Advertisement

'సంపూర్ణ భగవద్గీత' ఆడియో ఆవిష్కరణ!

Thu 30th Jul 2015 04:23 AM
bhagavadh gita audio release,gangadhara shastry,prasad  'సంపూర్ణ భగవద్గీత' ఆడియో ఆవిష్కరణ!
'సంపూర్ణ భగవద్గీత' ఆడియో ఆవిష్కరణ!
Advertisement

ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ప్రారంభించిన ''సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం'' పూర్తయ్యి, 18 ఆడియో సీడీల రూపంలో విడుదలకు సిద్ధమయింది. అమర గాయకుడు ఘంటసాల గారు భగవద్గీతలోని ఎంపిక చేసిన 106 శ్లోకాలను మాత్రమే గానం చేయగా, హెచ్ ఎంవీ సంస్థవారు 1974, ఏప్రిల్ 21న గ్రామఫోన్  రికార్డు రూపంలో విడుదల చేసారు. ఆనాడు ఒక తెలుగు గాయకుడు ప్రారంభించిన గీతాగాన యజ్ఞాన్ని మరొక తెలుగు గాయకుడే పూర్తి చేయాలన్న సంకల్పంతో గంగాధర శాస్త్రి స్వీయ సంగీత సారధ్యంలో తెలుగు తాత్పర్య సహితంగా ''700 శ్లోకాల గీతాగాన యజ్ఞాన్ని" 2006, జూన్ 25న ప్రారంభించారు.

అవిశ్రాంత కృషి, ఆమూలాగ్ర పరిశోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుమధుర గాన మాధుర్యాల మేళవింపుగా గంగాధర శాస్త్రి చేసిన ఈ అపూర్వ ప్రయత్నం భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షర లిఖితం అవుతుందని వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసించడం విశేషం. 8 సంవత్సరాల నిరంతర కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ సంపూర్ణ భగవద్గీత ఆడియో ఆవిష్కరణ మహోత్సవం 'జూలై 29న, హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళావేదిక'లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విశ్వేసతీర్ధానందస్వామీజీ వారు సంపూర్ణ భగవద్గీత మొదటి కాపీను విడుదల చేసి మాజీ పార్లమెంట్ సభ్యులు కనిమూరు బాపిరాజు కు అందించారు. కమాలనంద భారతి ఆడియో సీడీలను విడుదల చేసి ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారికి అందించారు. ఈ సందర్భంగా..

శ్రీశ్రీశ్రీ విశ్వేసతీర్ధానందస్వామీజీ మాట్లాడుతూ "భగవద్గీత భారతదేశపు ధర్మ గ్రంధము. సామాజిక జీవన సందేశం భగవద్గీత నుండి లభిస్తుంది. గంగ, గీతా, గాయత్రి, గోమాత అనే నాలుగు ఘట్టాలు మన సంస్కృతికి ప్రతీకలు. అలాంటి సంస్కృతి ప్రతీక అయిన గీతను అందరికి అర్ధమయ్యే విధంగా గంగాధరశాస్త్రి ప్రచురించినందుకు ఆయనను అభినందిస్తున్నాను. ఈ గీతను రచించి గీతాగంగాధరుడయ్యాడు" అని చెప్పారు.

శ్రీ విద్యానంద భారతి మాట్లాడుతూ "భగవద్గీతను ఆచరించినప్పుడే మన జీవితంలో మంచి మార్పు రావడం జరుగుతుంది. భగవద్గీత ఫర్ మేనేజ్ మెంట్ అని అనేక మంది సాధన చేస్తున్నారు. గీతలో మూడు శ్లోకాలు ఉన్నాయి. వాటిని శుద్ధంగా అర్ధం చేసుకుంటే మనిషికి డాక్టర్ అవసరం ఉండదు. 17వ అధ్యాయంలో ఆ మూడు శ్లోకాలు ఉంటాయి. ప్రస్తుతం 'దేశ భాషలందు తెలుగు ''లెస్'' అయిపోయింది. జీవితంలో అనేకమైనవి 'లెస్' అయిపోయిని. 'ఫోన్ కార్డు లెస్' , 'కుక్కింగ్ ఫైర్ లెస్' , 'డ్రెస్ స్లీవ్ లెస్' , 'ఫుడ్ టేస్ట్ లెస్' , 'టైర్ ట్యూబ్ లెస్' , 'ఫ్రూట్ సీడ్ లెస్' , 'పోలీస్ ట్రూ లెస్' , 'ఆర్గ్యుమెంట్ బేస్ లెస్' , 'ధర్మ ప్రాక్టీసు లెస్' , 'ఎడ్యుకేషన్ మోరల్ లెస్' , 'కప్ ఆఫ్ టీ షుగర్ లెస్' బట్ 'అవర్ ఎక్స్ పెక్టేషన్స్ ఆర్ ఎండ్ లెస్'. దీనంతటికీ మార్గం గీత చూపిస్తుంది. మీ పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు. సంస్కారాన్నివ్వండి. ఈ అధ్బుతమైన గీత నుండి రోజుకు కనీసం ఒక శ్లోకాన్నైనా వారికి నేర్పించండి" అని చెప్పారు.

పి.వి.ఆర్.కె ప్రసాద్ మాట్లాడుతూ "భగవంతుడు మనం కోరుకున్నదాన్ని బట్టి ఇవ్వడు. మన అర్హతను బట్టి ఇస్తాడు. సాధన జరిగి ఓ కార్యక్రమం పూర్తి చేయడానికి అర్హత, ప్రయత్నం, భగవంతుడి ఆరాధన కావాలి. ఈ మూడు గంగాధర శాస్త్రి కి ఉన్నాయి. ఎనిమిది సంవత్సరాలుగా ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా ఈ గీతను పూర్తి చేసారు. ప్రతి భారతీయుని చేతిలో, ప్రతి విద్యార్ధి చేతిలో, లైబ్రరీలలో ఉండాల్సిన పుస్తకమిది. ఇది మరణ గీత కాదు జీవన గీత. మన కార్యసిద్ధి కోసం భగవంతుడు ఇచ్చిన ఆదేశం ఇది" అని చెప్పారు.

గంగాధర శాస్త్రి మాట్లాడుతూ "ఒక గాయకుడు స్వీయ సంగీతంలో ఒక ప్రామాణిక గ్రంథాన్ని తాత్పర్య సహితంగా, సంపూర్ణంగా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతదేశ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం. శ్రీ ఘంటసాల గౌరవార్ధం, ఆయన పాడిన 106 శ్లోకాలను యధాతథంగా గానం చేస్తూ, మిగిలిన శ్లోకాలను నా స్వీయ సంగీతంలో తాత్పర్య సహితంగా గానం చేసి 700 శ్లోకాల 'భగవద్గీత'ను సంపూర్ణంగా రికార్డు చేసాం. దాదాపు 100 మంది పండితులు, వాద్య కళాకారులు, సాంకేతిక నిపుణులు, భగవద్భందువులు ఈ ప్రాజెక్ట్ కు సహకారం అందించారు. కర్నాటక, శాస్త్రీయ, హిందుస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఈ 'భగవద్గీత' శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్లేట్టుగా సాగుతుంది. భగవద్గీత మరణ గీత కాదని జీవన గీతని అందరికి తెలియబరచడానికే ఈ గ్రంధాన్ని ఆవిష్కరించాం. త్వరలోనే ఈ గ్రంధాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒబామా చేతుల మీదుగా అమెరికాలో విడుదల చేయనున్నాం. దానికి తానా, ఆటా సభలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. భగవద్గీత యూనివర్సిటీను స్థాపించాలనే ధ్యేయంతో ఉన్న మాకు దానికి కావాల్సిన స్థలాన్ని కొందరు పెద్దలు అందించారు. ఈ సభాపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్, టి.సుబ్బిరామిరెడ్డి, కె.విశ్వనాధ్, పుల్లెల గోపీచంద్, సి.జి.కిషన్, ఎల్.వి.సుబ్రహ్మణ్యం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జానకి, శేఖర్ కమ్ముల, విశ్వేశ్వరావు, ఘంటసాల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement