Advertisement

దేశంలో సంచలనం రేపుతున్న స్కాం..!!

Sat 04th Jul 2015 08:31 AM
vyapam scam,madhya p radesh,mysterious deaths,shivraj singh chouhan  దేశంలో సంచలనం రేపుతున్న స్కాం..!!
దేశంలో సంచలనం రేపుతున్న స్కాం..!!
Advertisement

బీజేపీలో నరేంద్రమోడీ తర్వాత ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ అంతగా పేరుగాంచారు. ఓ సమయంలో మోడీకి పోటీగా పీఎం పదవి రేసులో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేరు కూడా వినిపించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. అవినీతిని నిర్మూలించారన్న పేరు ఈయనకు ఉంది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ కుంభకోణం చౌహాన్‌ ప్రతిష్టపై మాయని మచ్చ వేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

మధ్యప్రదేశ్‌ ప్రొఫేషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు అనే సంస్థ వ్యాపమ్‌ పేరిట ఎమ్‌పీ రాష్ట్రంలో పలు కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే ఈ వ్యాపమ్‌ సంస్థ నిర్వహిస్తున్న పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఓ పిల్‌ దాఖలు కాగా ఆ రాష్ట్ర హైకోర్టు తన పర్యవేక్షణలో సిట్‌ సంస్థతో దర్యాప్తు చేయిస్తోంది. ఈ దర్యాప్తు ప్రారంభం కాగానే ఈ కుంభకోణంలో చాలా పెద్ద పెద్ద తలకాయలున్నాయని తెలిసింది. ఏకంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కూడా సిట్‌ అరెస్టు చేసింది. అంతేకాకుండా నిందితుల్లో ఆ రాష్ట్ర గవర్నర్‌ రామ్‌ నరేష్‌ యాదవ్‌ పేరు కూడా ఉంది. అత్యున్నత స్థాయిలో 25 మందిపై కేసులు నమోదు చేయగా 125 మంది అధికారులను, నాయకులను సిట్‌ అరెస్టు చేసింది. అంతేకాకుండా ఈ స్కాంతో లబ్ధి పొందారన్న ఆరోపణలపై 720 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదయ్యాయి.

అయితే ఈ మేరకు అరెస్టులు జరగగానే ఇది సాధారణ కేసు కాదన్న చర్చ యావత్‌దేశంలో జరిగింది. దీనికితోడు ఈ కేసుతో సంబంధమున్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందుతుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న గవర్నర్‌ కుమారుడు కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇప్పటికి ఈ కేసుతో సంబంధమున్న నిందితుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్నిబట్టి ప్రస్తుతం అరెస్టైన వ్యక్తులే కాకుండా ఆపై స్థాయి వ్యక్తులు కూడా ఈ కుంభకోణంలో చిక్కుకున్నట్లు అనుమానం. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు కూడా బెదిరింపులు రావడంతో వారికి రక్షణ పెంచారు. భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి మరెన్ని సంచలనాలు నమోదవుతాయో వేచిచూడాలి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement