Advertisement

సినీజోష్‌ రివ్యూ: భలే మంచిరోజు

Sun 27th Dec 2015 05:19 PM
telugu movie bhale manchi roju,bhale manchi roju movie review,bhale manchi roju cinejosh review,sudheer babu new movie bhale manchi roju  సినీజోష్‌ రివ్యూ: భలే మంచిరోజు
సినీజోష్‌ రివ్యూ: భలే మంచిరోజు
Advertisement

70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

భలే మంచిరోజు 

తారాగణం: సుధీర్‌బాబు, వామిక, సాయికుమార్‌, 

పోసాని, చైతన్యకృష్ణ, పృథ్వీ, ధన్య బాలకృష్ణ, 

వేణు, శ్రీరామ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ సైనుద్దీన్‌ 

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌. వర్మ 

సంగీతం: సన్నీ ఎం.ఆర్‌ 

నిర్మాతలు: విజయ్‌, శశి 

రచన, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య 

విడుదల తేదీ: 25.12.2015 

కొత్త తరహా కథలకు, కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌కి ప్రస్తుతం ఆదరణ పెరిగింది. కొంతమంది హీరోలుగానీ, డైరెక్టర్లుగానీ అలాంటి సినిమాలు చెయ్యడానికి, తియ్యడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. అలాంటి హీరోల్లో సుధీర్‌బాబు ఒకడు. తను చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం వుండాలన్న తాపత్రయం అతని సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఆ వరుసలో వచ్చిన మరో సినిమాయే భలే మంచిరోజు. కొత్త జోనర్‌ అని చెప్పలేకపోయినా స్క్రీన్‌ప్లే పరంగా, టేకింగ్‌ పరంగా ఒక కొత్త సినిమా చెయ్యాలన్న తపన డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్యలో కనిపించింది. ఈ శుక్రవారం రిలీజ్‌ అయిన భలే మంచిరోజు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాతో ఆడియన్స్‌ని ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగాడు? సుధీర్‌బాబు కెరీర్‌కి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్‌ అయ్యింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

మూస కథల్ని, ఐదు పాటలు, ఐదు ఫైట్లు, సినిమాకి అవసరం వున్నా లేకపోయినా సెపరేట్‌గా కామెడీ ట్రాక్స్‌ పెట్టి ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ చేసే రోజులు పోయాయి. ప్రేక్షకులు కొత్త ఆలోచనలను, కొత్త కాన్సెప్ట్స్‌ని ఆహ్వానిస్తున్నారు. అలాంటి కొత్త తరహా కథలను అందించే విషయంలో ఇప్పుడొస్తున్న కొత్త డైరెక్టర్లు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా సినిమాలో వుండి తీరాలన్న నిర్మాతల కండీషన్స్‌ని కాదనలేక కావచ్చు, తాము అనుకున్న కాన్సెప్ట్‌ మిస్‌ఫైర్‌ అవుతుందన్న భయం కావచ్చు.. కొన్ని విషయాల్లో మాత్రం ఈ డైరెక్టర్లు రాజీ పడక తప్పడంలేదు. మరి ఈ సినిమాలో అలాంటి అంశాలు ఏం వున్నాయో చూద్దాం. 

హీరో రామ్‌(సుధీర్‌బాబు) బెంజ్‌ కంపెనీలో పనిచేస్తూ కార్లను డెలివరీ ఇస్తుంటాడు. ఎప్పుడూ బెంజ్‌ కార్లలో తిరిగే రామ్‌ని ప్రేమిస్తుంది మాయ(ధన్య బాలకృష్ణ). అతను రిచ్‌ కాదని, డ్రైవర్‌ అని తెలిసి మరో రిచ్‌ పార్టీ సూర్య(చైతన్యకృష్ణ)కు దగ్గరవుతుంది. అతనితో ఆమెకు పెళ్ళి ఫిక్స్‌ అవుతుంది. ఇది తెలుసుకున్న రామ్‌ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. పెళ్ళిలోనే ఆమెను నాలుగు పీకాలని ఫ్రెండ్‌ ఆది(ప్రవీణ్‌)తో కలిసి బయల్దేరతాడు. దారిలో అతని కారు మరో కారుని ఢీ కొడుతుంది. పెళ్ళికూతురు గెటప్‌లో వున్న ఓ అమ్మాయి కారులో నుంచి దిగి పారిపోతుంది. యాక్సిడెంట్‌ షాక్‌లో వున్న రామ్‌(అతనికి హై బీపీ వుంటుందిలెండి) అన్‌ కాన్షియస్‌ అయిపోతాడు. కట్‌ చేస్తే కిడ్నాపర్‌ శక్తి(సాయికుమార్‌) డెన్‌లో వుంటారు రామ్‌, ఆది. సీత(వామిక) అనే అమ్మాయిని కిడ్నాప్‌ చేసానని, ఆమె తప్పించుకొని పారిపోయిందని, ఆమెను తీసుకొచ్చి ఆదిని తీసుకెళ్ళమని రామ్‌తో చెప్తాడు శక్తి. చేసేది లేక సీత ఫోటో తీసుకొని ఆమెను వెతుక్కుంటూ బయల్దేరతాడు రామ్‌. అసలు సీత ఎవరు? పెళ్ళి పీటల మీద నుంచి శక్తి ఆమెను ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? రామ్‌.. సీత ఆచూకీ కనిపెట్టి ఆమెను శక్తికి అప్పగించగలిగాడా? ఈ ప్రాసెస్‌లో రామ్‌ ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్‌ చేశాడు? చివరికి కథ సుఖాంతమైందా? అనేది తెరమీద చూడాల్సిందే. 

భగ్న ప్రేమికుడిగా, స్నేహితుడి కోసం ఎంత రిస్క్‌ తీసుకోవడానికైనా వెనకాడని వ్యక్తిగా సుధీర్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. డాన్సుల్లో, కొన్ని ఎమోషన్‌ సీన్స్‌లో అతని నటన ఆకట్టుకుంది. పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశమే లేని హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేసింది వామిక. ఈ క్యారెక్టర్‌ కోసం ఎక్కడి నుంచో హీరోయిన్‌ని తీసుకు రావాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్‌ ఎవరు చేసినా ఒకటే. విలన్‌గా సాయికుమార్‌ పెర్‌ఫార్మెన్స్‌లో కొంత కొత్తదనం కనిపించినా అది కొన్ని సీన్ల తర్వాత రొటీన్‌ అయిపోయి ఆడియన్స్‌కి బోర్‌ కొట్టిస్తుంది. ఛోటా కిడ్నాపర్స్‌గా వేణు, శ్రీరామ్‌ చాలాచోట్ల నవ్వించారు. చర్చి ఫాదర్‌గా పోసాని ఒక కొత్త క్యారెక్టర్‌ చేశాడు. ఇది కూడా మొదట్లో బాగుంది అనిపించినా ఆ తర్వాత అదే క్యారెక్టర్‌ రొటీన్‌గా అనిపిస్తుంది. మరో విలన్‌గా చైతన్యకృష్ణ పెర్‌ఫార్మెన్స్‌ డీసెంట్‌గా వుంది. పృథ్వీ చేసిన మల్లెపుష్పం రామారావు క్యారెక్టర్‌ క్లైమాక్స్‌లో అందర్నీ నవ్విస్తుంది. 

సాంకేతికవర్గం గురించి ప్రస్తావించాల్సి వస్తే సినిమాటోగ్రాఫర్‌ శామ్‌దత్‌కి, ఆర్ట్‌ డైరెక్టర్‌కి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సన్నికి ఎక్కువ మార్కులు పడతాయి. ఒక విధంగా చెప్పాలంటే వీరి వల్లే సినిమాకి ఒక కొత్త ఫ్లేవర్‌ వచ్చింది. శామ్‌దత్‌ పెట్టిన ఫ్రేమ్స్‌గానీ, లైటింగ్‌గానీ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అలాగే ఆర్ట్‌ డైరెక్టర్‌ వేసిన సెట్స్‌ కూడా చాలా నేచురల్‌గా వున్నాయి. సన్నీ చేసిన పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమాకి బాగా హెల్ప్‌ అయ్యాడు. ఎం.ఆర్‌.వర్మ ఎడిటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌లో చాలా స్పీడ్‌గా అనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి కొన్ని సీన్స్‌కి ఎక్కువ టైమ్‌ ఇవ్వడంతో చాలా ల్యాగ్‌ వచ్చింది. 

డైరెక్టర్‌ శ్రీరామ్‌ గురించి చెప్పాలంటే గతంలో ఇలాంటి కిడ్నాప్‌ కథలు చాలా వచ్చినా అందులోనే ఏదో కొత్తదనం చూపించాలని ట్రై చేశాడు. దానికి కెమెరా, మ్యూజిక్‌ని ఎక్కువగా వాడుకున్నాడు. కాకపోతే ప్రతి ఐదు నిముషాలకు ఒక స్లో మోషన్‌ సీన్‌ పెట్టి ప్రేక్షకుల్ని విసిగించాడన్నది మాత్రం వాస్తవం. ఆ సీన్స్‌ని నార్మల్‌గా తీసి వుంటే ఓ అరగంట నిడివి తగ్గి వుండేది. అవసరం వున్నా లేకపోయినా స్లో మోషన్‌ని ఎక్కువగా ఎందుకు వాడాడనేది అర్థం కాదు. అలాగే హీరోకి హై బీపీ వుండడం, కొన్ని ఇంపార్టెంట్‌ సీన్స్‌లో బీపీ వచ్చి పడిపోవడం ఆడియన్స్‌కి నీరసాన్ని తీసుకొస్తుంది. సాయికుమార్‌ క్యారెక్టర్‌కి, అతను చెప్పే డైలాగ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే చాలాచోట్ల సాయికుమార్‌ చేసిన ఓవర్‌ యాక్షన్‌ కూడా ఆడియన్స్‌కి చిరాకు తెప్పిస్తుంది. థియేటర్‌ డెన్‌లోకి ఎంటర్‌ అయినప్పటి నుంచి ప్రవీణ్‌ టాయ్‌లెట్‌కి వెళ్ళలేక ఇబ్బంది పడే సీన్‌ని సాగదీయడం కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే సాయికుమార్‌, ఐశర్యల మధ్య జరిగే ఎడల్ట్‌ ట్రాక్‌ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ అంతా కలిసి చూడదగ్గ సినిమాలో ఇలాంటి ట్రాక్‌ సడన్‌గా రావడంతో వాళ్ళంతా ఇబ్బంది పడతారు. కథ విషయానికి వస్తే డీల్‌ కుదుర్చుకొని కిడ్నాప్‌కి సిద్ధపడిన శక్తి.. పారిపోయిన అమ్మాయిని తీసుకు రమ్మని హీరోని పంపడం, శక్తి, అతని అనుచరులు డెన్‌లో మందు కొట్టుకుంటూ కూర్చోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. క్రైమ్‌ కామెడీ అంటే ట్విస్టులు కంపల్సరీ అనుకున్నాడో ఏమో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చి ఆడియన్స్‌ బ్రెయిన్‌కి పని కల్పించాడు డైరెక్టర్‌. 

సినిమా స్టార్టింగ్‌ నుంచే తన టేకింగ్‌తో ఆడియన్స్‌ని కట్టి పడెయ్యాలని చూసిన డైరెక్టర్‌ ఫస్ట్‌హాఫ్‌లో కొంతవరకు అందులో సక్సెస్‌ అయ్యాడు. హీరో, హీరోయిన్‌, విలన్‌ ఇంట్రడక్షన్‌, ఆ తర్వాత ఛేజింగ్‌, హీరోయిన్‌ కోసం సెర్చింగ్‌, ఒక ఇంట్రెస్టింగ్‌ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేసాడు. సెకండాఫ్‌కి వచ్చేసరికి కథని ఒక కొలిక్కి తీసుకురావడానికి కొన్ని అనవసరమైన సీన్స్‌ని జోడించి, ఛోటా కిడ్నాపర్లకు ఒక పాట, హీరో, హీరోయిన్‌లకు ఒక పాటను పెట్టి సినిమాని క్లైమాక్స్‌ వరకు లాక్కొచ్చారు. క్లైమాక్స్‌లో పృథ్వీతో చేయించిన కామెడీ సినిమాకి మంచి కామెడీ ఎండింగ్‌ అయింది. ఈ క్రైమ్‌ కామెడీ ఇంతకుముందు చూసినట్టుగానే అనిపించినా కొంత టేకింగ్‌ వల్ల, కొన్ని కామెడీ సీన్స్‌ వల్ల, కొత్త బ్యాక్‌డ్రాప్‌ వల్ల సినిమా కొత్తగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ని నడిపించడం కోసం కొన్ని అనవసరమైన సీన్స్‌, పాటలు పెట్టడం వల్ల ఫస్ట్‌ హాఫ్‌ కంటే సెకండాఫ్‌ బోర్‌ ఫీలవుతారు ఆడియన్స్‌. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది అన్ని సెంటర్ల ఆడియన్స్‌ని మెప్పించే సినిమా కాదు. ఆడియన్స్‌కి నచ్చే కొన్ని కామెడీ సీన్స్‌ వున్నప్పటికీ రెగ్యులర్‌ సినిమాల్లో వుండే రొమాన్స్‌, లవ్‌ ట్రాక్‌, హీరో, హీరోయిన్లకు పాటలు లేకపోవడంతో బి, సి సెంటర్ల ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చే అవకాశాలు తక్కువ. 

ఫినిషింగ్‌ టచ్‌: అందరికీ మంచిరోజు కాదు 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement