Advertisement

సినీజోష్‌ రివ్యూ: టిప్పు

Sat 20th Jun 2015 05:08 AM
tippu movie,tippu movie review,cinejosh review tippu,tippu telugu movie,satya karthik,kanika kapoor  సినీజోష్‌ రివ్యూ: టిప్పు
సినీజోష్‌ రివ్యూ: టిప్పు
Advertisement

ఆదిత్య ఫిలింస్‌ 

టిప్పు

నటీనటులు: సత్యకార్తీక్‌, కనికా కపూర్‌, ఫమేలా, పోసాని, 

నాగబాబు, శ్రావణ్‌, ముక్తాఖాన్‌, ఎం.ఎస్‌.నారాయణ,

కృష్ణభగవాన్‌, చలపతిరావు తదితరులు

సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్‌

సంగీతం: మణిశర్మ

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

నిర్మాత: డి.వి.సీతారామరాజు

రచన, దర్శకత్వం: జగదీష్‌ దానేటి

విడుదల తేదీ: 19.06.2015

తెలుగు చిత్ర సీమకు ఎంతో మంది కొత్త హీరోలు పరిచయమై తమ టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ‘టిప్పు’ చిత్రంతో వచ్చిన మరో కొత్త హీరో సత్యకార్తీక్‌. డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో వైజాగ్‌ రాజుగా పేరు తెచ్చుకున్న డి.వి.సీతారామరాజు తనయుడు సత్యకార్తీక్‌ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆదిత్య ఫిలింస్‌ పతాకంపై జగదీష్‌ దానేటి దర్శకత్వంలో రూపొందిన ‘టిప్పు’ ఈరోజు విడుదలైంది. మరి ఈ కొత్త హీరోను ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? టిప్పు అనే పేరుతో వచ్చిన ఈ సినిమా కథ ఏమిటి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే. 

కథ: అది మైసూర్‌. అక్కడ ఎవరు తెలిసినా, తెలియకపోయినా హరి భాయ్‌(ముక్తాఖాన్‌), కేశుభాయ్‌(శ్రావణ్‌) అంటే తెలీని వారుండరు. రకరకాల ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌తో, హత్యలు, మానభంగాలతో సిటీని వణికిస్తుంటారు. వారి ఆగడాలకు ఎంతో మంది అమాయకులు, అమ్మాయిలు బలవుతూ వుంటారు. అదే టైమ్‌లో హరిభాయ్‌ తమ్ముడు కేశు భాయ్‌ని చంపేందుకు కొంతమంది ట్రై చేస్తారు. అప్పుడే ఊడి పడిన హీరో కార్తీక్‌ కృష్ణ(సత్యకార్తీక్‌) వారిని ఎదుర్కొని కేశుభాయ్‌ని కాపాడతాడు. గాయాలతో వున్న కేశుభాయ్‌ అక్కడి నుంచి తప్పించుకొని ఓ గుడి ముందు పడిపోతాడు. దాహం అని అతను అరుస్తున్నా, అతను చస్తేనే బాగుంటుందని భావించిన జనం నీళ్ళు ఇవ్వరు. ఆ టైమ్‌లో హీరోయిన్‌ వైష్ణవి(కనికా కపూర్‌) అతనితో నీళ్ళు తాగిస్తుంది. ఆమెను పెళ్ళి చేసుకోవాలని వెంటనే డిసైడ్‌ అవుతాడు కేశుభాయ్‌. అదే టైమ్‌లో వైష్ణవిని చూసిన కార్తీక్‌ కృష్ణ కూడా ఆమెను ఇష్టపడతాడు. సిటీ పోలీస్‌ కమిషనర్‌(నాగబాబు) కూతురైన వైష్ణవితో తన తమ్ముడి నిశ్చితార్థానికి అన్నీ సిద్ధం చేసుకొని కమిషనర్‌ ఇంటికి వస్తాడు హరిభాయ్‌. అతనికి వార్నింగ్‌ ఇచ్చి పంపిస్తాడు కమిషనర్‌. అయితే కేశుభాయ్‌కి, వైష్ణవికి నిశ్చితార్థం అయిపోయిందని ప్రచారం చేస్తారు. దీంతో సిటీలో ఒక ముఖ్యమైన అమ్మాయిగా మారుతుంది వైష్ణవి. ఇదిలా వుంటే వైష్ణవి చదివే ఉమెన్స్‌ కాలేజీలో అడ్మిషన్‌ సంపాదిస్తాడు కార్తీక్‌ కృష్ణ. కాలేజీలో అంతమంది అమ్మాయిలున్నా వైష్ణవినే ఇష్టపడతాడు. ఆమెను అడ్డం పెట్టుకొని కేశుభాయ్‌ని చంపేస్తాడు కార్తీక్‌. అసలు కార్తీక్‌కృష్ణ ఎవరు? మైసూర్‌ ఎందుకొచ్చాడు? కేశుభాయ్‌ సోదరులతో అతనికి వున్న పగ ఏమిటి? దానికి వైష్ణవిని ఎందుకు వాడుకున్నాడు? వైష్ణవితో కార్తీక్‌ నడిపిన ప్రేమ వ్యవహారం నిజం కాదా? కార్తీక్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: సత్యకార్తీక్‌కి హీరోగా ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఆ ఛాయలు ఎక్కడా కనబడనివ్వకుండా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ ఆర్టిస్టులా నటించాడు. డాన్సుల్లోగానీ, ఫైట్స్‌లోగానీ, డైలాగ్స్‌ చెప్పడంలోగానీ సెటిల్డ్‌ హీరోకి తను ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అతను చెప్పిన కొన్ని మాసీవ్‌ డైలాగ్స్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. డబ్బింగ్‌ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే భవిష్యత్తులో మంచి కమర్షియల్‌ హీరోగా ఎదిగే లక్షణాలు సత్యకార్తీక్‌లో కనిపించాయి. ఇక హీరోయిన్‌ కనికా కపూర్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక కమర్షియల్‌ సినిమాకి వుండాల్సిన అన్ని హంగులతో కథ, బ్యాక్‌డ్రాప్‌ బాగానే సెలెక్ట్‌ చేసుకున్నారు కానీ హీరోయిన్‌ విషయంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ ఫెయిల్‌ అయ్యారని చెప్పాలి. అందంలోగానీ, అభినయంలోగానీ, ఫిజిక్‌లోగానీ... ఏ విధంగానూ ఆకట్టుకోని కనికా కపూర్‌ సినిమాకి చాలా పెద్ద మైనస్‌ అని చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో కాసేపు కనిపించినా ఫమేలా లుక్స్‌ పరంగా, పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఆకట్టుకుంది. హరిభాయ్‌గా ముక్తా ఖాన్‌, కేశుభాయ్‌గా శ్రవణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ రొటీన్‌గానే వుంది. ఎం.ఎస్‌.నారాయణ, కృష్ణభగవాన్‌ చేసిన కామెడీ బాగానే నవ్విస్తుంది. పోసాని చేసిన సీన్స్‌ మాత్రం ఆడియన్స్‌కి విసుగు పుట్టిస్తాయి. నాగబాబు చేసిన పోలీస్‌ కమిషనర్‌ క్యారెక్టర్‌కి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా దానికి తగ్గట్టుగానే వుంది. 

టెక్నీషియన్స్‌: టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌ బి.రాజశేఖర్‌ గురించి. మైసూర్‌, ఫారిన్‌ లొకేషన్స్‌ని ఎంతో అందంగా, రిచ్‌గా చూపించాడు. పాటలు కూడా విజువల్‌గా బాగున్నాయి. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీస్‌కి అద్భుతమైన సంగీతాన్నందించిన మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్‌ అంతగా ఆకట్టుకోలేదు. పాటలు వినడానికి అంతగా బాగోకపోయినా విజువల్‌గా బాగానే వున్నాయి. మంచి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇవ్వడంలో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఈ సినిమాకి కూడా మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశాడు. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ గురించి చెప్పాలంటే అంతకుముందు అతను చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో అతని వర్క్‌లో క్వాలిటీ తగ్గిందని చెప్పాలి. మధ్య మధ్య కొన్ని అనవసరమైన సీన్స్‌ని ఇరికించినట్టుగా అప్పటికప్పుడు సీన్‌ స్టార్ట్‌ అయి వెంటనే ఎండ్‌ అయిపోతాయి. డైరెక్టర్‌ జగదీష్‌ రాసుకున్న కథలో కొత్తదనం ఏమీ లేదు. ఇలాంటి కథలు ఇంతకుముందు మనం చాలా చూసేశాం. ఇక కథనంలో కూడా కొత్తదనం లేదు. పైగా ఫస్ట్‌ హాఫ్‌ అంతా అనవసరమైన సీన్స్‌తో, సాంగ్స్‌తో కాలయాపన చేసి ఇంటర్వెల్‌లో ఒక సస్పెన్స్‌తో ఎండ్‌ చేశాడు. సెకండాఫ్‌లో కూడా దాన్ని సాల్వ్‌ చెయ్యకుండా ఎం.ఎస్‌.నారాయణ కామెడీ, కృష్ణ భగవాన్‌ కామెడీ, పాటలతో క్లైమాక్స్‌ వరకు తీసుకొచ్చాడు. ఈ ఇద్దరు కమెడియన్స్‌ చేసిన కొన్ని సీన్స్‌ బాగానే వున్నట్టు అనిపించినా సినిమాని సాగదీయడానికి అన్నట్టు అర్థమైపోతుంది. 

విశ్లేషణ: ఇది ఒక రివెంజ్‌ డ్రామా. ఈ కథ గురించి ఎవరికి చెప్పినా ఇలాంటి కథలు చాలా వచ్చేశాయి కదా అంటారు. అలాంటి కథను తీసుకొని దానికి హీరోయిన్‌ని సెంటర్‌ పాయింట్‌ చేస్తూ ఒక కొత్త కథను క్రియేట్‌ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. అయితే సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండ్‌ అయ్యే వరకూ ఒక రొటీన్‌ సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది తప్ప ఎక్కడా కొత్తదనం అనేది కనిపించదు. విలన్‌ తమ్ముడ్ని చంపడానికి హీరోయిన్‌ని ఎందుకు అడ్డు పెట్టుకోవాలో అర్థం కాదు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో, హీరోయిన్‌ల మధ్య సీన్స్‌, కాలేజీ సీన్స్‌, మధ్య మధ్య పాటలతో బోర్‌ ఫీలవుతాం. సెకండాఫ్‌కి వచ్చే సరికి కథని కన్‌క్లూడ్‌ చెయ్యడానికి ఎం.ఎస్‌.నారాయణ, కృష్ణభగవాన్‌ల కామెడీతో క్లైమాక్స్‌ వరకు లాగారు. సెకండాఫ్‌ అయినా ఇంట్రెస్టింగ్‌గా, స్పీడ్‌గా వుంటుందేమో అని భావించే ఆడియన్స్‌ నిరాశ ఎదురవుతుంది. కొంత కామెడీ, పాటలు, ఫైట్స్‌తో వుండే రెగ్యులర్‌ ఫార్మాట్‌ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్‌కి ‘టిప్పు’ నచ్చే అవకాశం వుంది.

ఫినిషింగ్‌ టచ్‌: రొటీన్‌ కమర్షియల్‌ మూవీ

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

- హరా జి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement