Advertisement

సినీజోష్‌ రివ్యూ: లోఫర్‌

Fri 18th Dec 2015 01:13 PM
telugu movie loafer,loafer movie review,varun tej and puri jagannath movie loafer,loafer movie cinejosh review,loafer movie released today  సినీజోష్‌ రివ్యూ: లోఫర్‌
సినీజోష్‌ రివ్యూ: లోఫర్‌
Advertisement

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌, 

శ్రీ శుభశ్వేత ఫిలింస్‌ 

లోఫర్‌ 

తారాగణం: వరుణ్‌తేజ్‌, దిశా పటాని, రేవతి, పోసాని, 

ముఖేష్‌ రుషి, బ్రహ్మానందం, ఆలీ, హరీష్‌ ఉత్తమన్‌ 

తదితరులు 

సినిమాటోగ్రఫీ: పి.జి.విందా 

సంగీతం: సునీల్‌ కశ్యప్‌ 

ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌ 

నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు 

రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌ 

విడుదల తేదీ: 17.12.2015 

ముకుంద చిత్రంతో పరిచయమై కంచె వంటి ఎక్స్‌పెరిమెంటల్‌ మూవీతో డీసెంట్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు వరుణ్‌తేజ్‌. హీరో ఎవరైనా, కథ ఎలాంటిదైనా తన సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌ని మాత్రం రఫ్‌ అండ్‌ టఫ్‌లా చూపించడానికి ప్రయత్నం చేసే డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. వీరిద్దరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే అది ఎలా వుండబోతోందనే ఆసక్తి అందరిలోనూ వుంటుంది. ఇప్పటివరకు రెండు క్లాస్‌ సినిమాలు చేసిన వరుణ్‌తో లోఫర్‌ అనే మాస్‌ టైటిల్‌ పెట్టి అతన్ని మాస్‌ హీరోగా ఎస్టాబ్లిష్‌ చేసే ప్రయత్నం చేశాడు పూరి. దానికి మదర్‌ సెంటిమెంట్‌ని కూడా జోడించి లోఫర్‌ అనే మాస్‌ టైటిల్‌కి క్లాస్‌ టచ్‌ని కూడా ఇవ్వాలనుకున్నాడు. ఇడియట్‌, పోకిరి వంటి టైటిల్స్‌తో సూపర్‌హిట్స్‌ అందుకున్న పూరికి లోఫర్‌ ఎలాంటి ఫలితాన్నిచ్చింది? ఫస్ట్‌ టైమ్‌ వరుణ్‌ చేసిన మాస్‌ క్యారెక్టర్‌ ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్‌ అయింది? వీళ్ళిద్దరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన లోఫర్‌ని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

సాధారణంగా లోఫర్‌ అనిపించుకున్న వ్యక్తికి జాలి, దయ, పాపం, పుణ్యం అనేవి వుండవు. తన స్వార్థం కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడతాడు, ఎవ్వరినైనా బాధపెడతాడు. అలాంటి క్యారెక్టరైజేషన్‌ మన హీరో రాజా(వరుణ్‌తేజ్‌) తండ్రి మురళి(పోసాని)ది. ఆస్తికోసం లక్ష్మీ(రేవతి)ని పెళ్ళి చేసుకొని ఆ తర్వాత ఆస్తి తనకు దక్కదని తెలుసుకున్న తర్వాత ఆమెను వదిలేసి కొడుకుని తీసుకొని జోధ్‌పూర్‌ పారిపోతాడు. కొడుకు కూడా తన అడుగు జాడల్లో నడిచేలా తర్ఫీదు ఇస్తాడు. తన తల్లి ఎవరని పదే పదే అడుగుతున్న కొడుకు గొడవ పడలేక ఆమె చనిపోయిందని చెప్తాడు మురళి. అలా తల్లి లేని బిడ్డగా పెరిగిన రాజాకి అమ్మ ఎవరికైనా అమ్మే అనే సెంటిమెంట్‌ వుంటుంది. ఇదిలా వుండగా తనకి ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారనే కారణంతో జోధ్‌పూర్‌ పారిపోయి వస్తుంది ఓ పెద్దింటి అమ్మాయి పారిజాతం అలియాస్‌ మౌని(దిశా పటాని). అన్ని సినిమాల్లోలాగే మౌనిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు రాజా. కొంత కాలం తర్వాత మౌని కూడా రాజాని ప్రేమించడం మొదలుపెడుతుంది. ఆ టైమ్‌లో అతను మురళి అనే లోఫర్‌ కొడుకని, రాజా కూడా మోసగాడేనని తెలుసుకుంటుంది. తను అలాంటివాడిని కాదని, నిజంగానే తనని ప్రేమిస్తున్నానని మౌనికి చెప్పే ప్రయత్నం చేస్తాడు రాజా. ఈలోగా తన తండ్రి పంపించిన మనుషులు వారిని ఎటాక్‌ చేస్తారు. రాజా విషయం తెలుసుకున్న మౌని అత్తయ్య లక్ష్మీ జోధ్‌పూర్‌ వచ్చి వారి నుంచి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుంది. మౌనిని రక్షించే ప్రయత్నంలో రాజాని తలపై కొడుతుంది లక్ష్మీ. అప్పటివరకు చనిపోయిందనుకుంటున్న తన తల్లిని చూసి రాజా ఎలా రియాక్ట్‌ అయ్యాడు? మౌనిని రక్షించడానికి లక్ష్మీ ఎందుకు వచ్చింది? మౌనికి, లక్ష్మీకి వున్న సంబంధం ఏమిటి? తనే లక్ష్మీ కొడుకునని రాజా ఆమెతో చెప్పగలిగాడా? తల్లి కోసం, తన ప్రియరాలి కోసం రాజా ఏం చేశాడు? అనేది మిగతా కథ. 

వరుణ్‌ చేసిన రెండు సినిమాల్లో అతని క్యారెక్టర్‌ చాలా సైలెంట్‌గా వుంటూ అప్పుడప్పుడూ వయెలెంట్‌గా బిహేవ్‌ చేస్తుంటుంది. కానీ, ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమాలో ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ మాస్‌ క్యారెక్టర్‌ చేసిన వరుణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఓకే అనిపించుకున్నాడు. హీరోయిన్‌ దిశా పటాని గ్లామర్‌ పరంగా బాగుంది. కానీ, ఆమె క్యారెక్టర్‌కి అంతగా ఇంపార్టెన్స్‌ లేకపోవడం, మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వడానికి ఎక్కువగా స్కోప్‌ లేకపోవడంతో ఆమె పాటలకే పరిమితం అయింది. తల్లిగా నటించిన రేవతి పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఓకే అనిపించుకున్నా ఆమె క్యారెక్టర్‌ ఆడియన్స్‌ని టచ్‌ చెయ్యలేకపోయిందని చెప్పాలి. వరుణ్‌, రేవతిల మధ్య వచ్చే సెంటిమెంటల్‌ సీన్స్‌ అంత హార్ట్‌ టచ్చింగ్‌గా అనిపించలేదు. లోఫర్‌ తండ్రిగా పోసాని పెర్‌ఫార్మెన్స్‌ ఎప్పటిలాగే వుంది. అయితే అక్కడక్కడా తన డైలాగ్స్‌తో ఆడియన్స్‌ని నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా క్యారెక్టర్లలో ముఖేష్‌ రుషి, ఆలీ, సప్తగిరి, ధన్‌రాజ్‌, బ్రహ్మానందం ఓకే అనిపించారు. 

సాయిరామ్‌ శంకర్‌ హీరోగా వచ్చిన రోమియో చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్‌లో సినిమాటోగ్రాఫర్‌ పి.జి.విందా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సునీల్‌ కశ్యప్‌ పూరి జగన్నాథ్‌ సినిమాకి ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేశారు. విందా ఫోటోగ్రఫీ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. అలాగే పాటల పిక్చరైజేషన్‌ కూడా ఫర్వాలేదు అనిపించాడు విందా. సునీల్‌ కశ్యప్‌ చేసిన పాటలు ఆడియో పరంగా అంతగా ఆకట్టుకోలేదు. అమ్మ పాట ఒక్కటే కాస్త వినదగ్గదిగా వుంది తప్ప మిగతా పాటలన్నీ చాలా రొటీన్‌గా వున్నాయి. అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాస్త ఫర్వాలేదు అనిపించింది. ఇక పూరి గురించి చెప్పాల్సొస్తే ఇప్పటివరకు అతను చేసిన సినిమాల్లో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాన్ని పోలిన కథతో ఈ సినిమా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సినిమాలో సెంటిమెంట్‌గానీ, కామెడీగానీ, యాక్షన్‌గానీ, తల్లీ కొడుకుల మధ్య ప్రేమ.. ఇవన్నీ బాగా వర్కవుట్‌ అయ్యాయి. కానీ, ఈ సినిమాలో అది పూర్తిగా లోపించింది. ప్రతి సీన్‌ చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుందే తప్ప ఎక్కడా నేచురల్‌గా వుండదు. కథలో ఎన్నో లొసుగులు వుండడం, కథనంలో ఎన్నో లోపాలు వుండడం సినిమాకి చాలా మైనస్‌ అయింది. పైగా హీరో క్యారెక్టరైజేషన్‌ కూడా ఒకదానికి స్టిక్‌ అయి వున్నట్టు కాకుండా సీన్‌ డిమాండ్‌ మేరకు మారుతూ వెళ్తుంది. చాలా చోట్ల సినిమాలో లాజిక్స్‌ మిస్‌ అయ్యాయి. ఈ సినిమా తల్లీకొడుకుల సెంటిమెంట్‌కి సంబంధించింది అని చెప్తూ వస్తున్నారు. అయితే ఇదే సినిమాలో ఒక తల్లిని కన్నకొడుకు నరికి చంపినట్టుగా చూపించారు. ఇక అప్పుడు తల్లి, కొడుకుల ప్రేమ గురించి ఎంత చెప్పినా జనానికి ఏం ఎక్కుతుంది. 

హీరో చిన్నప్పటి కథతో స్టార్ట్‌ అయిన ఈ సినిమాలో ఫస్ట్‌ హాఫ్‌ అంతా చాలా మామూలుగా వుంటుంది. అప్పుడప్పుడు కొన్ని కామెడీ సీన్స్‌ కాస్త నవ్వించే ప్రయత్నం చేస్తాయి. పేరుకి సప్తగిరి, ధన్‌రాజ్‌ వంటి కమెడియన్స్‌ వున్నా ఫస్ట్‌ హాఫ్‌లో వారివల్ల ఎలాంటి కామెడీ పుట్టలేదు. హీరో తల్లి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక ట్విస్ట్‌తో ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అవుతుంది. కథ అనేది ఫస్ట్‌ హాఫ్‌లోనే అందరికీ అర్థమైపోతుంది. సెకండాఫ్‌లో సినిమాని నడిపించడం కోసం సాగదీసే కార్యక్రమాన్ని చేపట్టాడు పూరి. అనవసరమైన సీన్స్‌, నిడివి పెంచే పాటలు, ఫైట్స్‌తో ప్రీ క్లైమాక్స్‌ వరకు తీసుకొచ్చి చాలా నాసిరకం క్లైమాక్స్‌తో సినిమాని ముగించేశాడు పూరి. సాధారణంగా పూరి సినిమాల్లో వుండే ఎక్స్‌ట్రార్డినరీ కామెడీ ఈ సినిమాలో లేదు. ఫస్ట్‌హాఫ్‌లో కాస్త నవ్వించినా సెకండాఫ్‌లో అది కూడా లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే వరుణ్‌ కూడా మాస్‌ క్యారెక్టర్‌ చెయ్యగలడు అని ఈ సినిమాతో ప్రూవ్‌ అయింది. ఇడియట్‌, పోకిరి వంటి టైటిల్స్‌తో సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్స్‌ సాధించిన పూరికి లోఫర్‌ అనే టైటిల్‌ సెంటిమెంటల్‌గా వర్కవుట్‌ అవ్వలేదు. రిలీజ్‌కి ముందు చెప్పినట్టు ఇది అద్భుతమైన తల్లీకొడుకుల సెంటిమెంట్‌ సినిమా కానే కాదు. రెగ్యులర్‌గా పూరి సినిమాలు చూసే వారికి, హార్ట్‌ టచ్చింగ్‌గా వుండే సెంటిమెంట్‌ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చదు. 

ఫినిషింగ్‌ టచ్‌: వర్కవుట్‌ కాని లోఫర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement