Advertisement

సినీజోష్‌ రివ్యూ: చంద్రిక

Sat 26th Sep 2015 01:55 AM
telugu movie chandrika,chandrika cinejosh review,chandrika movie review,kamna jetmalani in chandrika,srimukhi in chandrika  సినీజోష్‌ రివ్యూ: చంద్రిక
సినీజోష్‌ రివ్యూ: చంద్రిక
Advertisement

ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ 

చంద్రిక 

తారాగణం: జయరామ్‌ కార్తీక్‌, కామ్న జెఠ్మలాని, శ్రీముఖి, గిరీష్‌ కర్నాడ్‌, 

సత్యం రాజేష్‌, ఎల్‌.బి.శ్రీరామ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: కె.రాజేంద్రబాబు 

ఎడిటింగ్: వి.సురేష్ కుమార్

సంగీతం: గున్వంత్‌ సేన్‌

కథ, స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి 

నిర్మాత: వి.ఆశ 

దర్శకత్వం: యోగేష్‌ 

విడుదల తేదీ: 25.09.2015 

చంద్రముఖి, చంద్రకళ, మయూరి వంటి హార్రర్‌ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క ప్రేమకథా చిత్రమ్‌, గీతాంజలి వంటి హార్రర్‌ కామెడీ చిత్రాలు కూడా విజయం సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది దర్శకనిర్మాతలు ఈ తరహా సినిమాలను రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ప్రేక్షకుల్ని భయపెట్టడానికి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది చంద్రిక. జయరామ్‌ కార్తీక్‌, కామ్న జెఠ్మలాని, శ్రీముఖి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించారు. మరి ఈ సినిమా ఎలాంటి కథాంశంతో రూపొందింది? ఎంతవరకు ప్రేక్షకుల్ని భయపెట్టింది తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: అదొక అందమైన పురానా హవేలీ. దాన్ని ఇష్టపడి కొనుక్కోవాలనుకునే వారిని అందులో వున్న ఆత్మ పట్టి పీడిస్తుంటుంది. దాంతో ఆ హవేలీని కొనడానికి ఎవరూ ముందుకు రారు. చిత్రకారుడుగా పేరు ప్రఖ్యాతులు వున్న అర్జున్‌(జయరామ్‌ కార్తీక్‌) ఆ హవేలీని కొంటాడు. తన భార్య శిల్ప(శ్రీముఖి)తో కలిసి అందులో కాపురం పెడతాడు. అక్కడికి వచ్చినప్పటి నుంచి శిల్ప ప్రవర్తనలో మార్పు రావడం గమనిస్తాడు అర్జున్‌. చంద్రిక ఆత్మ శిల్పను అప్పుడప్పుడు ఆవహించడం, దాంతో విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో ఆ సమస్య నుంచి బయట పడడానికి ఒక స్వామీజీని తీసుకొస్తాడు అర్జున్‌. శిల్పను ఆవహించిన చంద్రిక తనెవరో గుర్తురాలేదా అని అర్జున్‌ని ప్రశ్నిస్తుంది. దానికి అర్జున్‌ సమాధానం చెప్పడు. ఆ తర్వాత స్వామీజీ అర్జున్‌ని అదే ప్రశ్న వేస్తాడు. అసలు ఏం జరిగిందో చెప్పమంటాడు. అప్పుడు స్వామీజీతో అర్జున్‌ ఏం చెప్పాడు? చంద్రికకు, అర్జున్‌కి వున్న సంబంధం ఏమిటి? చంద్రిక ఆత్మ శిల్పను ఎందుకు వేధిస్తోంది? చంద్రికకు అర్జున్‌ చేసిన అన్యాయం ఏమిటి? చంద్రిక ఆత్మను శాంతింపజేయడంలో అర్జున్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: అర్జున్‌గా నటించిన జయరామ్‌ కార్తీక్‌ ఫర్వాలేదు అనిపించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో, రొమాంటిక్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సీన్స్‌లో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. అతని నుంచి మంచి ఔట్‌పుట్‌ తీసుకోవడంలో డైరెక్టర్‌ చేసిన తప్పిదం అది. కామ్న జెఠ్మలాని చంద్రికగా టైటిల్‌ పాత్ర పోషించినప్పటికీ పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ లేని క్యారెక్టర్‌ కావడంతో రొటీన్‌గానే అనిపిస్తుంది. శిల్పగా, చంద్రికగా రెండు వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్‌ చేసిన శ్రీముఖి యాక్షన్‌ కాస్త ఓవర్‌గానే అనిపిస్తుంది. చాలా సీన్స్‌లో చంద్రముఖిలోని జ్యోతికను అనుకరించింది. ఓవరాల్‌గా శ్రీముఖి పెర్‌ఫార్మెన్సే ఈ సినిమాకి ప్రధానంగా చెప్పుకోవాలి. ఫస్ట్‌ హాఫ్‌లో కనిపించి కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు సత్యం రాజేష్‌. అయితే అది వర్కవుట్‌ అవ్వలేదు. హీరో గురువుగా నటించిన గిరీష్‌ కర్నాడ్‌ చాలా సెటిల్డ్‌గా తన క్యారెక్టర్‌ని చేశాడు. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి కాస్తో, కూస్తో హెల్ప్‌ అయినవారు సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌. సంగీత దర్శకుడు గన్వంత్‌ సేన్‌ రికార్డింగ్‌ పరంగా, ఆర్కెస్ట్రయిజేషన్‌ పరంగా పాటల్ని రిచ్‌గా చేశాడు. పాటల పిక్చరైజేషన్‌ ఫర్వాలేదన్నట్టుగా వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే అనిపించాడు గున్వంత్‌. రాజేంద్రబాబు ఫోటోగ్రఫీ ఒక హార్రర్‌ సినిమాకి ఎలా వుండాలో అలాగే వుండేలా జాగ్రత్త పడ్డాడు. హవేలీలో తీసిన సీన్స్‌కి లైటింగ్‌ విషయంలో కేర్‌ తీసుకున్నాడు. సినిమా స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఫోటోగ్రఫీ పరంగా సినిమా రిచ్‌గానే కనిపించింది. కథ, స్క్రీన్‌ప్లే విషయానికి వస్తే సాజిద్‌ ఖరేషి రాసిన ఈ కథ రెండు సినిమాల కలయికలో కనిపిస్తుంది. సినిమా చూస్తున్న ఆడియన్స్‌కి చంద్రముఖి, చంద్రకళ ఒకేసారి చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఒక హవేలీని తీసుకొని అందులో కాపురం వుండడం చంద్రముఖి కాన్సెప్ట్‌ అయితే, తనను మోసం చేసిన హీరోపై పగ సాధించాలని అతని భార్యను ఆవహించడం అనేది చంద్రకళ కాన్సెప్ట్‌. ఇక కథనం విషయానికి వస్తే సినిమా స్టార్ట్‌ అవ్వడమే చాలా నీరసంగా స్టార్ట్‌ అవుతుంది. ప్రతి సీన్‌కీ చాలా ఎక్కువ టైమ్‌ తీసుకోవడం వల్ల చాలా ల్యాగ్‌ కనిపిస్తుంది. కథనంలో భాగంగానే జొప్పించిన కొన్ని అనవసరమైన సీన్స్‌, కవితలు ఆడియన్స్‌కి విసుగును పుట్టిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో చంద్రిక ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్‌ మధ్య సీన్స్‌ మరింత సాగదీసినట్టు అనిపించడమే కాకుండా సినిమా ఎప్పుడు క్లైమాక్స్‌కి వస్తుందా అని ఎదురుచూసేలా చేస్తాయి. ఆర్టిస్టుల నుంచి సరైన పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో డైరెక్టర్‌ యోగేష్‌ సక్సెస్‌ కాలేకపోయాడు. గిరీష్‌ కర్నాడ్‌ నుంచి మాత్రమే సెటిల్డ్‌ పెర్‌పార్మెన్స్‌ రాబట్టుకోగలిగాడు. ఆద్యంతం సినిమాని నడిపించిన శ్రీముఖితో కూడా బాగానే చేయించాడు. అయితే ఒక్కో సీన్‌లో ఓవర్‌గాను, ఒక్కో సీన్‌లో అయోమయంగానూ చేయించాడు. 

విశ్లేషణ: మంచి సౌండ్‌ ఎఫెక్ట్స్‌, రిచ్‌ ఫొటోగ్రఫీ, అనవసరంగా భయపెట్టే సహ నటులు, అరుపులు, కేకలు, సస్పెన్స్‌ రివీల్‌ చెయ్యడానికి ఇష్టపడని ప్రధాన పాత్రలు.. వీటితోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హార్రర్‌ మూవీ రెడీ అవ్వదని దర్శకనిర్మాతలు గ్రహించాలి. కంటెంట్‌లో కొత్తదనం, పరిగెత్తించే కథనం, ఆకట్టుకునే సన్నివేశాలు, ఆలోచింపజేసే డైలాగ్స్‌, నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందోననే క్యూరియాసిటీ, డైరెక్టర్‌ చెప్పదలుచుకున్న దానిలో క్లారిటీ.. ఇవన్నీ వుంటేనే ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీల్‌ అవుతారు. అయితే ఇవేవీ చంద్రిక సినిమాలో కనిపించవు. చంద్రముఖి, చంద్రకళ కథలను కలిపి ఒక కథ చేసి, క్లైమాక్స్‌ను చంద్రముఖి తరహాలోనే ప్లాన్‌ చేసిన సినిమా ఇది. ఆకట్టుకోని మాటలు, సాగదీసే సన్నివేశాలు, విసిగించే కవితలు.. ఇలా సినిమాలో చాలా డ్రాబ్యాక్స్‌ వుండడం వల్ల ఈ సినిమా ఏ దశలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు. ఫైనల్‌గా చెప్పాలంటే చంద్రిక ప్రేక్షకుల్ని భయపెట్టలేకపోయింది. 

ఫినిషింగ్‌ టచ్‌: భయపెట్టలేకపోయిన చంద్రిక   

సినీజోష్‌ రేటింగ్‌: 1.5/5 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement