Advertisement

సినీజోష్‌ రివ్యూ: మలుపు

Sat 20th Feb 2016 01:15 PM
telugu movie malupu,aadi pinisetty latest movie malupu,malupu movie review,malupu movie cinejosh review,malupu review in cinejosh,malupu movie director satyaprabhas pinisetty  సినీజోష్‌ రివ్యూ: మలుపు
సినీజోష్‌ రివ్యూ: మలుపు
Advertisement

ఆదర్శ చిత్రాలయ ప్రై. లిమిటెడ్‌ 

మలుపు 

తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని, మిథున్‌ చక్రవర్తి, 

పశుపతి, రిచా పలోడ్‌, ప్రగతి, హరీష్‌ ఉత్తమన్‌, 

నాజర్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఎన్‌.షణ్ముగ సుందరం 

సంగీతం: ప్రసన్‌ ప్రవీణ్‌ శ్యామ్‌ 

ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌ 

నిర్మాత: రవిరాజా పినిశెట్టి 

రచన, దర్శకత్వం: సత్యప్రభాస్‌ పినిశెట్టి 

విడుదల తేదీ: 19.02.2016 

తెలుగులో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన సీనియర్‌ దర్శకులు రవిరాజా పినిశెట్టి నిర్మాతగా మారి పెద్ద కుమారుడు సత్యప్రభాస్‌ పినిశెట్టి దర్శకత్వంలో నిర్మించిన క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మలుపు. మృగం, ఒక విచిత్రం, వైశాలి, గుండెల్లో గోదారి వంటి డిఫరెంట్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రవిరాజా చిన్న కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా రూపొందిన ఈ చిత్రం ఆమధ్య తమిళ్‌లో విడుదలై ఏవరేజ్‌ మూవీ అనిపించుకుంది. తెలుగులో ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించగలిగిందా? ఈ చిత్రంతో పరిచయమైన సత్యప్రభాస్‌ డైరెక్టర్‌గా పాస్‌ మార్కులు తెచ్చుకోగలిగాడా? ఆది పినిశెట్టికి ఈ సినిమా ఎంతవరకు ప్లస్‌ అవుతుంది? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

సతీష్‌ గణపతి అలియాస్‌ సగ(ఆది), శివ, రాజేష్‌, కిషోర్‌ ప్రాణ స్నేహితులు. ఈ నలుగురు ఫైనల్‌ ఎగ్జామ్స్‌ కూడా మిస్‌చేసి మరో ఆరు నెలలు స్టూడెంట్స్‌గానే వుండి లైఫ్‌ని ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటారు. ఆ సంవత్సరం డిసెంబర్‌ 31ని బాగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. సగ లేని టైమ్‌లో అతని ముగ్గురు ఫ్రెండ్స్‌ ముంబై అండర్‌ వరల్డ్‌ డాన్‌ అయిన ముదలియార్‌ కూతురు ప్రియ(రిచా పలోడ్‌)తో ఓ హోటల్‌లో మిస్‌ బిహేవ్‌ చేస్తారు. దాంతో ఆమె ఫ్రెండ్‌ సూర్య(శ్రవణ్‌) ముగ్గురు ఫ్రెండ్స్‌తో గొడవ పడతాడు. అదే టైమ్‌లో వచ్చిన సగ కూడా సూర్యతో తలపడతాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నలుగురిలో పోలీస్‌ కమిషనర్‌ కొడుకు, ఎం.పి. కొడుకు, బిజినెస్‌ మాగ్నెట్‌ కొడుకు వుండడంతో నలుగుర్నీ పంపించేసి సూర్యని అరెస్ట్‌ చేస్తారు పోలీసులు. ప్రియ దాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని పోలీసులకు, నలుగురు ఫ్రెండ్స్‌కి వార్నింగ్‌ ఇస్తుంది. మొత్తానికి సూర్యని పోలీస్‌ కస్టడీ నుంచి విడిపించుకుంటుంది. విషయం తెలుసుకున్న ముదలియార్‌ మనుషులు ఈ నలుగుర్నీ చంపాలని బయల్దేరతారు. ఆది ముగ్గురు ఫ్రెండ్స్‌ అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళిపోతారు. తన అక్క పెళ్ళి వుండడంతో ఊళ్ళోనే వున్న సగ వెంట పడతారు ముదలియార్‌ మనుషులు. తమ వల్ల జరిగిన పొరపాటుకి క్షమించమని అడగడానికి ముంబాయి వెళ్ళి ముదలియార్‌ని కలుసుకుంటాడు సగ. అయితే ప్రియ, ఆమె ఫ్రెండ్‌ సూర్య మూడు రోజులుగా కనిపించడం లేదన్న విషయం తెలుసుకొని షాక్‌ అవుతాడు సగ. ప్రియ మిస్సింగ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా సగను హింసిస్తాడు ముదలియార్‌. ప్రియ, ఆమె ఫ్రెండ్‌ సూర్య ఏమయ్యారు? అసలు డిసెంబర్‌ 31 రాత్రి వైజాగ్‌లో ఏం జరిగింది? ఈ కేసు నుంచి నలుగురు ఫ్రెండ్స్‌ బయట పడగలిగారా? స్నేహితుల్ని రక్షించుకోవడానికి సగ ఏం చేశాడు? అనేది మిగతా కథ. 

సగగా ఆది పినిశెట్టి చాలా ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. లవ్‌ సీన్స్‌లో, సెంటిమెంట్‌ సీన్స్‌లో, ఎమోషనల్‌ సీన్స్‌లో పేరు పెట్టడానికి లేని విధంగా తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ లాస్యగా నటించిన నిక్కీ గల్రాని అల్లరి పిల్లగా తన పెర్‌ఫార్మెన్స్‌తో అలరించింది. ముదలియార్‌గా మిథున్‌ చక్రవర్తి కనిపించిన సీన్స్‌ కొన్నే అయినా ప్రతి సీన్‌లో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ముదలియార్‌ కూతురు ప్రియగా రిచా పలోడ్‌ చాలా ఇన్‌వాల్వ్‌ అయి చేసింది. మిగతా పాత్రల్లో శ్రవణ్‌, పశుపతి, లక్ష్మీప్రియ చంద్రమౌళి, నాజర్‌ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ విషయానికి వస్తే షణ్ముగ సుందరం ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా వుంది. నేచురల్‌ లైటింగ్స్‌తో ప్రతి సీన్‌ని ఎంతో సహజంగా చిత్రీకరించాడు. ప్రసన్‌ ప్రవీణ్‌ శ్యామ్‌ చేసిన పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం కథకు తగ్గట్టుగా, మూడ్‌కి తగ్గట్టుగా బాగా చేశాడు. డైరెక్టర్‌ సత్యప్రభాస్‌ గురించి చెప్పాలంటే తనకి మొదటి సినిమాయే అయినప్పటికీ ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ వున్న డైరెక్టర్‌లా తీశాడు. అయితే డిసెంబర్‌ 31న ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడానికి ఎంతో క్యూరియాసిటీతో వచ్చిన అడియన్స్‌కి ఫస్ట్‌హాఫ్‌లోని లవ్‌ ట్రాక్‌ విసుగు పుట్టిస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథలోకి వచ్చిన తర్వాత కథతో సినిమాని స్పీడ్‌గా ఎండింగ్‌ వరకు తీసుకు రాగలిగాడు. సెకండాఫ్‌ అంతా కథపైనే వెళ్ళినప్పటికీ ల్యాగ్‌ అనిపించే సీన్స్‌ కూడా సెకండాఫ్‌లో వుండడం సినిమాకి మైనస్‌ అయింది. 

ఓపెనింగ్‌ సీన్‌లోనే డిసెంబర్‌ 31న ఏం జరిగింది? అంటూ స్టార్ట్‌ అయ్యే సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే లవ్‌ ట్రాక్‌, ఫ్యామిలీ ట్రాక్‌ బాగానే వున్నా ఆడియన్స్‌ని ఆకట్టుకోవు. పైగా ఫస్ట్‌ హాఫ్‌ అంతా స్లో నేరేషన్‌తో నడవడం సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. ఫస్ట్‌హాఫ్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌తో రన్‌ చేసి సెకండాఫ్‌లో సీరియస్‌గా కథలోకి వెళ్ళినట్టయితే బాగుండేది. కథలో ముదలియార్‌ క్యారెక్టర్‌ ఎంటర్‌ అయిన తర్వాత స్పీడ్‌ అందుకుంటుంది. క్లైమాక్స్‌ వరకు నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌కి కలిగించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఆది పెర్‌ఫార్మెన్స్‌, ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌ ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ కాగా, స్లో నేరేషన్‌, ఫస్ట్‌ హాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే కథలో, కథనంలో కొత్తదనం వుండాలని కోరుకునే ప్రేక్షకులకు మలుపు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఊహించలేని ట్విస్ట్‌లతో ఆడియన్స్‌కి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా మలుపు. 

ఫినిషింగ్‌ టచ్‌: డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement