Advertisement

సినీజోష్ రివ్యూ: స్పీడున్నోడు

Sat 06th Feb 2016 02:40 PM
speedunnodu movie review,cinejosh review speedunnodu,bellamkonda saisrinivas,sonarika,tamanna,bhimaneni srinivasa rao,telugu movie speedunnodu review  సినీజోష్ రివ్యూ: స్పీడున్నోడు
సినీజోష్ రివ్యూ: స్పీడున్నోడు
Advertisement

బ్యానర్ : గుడ్ విల్ సినిమా 

మూవీ నేమ్: స్పీడున్నోడు 

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సొనారిక భదోరియ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, కబీర్ దుహాన్ సింగ్, చైతన్య కృష్ణ తదితరులు

సినిమాటోగ్రఫి: విజయ్ ఉలగనాథ్

ఎడిటింగ్: గౌతంరాజు

సంగీతం: DJ వసంత్

మాటలు: రవి వర్మ

నిర్మాతలు: భీమనేని సునీత, వివేక్ కూచిభోట్ల

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాస రావు

తమిళంలో సూపర్ హిట్టయిన 'సుందర పాండ్యన్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిందే ఈ 'స్పీడున్నోడు'. రీమేక్ స్పెషలిస్టుగా పేరు పొందిన భీమనేని శ్రీనివాస రావు గారు స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండవ ప్రయత్నం. మొదటి మూవీతో ఫర్వాలేదు అనిపించుకున్న సాయికి ఈ 'స్పీడున్నోడు' ఎంతో కీలకం కానుంది. 'జాదూగాడు'తో హీరోయిన్ అయిన సొనారిక ఇక్కడ కథానాయిక. హీరోగా సాయి అభివృద్ధికి, చాన్నాళ్ళ తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్న భీమనేనికి  ఈ సినిమా ఎలా ఉపయోగపడనుందో సమగ్ర సమీక్షలో తెలుసుకుందాం.

రాయలసీమ ప్రాతంలోని ఓ గ్రామంలో శోభన్ (సాయి శ్రీనివాస్) అనే కుర్రాడు, ఓ సంపన్న కుటుంబంలోని (ప్రకాష్ రాజ్) సంతానం. ఇతడికి స్నేహితులంటే వల్లమాలిన పిచ్చి. ఎంతలా అంటే వాడు వెధవ అయినా, AR రహమాన్ అయినా ఫ్రెండ్ అయితే చాలు వాడి కోసం ఏమైనా చేసేస్తా అంటాడు. ఇక హీరోగారి గాలివాటం బ్యాచిలో ఉండే స్నేహితులు కోకొల్లలు (శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, శకలక శంకర్ వగైరాలు). తన ఊరే కాదన్నట్టు, పక్క ఊరిలో కూడా వీరికి స్నేహితుల మందలు ఉంటాయి. అల్లర చిల్లరగా సాగుతున్న ఈ బ్యాచిలోని మెంబర్ గిరి (మధు నందన్), వన్ సైడ్ ప్రేమను గెలిపించడానికి రంగంలోకి దిగుతాడు శోభన్. తీరా చూస్తే ఆ అమ్మాయి వాసంతి (సొనారిక) ఎవరో కాదు మన హీరోగారు కాలేజీలో లైన్ వేసిన ఫిగరే. వాసంతికి ఊరంతా ప్రేమికులే. అందులో మరొకడు మళ్ళీ మన హీరో గారి ఫ్రెండు మదన్ (చైతన్య కృష్ణ)కు ఫ్రెండ్ సత్య (సత్య). ఇక ఎవరికో ఒకరికి హీరోయిన్ ప్రేమని అంటగట్టాలని రిజర్వేషన్ పాలిసీ ఫాలో అవుతూ ప్రయత్నాలు సాగిస్తున్న హీరోకే హీరోయిన్ పడిపోవడం ఇక్కడ మొదటి మెలిక. పడింది మనాడికేగా అని అందరూ గమ్మున ఊరుకొని డ్యూయెట్ వేసుకుంటే, వాసంతి తండ్రి (రావు రమేష్) మాత్రం మేనరికం అల్లుడు జగన్ (కబీర్ దుహాన్ సింగ్)తో నిశ్చిథార్థానికి ఏర్పాట్లు చేసేస్తాడు. ఇది రెండో మెలిక. కథలో మరింత వేగానికి మూడో మెలిక. చిన్న గొడవలో సత్య చనిపోవడంతో హీరో ముందు కొత్త ఆపద వచ్చి పడుతుంది. ఇక వీటన్నింటినీ చేధించి, నా అనుకున్న స్నేహితులైన విరోధులను ఎదిరించి, ప్రాణాలకు తెగించి, అసలైన స్నేహం, ప్రేమ నిర్వచనం ఇవ్వడమే కథలోని మిగతా తంతు. 

సినిమా మొదలు పెట్టిన దగ్గరి నుండీ ఫ్రెండ్ షిప్ మీదే తేలుతూ వచ్చే ఈ కథలో ప్రేమ, ఫీల్ గుడ్ అంశాలను కూడా కలగలిపారు భీమనేని. ఒరిజినల్ తమిళ వాసనకి దూరంగా తీసుకెళ్లాలన్న తపనో లేక కథనాన్ని హీరో సెంట్రిక్ చేయాలన్న తెలుగు సినిమా ప్రాథమిక సూత్రమో తెలియదు గానీ, భీమనేని గారు  తమిళంలో ఉన్నది ఉన్నట్టుగా వాడుకోకుండా కమర్షియల్ దృక్పదంలో వృదా ప్రయాసకు పోయి కథను, కథనాన్ని కొరగాకుండా చేశారు. మొదటి సగం మొత్తం బస్సులో వచ్చే హీరోయిన్ ప్రేమను తన ఫ్రెండ్స్ గెలుచుకోవడానికి హీరో పడే పాట్లు ఎంత మాత్రం పండలేదు. ఇదే ప్రక్రియలో భాగంగా మిగతా మిత్రుల పాత్రలని, హీరో అండ్ హీరోయిన్ ఫ్యామిలీని పరిచయం చేసేసారు దర్శకులు. కథాగమనం పూర్తిగా మందగిస్తున్న సమయంలో హీరోయిన్ ఏకంగా హీరోకే పడిపోవడం, ఇందుకోసం రాసుకున్న ఓ యాక్సిడెంట్ ఎపిసోడ్ ఫర్వాలేదు అనిపిస్తాయి. మరో పాటేసుకుని కథలోకి వచ్చేస్తే హీరోయిన్ ఇంటి పెద్దల నుండి లవ్వుకి ప్రాబ్లం ఓపెన్ చేసారు. హీరో తండ్రి (ప్రకాష్ రాజ్) ఇమేజి హీరోయిన్ తండ్రి (రావూర్ అమేష్) ఇమేజి కన్నా గొప్పే అయినా పెళ్ళికి మొదటగా ఎందుకు ఒప్పుకోరో అటు తరువాత రెండవ సగంలో మళ్ళీ ఎందుకు ఒప్పుకుంటారో అన్న విభేదాన్ని చాలా లూజుగా హాండిల్ చేసారు. ఇంతలో కథలోని అసలు పాయింట్ ఫ్రెండ్ షిప్ మళ్ళీ గుర్తుకొచ్చి ఆ కోవలో ఇంకో కృత్రిమమైన త్రెడ్ మీద సెకండ్ హాఫ్ ఆఖరి అంకాన్ని నడిపారు. కేవలం ఓ అమ్మాయి కోసం, చిన్ననాటి నుండి కలిసి తిరిగిన ప్రాణమిత్రుడిని, వీడే మా హీరో అంటూ నోటికొచ్చినట్లు పొగిడిన స్నేహితులే జట్టుకట్టి చంపాలనుకోవడం ఆఖరులో అసలు మింగుడుపడలేదు. లవ్వు, స్నేహం, విశ్వాస ఘాతకం, కుటుంబ విలువలు లాంటి వాటిని అనేకం మిక్స్ చేసి కలగూర గంపలో ఏ ఆకు కూర ఎక్కడుందో వెతికే ప్రయత్నం చేసారు భీమనేని.

బేసిక్ కథాంశంలోని స్నేహం అనే పాయింటుని త్రికరణశుద్ధితో డీల్ చేసి ఉంటె సినిమా స్థాయి మరోలా ఉండేది. అనవసరమైన కమర్షియల్ అంశాల జోలికి వెళ్లి ట్రీట్మెంట్ మొత్తం పలచగా చేయడంతో కథనంలో క్రమంగా పట్టు సడలింది. మళ్ళీ చివర్లో ఎప్పుడో కొంత థ్రిల్లుకు గురయినా అప్పటికే బాగా లేటయింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి ఆర్టిస్టులను సీమ యాసలో మాట్లాడించినా వారిలోని అసలు ప్రతిభను వాడుకోలేదు. ఇక ఫ్రెండ్స్ బ్యాచితో చేసిన అల్లర చిల్లర కామెడీ అక్కడక్కాడా పంచు డయలాగులతో పేలినా మొత్తంగా యావరేజ్ అనిపించింది. హీరోయిన్ సొనారిక చూపుకు గట్టిగానే ఆనినా, నటనా పరంగా పెద్దగా చేయడానికి ఏమీలేదు. తమన్నా ఐటెం పాటలో మరోసారి కుమ్మేసింది. రవి వర్మ సంభాషణలు ఓ మోస్తారుగా ఉన్నా విజయ్ ఉలగనాథ్ కెమెరా పనితనం బాగుంది. అలాగే గౌతం రాజు ఎడిటింగ్ కూడా ఓకే. వసంత్ సంగీతం హుశారెక్కించే పాటలతో బిగ్గరగా ఉంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగానే అనిపిస్తాయి. ఓవరాలుగా స్పీడున్నోడు టైటిలులో ఉన్న వేగం సినిమాలో అస్సలు లేదనే చెప్పాలి. మందకొడి సినిమాలకు మార్కెట్టులో ఎంత విలువుందో రానున్న వారం రోజుల్లో బాక్సాఫీస్ గణాంకాలే చెబుతాయి.

ఫినిషింగ్ టచ్: గేర్ వేయకుండానే యాక్సిలరేటర్ తిప్పారు!

సినీజోష్ రేటింగ్: 2.5/5

Click Here for Speedunnodu English Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement