్రతీకారాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం ఎటాక్‌. ఈరోజు విడుదలైన ఈ చిత్రంలో వర్మ చూపించిన కొత్త అంశాలు ఏమిటి? ఎటాక్‌ ఎందుకు జరుగుతుంది? ఎవరి మీద జరుగుతుంది? జరిగే ఎటాక్స్‌కి కారణాలు ఏమిటి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

అతని పేరు గురురాజ్‌(ప్రకాష్‌ రాజ్‌) ఫ్లాష్‌బ్యాక్‌లో రౌడీయిజం చేసినా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటూ వుంటాడు. గురురాజ్‌కి ముగ్గురు కొడుకులు. కాళి(జగపతిబాబు), గోపీ(వడ్డే నవీన్‌), రాధ(మంచు మనోజ్‌). గురురాజ్‌కి ఓ స్థలం విషయంలో కొంతమందితో వివాదం ఏర్పడుతుంది. దాని కారణంగా గురురాజ్‌ హత్యకు గురవుతాడు. ప్రస్తుతం అతనికి శత్రువులు అంటూ ఎవరూ లేరు. అయితే అతన్ని ఎవరు చంపి వుంటారు అనేది అతని ముగ్గురు కొడుకులకు అర్థం కాదు. అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న కాళిని కూడా చంపేస్తారు. తండ్రి, అన్నయ్య హత్యకు గురి కావడంతో పగతో రగిలిపోతాడు రాధ. తన వాళ్ళని చంపిన వారిని రాధ ఎలా కనిపెట్టగలిగాడు? వారికి ఎలాంటి శిక్ష విధించాడు? అనేది మిగతా కథ. 

యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో కెమెరాతో రకరకాల విన్యాసాలు చేయిస్తూ, సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో థ్రిల్‌ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో తను అనుకున్న ఎమోషన్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ ప్రజెంట్‌ చెయ్యగల వర్మ ఒక్కోసారి తన ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ప్రేక్షకుల్ని విసిగించే సినిమాలు కూడా తీశాడు. వర్మ ఇలాంటి సినిమా తీశాడా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈరోజు విడుదలైన ఎటాక్‌ కూడా అదే కోవకు చెందిన సినిమా అయింది. బలహీనమైన కథ, కొత్తదనం లేని క్యారెక్టర్లు, అనవసరమైన హంగామా, అవసరానికి మించిన హింస, చెవులు ఊదరగొట్టే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌.. ఇవన్నీ ప్రేక్షకుల మీద ఎటాక్‌ చేస్తాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఏ క్షణంలోనూ నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందనే క్యూరియాసిటీ ఆడియన్స్‌కి కలగదు. ప్రకాష్‌రాజ్‌ మొదటి సీన్‌లోనే మర్డర్‌కి గురైనా సినిమా మొత్తం అక్కడక్కడ కనిపిస్తుంటాడు. హీరోకి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ప్రకాష్‌రాజ్‌ స్క్రీన్‌ మీద ప్రత్యక్షమై తన ఫిలాసిఫికల్‌ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ నీరసపడేలా తన వంతు కృషి చేస్తుంటాడు. ఇక హీరో మంచు మనోజ్‌కి ఒక లవర్‌ వుంటుంది. ఆమె పేరు వల్లి(సురభి). సినిమా మొత్తంలో ఆమె కనిపించిన ప్రతి సీన్‌లోనూ పగ తీర్చుకోవడానికి నువ్వు కూడా హత్యలు చెయ్యడం మొదలు పెట్టొద్దు అని చెప్తుంటుంది. దీంతో సురభి కనపడగానే ఆడియన్స్‌లో అసహనం మొదలవుతుంది. మరో పక్క అభిమన్యు సింగ్‌, పూనమ్‌ కౌర్‌లు తమ విచిత్ర ప్రవర్తనతో ఇబ్బంది పెడుతూ వుంటారు. పెర్‌ఫార్మెన్స్‌ విషయానికి వస్తే ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఫలానా వాళ్ళు బాగా చేశారు అని చెప్పుకోవడానికి ఒక్క క్యారెక్టర్‌ కూడా లేదు. రామ్‌గోపాల్‌వర్మ చిత్రాల్లో ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌గానీ, ఎక్స్‌ప్రెషన్స్‌గానీ ఎలా వుంటాయో ఇందులోనూ అలాగే అనిపిస్తాయి తప్ప ఒన్‌ పర్సెంట్‌ కూడా మనకు డిఫరెన్స్‌ అనేది కనిపించదు. 

సినిమాలో విషయం లేకపోయినా టెక్నికల్‌గా లాక్కొచ్చేద్దామని వర్మ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కొన్ని సీన్లు కెమెరా చేసే విన్యాసాలు చూపించడానికే తీసినట్టుగా అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసిన శేషు సినిమా మొదలైనప్పటి నుంచి బాదుడే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ప్రతి సీన్‌లోనూ హెవీ మ్యూజిక్‌తో ప్రేక్షకులకు తలపోటు తెప్పించాడు. ఇక వర్మ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి ఒక కథ అంటూ అనుకున్నాడో లేదో తెలీదుగానీ సినిమా అంతా అతుకుల బొంతలా అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే లెంగ్తీ సీన్స్‌, పసలేని డైలాగ్స్‌, ముఖ్యంగా ప్రకాష్‌ రాజ్‌ చెప్పే డైలాగ్స్‌ కామన్‌ ఆడియన్‌కి ఎంత బుర్ర పెట్టినా అర్థం కాని విధంగా వున్నాయి. టెక్నికల్‌గా బాగా సౌండ్‌గా వుండాలని ఆలోచించిన వర్మ కథ, కథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పాలి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌గానీ, క్లైమాక్స్‌గానీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఫైనల్‌గా చెప్పాలంటే ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు తీసిన వర్మ వాటిని మించిన డిజాస్టర్లు కూడా ఇచ్చాడు. ఆ డిజాస్టర్ల లిస్ట్‌లో ఎటాక్‌ కూడా చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఆడియన్స్‌పై ఎటాక్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement