Advertisement

సినీజోష్‌ రివ్యూ: బ్రూస్‌లీ.. ది ఫైటర్‌

Fri 16th Oct 2015 02:46 PM
telugu movie bruce lee,ramcharan latest movie bruce lee,telugu movie bruce lee review,bruce lee cinejosh review,ramcharan and srinu vaitla combo movie  సినీజోష్‌ రివ్యూ: బ్రూస్‌లీ.. ది ఫైటర్‌
సినీజోష్‌ రివ్యూ: బ్రూస్‌లీ.. ది ఫైటర్‌
Advertisement

డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

బ్రూస్‌లీ.. ది ఫైటర్‌ 

తారాగణం: రామ్‌చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కృతి కర్బందా, 

రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, సంపత్‌రాజ్‌, నదియా, 

అరుణ్‌ విజయ్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, 

పోసాని మరియు ప్రత్యేక పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి 

సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస 

సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌ 

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ 

కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, 

మాటలు: కోన వెంకట్‌ 

సమర్పణ: డి.పార్వతి 

నిర్మాత: డి.వి.వి.దానయ్య 

మూలకథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల 

విడుదల తేదీ: 16.10.2015 

రామ్‌చరణ్‌ మాస్‌ యాక్షన్‌ హీరో, శ్రీను వైట్ల యాక్షన్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌తో మిక్స్‌ చేసి ఆ ఫార్ములాతో ఎన్నో సూపర్‌హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు. వీరిద్దరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించిన ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బ్రూస్‌లీ.. ది ఫైటర్‌. శ్రీను వైట్ల రొటీన్‌ ఫార్మాట్‌కి భిన్నంగా సిస్టర్‌ సెంటిమెంట్‌ని కూడా ఈ చిత్రంలో యాడ్‌ చేశాడు. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 6 సంవత్సరాల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేయడం. బ్రూస్‌లీ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో రామ్‌చరణ్‌ సినిమా చెయ్యడం, అందులో చిరంజీవి కూడా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగా పెరిగాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ నడుమ బ్రూస్‌లీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బ్రూస్‌లీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎంత వరకు రీచ్‌ అయ్యాడు? చరణ్‌, శ్రీను వైట్ల ఫస్ట్‌ కాంబినేషన్‌ సక్సెస్‌ను అందుకుందా? మెగాస్టార్‌ చిరంజీవి చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌ సినిమాకి ఎంతవరకు హెల్ప్‌ అయింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: రామచంద్రరావు(రావు రమేష్‌) ఒక మధ్యతరగతి ఉద్యోగి. అతనికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కొడుకుని కలెక్టర్‌గా చూడాలన్నది అతని కోరిక. ఇద్దరికీ కాస్ట్‌లీ చదువులు చెప్పించలేని ఆ తండ్రి కొడుకుని మాత్రమే ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదివించాలనుకుంటాడు. తను కూడా అదే స్కూల్‌లో చదువుతానని అడుగుతుంది కూతురు. అక్కకి చదువు మీద వున్న ఇంట్రెస్ట్‌ చూసి తనకు తక్కువ మార్కులు వచ్చేలా చేసుకుంటాడు తమ్ముడు. దీంతో అక్కని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చేర్పిస్తారు. చదువంటే ఇంట్రెస్ట్‌ చూపించని కొడుకుని ప్రతిరోజూ తిడుతుంటాడు ఆ తండ్రి. అలా ఇద్దరూ పెరిగి పెద్దవుతారు. ఆ కూతురి పేరు కావ్య(కృతి కర్బందా), ఆ కొడుకు పేరు కార్తీక్‌(రామ్‌చరణ్‌) అలియాస్‌ బ్రూస్‌లీ. కావ్య ఐఎఎస్‌కి ప్రిపేర్‌ అవుతూ వుంటుంది. కార్తీక్‌ సినిమాల్లో స్టంట్‌మేన్‌గా చేరి హీరోలకు డూప్‌గా పనిచేస్తుంటాడు. తను సంపాదించిన దానితో అక్కకు కావాల్సినవి కొనిపెడుతుంటాడు. కట్‌ చేస్తే ఓరోజు పోలీస్‌ డ్రెస్‌లో షూటింగ్‌కి వెళ్తూ దారిలో ఓ అన్యాయాన్ని అడ్డుకునేందుకు రౌడీలతో ఫైట్‌ చేస్తాడు బ్రూస్‌లీ. పోలీస్‌ అంటే వల్లమాలిన అభిమానం వున్న రియా(రకుల్‌ ప్రీత్‌) బ్రూస్‌లీని మొదటి చూపులోనే ప్రేమిస్తుంది. అతను పోలీస్‌ ఆఫీసర్‌ అనుకుంటుంది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అతనికి ఫోన్‌ చేసి పిలుస్తుంటుంది. అలా బ్రూస్‌లీకి తెలియకుండానే దీపక్‌రాజ్‌(అరుణ్‌ విజయ్‌) అనే రౌడీకి సంబంధించిన దందాలన్నీ నాశనం చేస్తాడు. దీంతో బ్రూస్‌లీని పట్టుకోవాలని దీపక్‌రాజ్‌ ప్రయత్నిస్తుంటాడు. మరో పక్క రామచంద్రరావు పనిచేసే వసుంధర ల్యాబ్స్‌ అధినేత జయరాజ్‌(సంపత్‌రాజ్‌) కావ్యను కోడలుగా చేసుకోవాలనుకుంటాడు. ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగిపోతుంది. ఇదిలా వుండగా జయరాజ్‌ జీవితానికి సంబంధించిన ఒక సీక్రెట్‌ బ్రూస్‌లీకి తెలుస్తుంది. అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న బ్రూస్‌లీ కుటుంబానికి ఆపద వచ్చిపడుతుంది. అసలు బ్రూస్‌లీకి తెలిసిన జయరాజ్‌ సీక్రెట్‌ ఏమిటి? దానివల్ల అతని కుటుంబానికి జయరాజ్‌ ఎలాంటి హాని తలపెట్టాడు? జయరాజ్‌లో పైకి కనిపించే మంచితనం అనే కోణం కాకుండా మరో కోణం వుందా? బ్రూస్‌లీకి ఎదురైన ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాడు? తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: అక్కని కలెక్టర్‌గా చూడాలన్న నాన్న కోరికను మన్నించే కొడుకుగా, హీరోలకు డూప్‌గా పనిచేసే స్టంట్‌మేన్‌ బ్రూస్‌లీగా రెండు వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్‌ను అందర్నీ ఆట్టుకునేలా చేయడానికి తనవంతు ప్రయత్నం చేశాడు రామ్‌చరణ్‌. అక్కను, తల్లిదండ్రులను అమితంగా ప్రేమించే కొడుకుగా చరణ్‌ నటన ఫర్వాలేదు అనిపిస్తుంది. డాన్స్‌ విషయానికి వస్తే ఈ సినిమాలో అతని కోసం ప్రత్యేకంగా ఎలాంటి స్టెప్స్‌ కంపోజ్‌ చేసినట్టు కనిపించదు. ఇంతకుముందు సినిమాల్లో మనం చూసిన స్టెప్స్‌నే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే ఫైట్స్‌ కూడా కొత్తగా అనిపించవు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌లో తప్ప కేవలం పాటలకే పరిమితమైపోయినట్టు కనిపిస్తుంది. తన గత చిత్రాల్లో కంటే ఇందులో అందాలు కాస్త ఎక్కువగానే ఒలకబోసిందని చెప్పాలి. తండ్రిగా రావు రమేష్‌ చేసిన క్యారెక్టర్‌లో కూడా కొత్తదనం ఏమీలేదు. అతను ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్స్‌ చాలా చేసేశాడు. డైలాగ్‌ మాడ్యులేషన్‌ కూడా పాతదే కావడంతో దాని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు. సంపత్‌రాజ్‌ తన గత సినిమాల కంటే ఇందులో కాస్త డిగ్నిఫైడ్‌గా వుండే క్యారెక్టర్‌ చేశాడు. క్యారెక్టరైజేషన్‌ పాతదే అయినా లుక్‌ పరంగా కొత్తగా చూపించారు. సంపత్‌కి భార్యగా నదియా ఎలాంటి ప్రాముఖ్యత లేని క్యారెక్టర్‌ చేసింది. రామ్‌చరణ్‌కి అక్కగా కృతి కర్బందా ఆ క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయిందని చెప్పొచ్చు. సెకండాఫ్‌లో ఎంటర్‌ అయ్యే బ్రహ్మానందంతో కామెడీ చేయిద్దామని శ్రీను వైట్ల చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది. ఇందులో లెక్కకు మించిన కమెడియన్స్‌ని దింపాడు శ్రీను వైట్ల. ఆలీ, సత్యం రాజేష్‌, సత్య, సప్తగిరి, షకలక శంకర్‌, పృథ్వి, జె.పి., పోసాని.. ఇలా చాలా మంది కమెడియన్స్‌ వున్నా వారితో మంచి కామెడీ చేయించలేకపోయారు. 

టెక్నీషియన్స్‌: సాంకేతికవర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌, ఎడిటింగ్‌, కథ, కథనం, డైరెక్షన్‌.. ఇవన్నీ వీక్‌ అనే చెప్పాలి. మనోజ్‌ పరమహంసకి సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు వున్నప్పటికీ అతని స్థాయిలో ఫోటోగ్రఫీని అందించలేకపోయాడనిపిస్తుంది. సినిమాని హడావిడిగా తీసినట్టు అనిపించడమే కాకుండా అక్కడక్కడ లైటింగ్‌ విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించదు. కాకపోతే పాటలు మాత్రం అన్నీ బాగానే తీశారు. థమన్‌ ఈ చిత్రానికి చేసిన మ్యూజిక్‌ చాలా రొటీన్‌గా వుంది. విజువల్‌గా మూడు పాటలు బాగున్నాయనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఎం.ఆర్‌.వర్మ ఎడిటింగ్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. ఇక శ్రీను వైట్ల అందించిన మూల కథని డెవలప్‌ చేసిన కోన వెంకట్‌, గోపీమోహన్‌ తమ పాత సినిమాలకు చేసిన కథలాగే చేశారు తప్ప ఏమాత్రం డెవలప్‌ అవ్వలేదు. ఎవరి క్యారెక్టరైజేషనూ పర్‌ఫెక్ట్‌గా వున్నట్టు కనిపించదు. అసలు కార్తీక్‌ అనే కుర్రాడు బ్రూస్‌లీ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు? బ్రూస్‌లీ వల్ల అతను ఇన్‌స్పైర్‌ అయిన సందర్భాలు ఏమిటి? టాటూ వేయించుకునేంతగా అతన్ని ఇంప్రెస్‌ చేసిన అంశాలేమిటి? అనేది సినిమాలో ఎక్కడా చూపించలేదు. అక్క చదువు కోసం తన చదువును త్యాగం చేసిన విషయం తనికెళ్ళ భరణికి బ్రూస్‌లీ చిన్నతనంలోనే తెలుసు. కానీ, పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఏ సందర్భంలోనూ బ్రూస్‌లీ తండ్రికి నిజాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యడు. బ్రూస్‌లీ తన అక్క కోసం చేసిన త్యాగాన్ని తనికెళ్ళ భరణితో కాకుండా విలన్‌ సంపత్‌రాజ్‌తో చెప్పించడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఫ్యామిలీ కోసం పోరాడే ఒక బాధ్యత గల కొడుకు కథ ఇది అని రిలీజ్‌ ముందు నుంచీ చెప్తూ వస్తున్నారు. అయితే ఫస్ట్‌ హాఫ్‌ అంతా బ్రూస్‌లీని పోలీస్‌గా అనుకున్న హీరోయిన్‌ కోసమే విలన్‌కి సంబంధించిన దందాలన్నీ ధ్వంసం చేస్తాడు తప్ప కుటుంబం కోసం కాదు. సెకండాఫ్‌లోనే తన కుటుంబం కోసం పోరాడతాడు. ఇక నిర్మాత డి.వి.వి.దానయ్య సినిమాకి పెట్టిన ఖర్చు స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. అయితే అది కథ, కథనాలకు అంతగా ఉపయోగపడేలా లేదు. 

విశ్లేషణ: ఫస్ట్‌ హాఫ్‌ అంతా ఒక పాట, ఒక ఫైట్‌ అన్నట్టుగా సినిమా నడుస్తుందే తప్ప ఎక్కడా కథ అనేది కనిపించదు. అయితే అక్క, తమ్ముడుకి సంబంధించిన కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌ మాత్రం హార్ట్‌ టచ్చింగ్‌గా అనిపిస్తాయి. తన ప్రతి సినిమాలోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా వుండేలా జాగ్రత్త పడే శ్రీను వైట్ల బ్రూస్‌లీలో మాత్రం దాన్ని మిస్‌ చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌లో కథ ఎక్కడికి వెళ్తుందో తెలియని అయోమయ స్థితిలో కొన్ని అనవసరమైన సీన్స్‌తో ఆడియన్స్‌కి బోర్‌ కొట్టించాడు. వున్న కథతో, పెట్టుకున్న కమెడియన్స్‌తోనే కామెడీ చేయించాలని విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ట్విస్ట్‌తో ఫస్ట్‌హాఫ్‌ ఎండ్‌ చేయాల్సింది పోయి దాన్ని ముందే రివీల్‌ చేసేశాడు. దాంతో సెకండాఫ్‌ అంటే ఇంట్రెస్ట్‌ లేకుండా పోయింది. శ్రీను వైట్ల గత చిత్రాల్లోలాగే ఇందులో కూడవ సెకండాఫ్‌లో విలన్‌ని బకరా చేసే సన్నివేశాలు ఇబ్బడి ముబ్బడిగా వున్నాయి. హీరో తను వేసిన ప్లాన్‌ ప్రకారమే ప్రతీదీ జరుగుతుంటుంది. ఎన్నో సినిమాల్లో మనం చూసిన సీన్లే రిపీట్‌ అవుతూ సినిమా క్లైమాక్స్‌కి చేరుతుంది. బ్రూస్‌లీ తండ్రిని చంపే ప్రయత్నం చేయడమే కాకుండా హీరోయిన్‌ని కిడ్నాప్‌ చేస్తాడు విలన్‌. తండ్రిని రక్షించుకునే ప్రయత్నంలో హీరోయిన్‌ని దగ్గరికి వెళ్ళలేకపోతాడు. అప్పుడు తన బాస్‌ మెగాస్టార్‌ సహాయం కోరతాడు బ్రూస్‌లీ. రంగంలోకి దిగిన చిరంజీవి రౌడీల బారి నుంచి హీరోయిన్‌ కాపాడి హీరోకి అప్పగిస్తాడు. చిరంజీవి 150వ సినిమాకి బ్రూస్‌లీ చిత్రంలో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఒక టీజర్‌లాంటిదని మొదటి నుంచీ చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్‌ ఎంట్రీ అంత అద్భుతం అని చెప్పడానికి వీల్లేదు. చాలా సాదా సీదాగా స్లో మోషన్‌లో చిరంజీవి చేసే ఫైట్స్‌ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే బ్రూస్‌లీ అనే టైటిల్‌ని కేవలం అతను స్టంట్‌మేన్‌ కావడం వల్లే పెట్టారు తప్ప హీరో బ్రూస్‌లీకి వీరాభిమాని కాదు అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. చాలా రొటీన్‌ కథ, కథనాలతో, ఆకట్టుకోని కామెడీతో ప్రేక్షకుల్ని బ్రూస్‌లీ నిరాశపరిచిందనే చెప్పాలి. అయితే దసరా పండగ సీజన్‌ కావడం, రామ్‌చరణ్‌, శ్రీను వైట్ల ఫస్ట్‌ కాంబినేషన్‌ మూవీ అవడం, మెగాస్టార్‌ చిరంజీవి క్లైమాక్స్‌లో కనిపించడం వంటి అంశాలు బ్రూస్‌లీకి కలెక్షన్లు రాబట్టే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: బ్రూస్‌లీ.. ది ఫైటరా? ఎలగెలగెలగా? 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement