Advertisement

గ్రూపుల సినీ రాజకీయాలకు మంచి సమయం..!

Sun 31st May 2015 11:56 AM
telangana,cricket,telangana film chamber,elections,talasani srinivas yadav  గ్రూపుల సినీ రాజకీయాలకు మంచి సమయం..!
గ్రూపుల సినీ రాజకీయాలకు మంచి సమయం..!
Advertisement

వివాదాస్పదంగా మారనున్న తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు 

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి.  రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అన్నీ రెండుగా విడిపోయాయి .. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు పరిష్కారాలు నడుస్తున్నాయి.. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి త్వరలో ఏడాది కావస్తోంది. అయితే తెలుగు సినిమా మాత్రం ఇంకా విడిపోలేదు. తెలుగు ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ కూడా రెండుగా విడి పోలేదు.. అయితే తెలంగాణా ఫిలింఛాంబర్‌ మాత్రం ఏర్పడి కాస్త బలోపేతంగా నడుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని ప్రాంతాల వారు కలిసి పని చేసినా కూడా తెలంగాణాకు చెందిన వారి పట్ల వివక్ష చూపిస్తున్నారు. అని తెలంగాణా కు చెందిన అన్ని వర్గాల వారు భావిస్తున్నారు. తెలంగాణా వచ్చినప్పటికి మాకు రావలసినటువంటి ప్రతిపత్తి గాని తెలంగాణా సినిమా గా ప్రత్యేక హోదా గాని రావడం లేదు.. తెలంగాణా సినిమాకు ప్రత్యేక హోదా కల్పించి ప్రత్యేక ప్రోత్సాహాలు అందించ వలసిన అవసరం ఉంది అని తెలంగాణా సినిమాకు  చెందిన పలువురు కోరుకుంటున్నారు. అయితే ఈ విషయమై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం  పెద్దగా స్పందించక పోకపోవడం విశేషం. ఆ మధ్య కాలంలో తెలంగాణా సినిమాటో గ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఏర్పాటు చేసిన సంఫీుభావ సమావేశం లో అందరూ కలిసి పని చేయాలని సూచించగా కొందరు తెలంగాణాకు చెందిన సినిమా వ్యక్తులు లేచి బహిరంగంగా నిరసనలు తెలపడంతో ఆ సభ రసా భస గా మారింది. అలాగే తెలంగాణా ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు రెండు వేల ఎకరాలను కేటాయించడం.ఆ సినిమా సిటీని ఎలా రూపొందిద్దాము అనే విషయాన్ని తెలంగాణా వ్యక్తులకు పెద్దగా ఆ విషయంలో ప్రాధాన్యత ఇవ్వక పోవడం లాంటి విషయాలు తెలుగు సినిమా పరిశ్రమ విడిపోకూడదు అనే సంకేతాలను పంపాయి. 

అయితే తెలంగాణా సినిమా ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకునే తెలంగాణా సినిమా ప్రముఖులు మాత్రం ఈ దిశగా పావులు కలుపుతున్నారు.అయితే తెలంగాణా సినిమా విషయానికి వస్తే బలం ఎక్కువ లేక పోయినా కూడా సంఘాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అందరికి తెలిసిన విషయమే .. ఒక్క సినిమా తీసిన కొందరు వ్యక్తులు కూడా సినిమాకు సంబందించిన సంఘాలను సొంతంగా పెట్టు కోవడం .. ఎవరికి వారు తామే స్వంతంగా ఎదగాలనే ఉబలాట పడుతుండటం లాంటివి తెలంగాణా సినిమా వారు అంతా ఒక తాటి మీదికి రావడానికి వీలు కాలేదు.ఈ మధ్య ఒకాయన తెలుగు సినిమా నటీనటులతో ఒక క్రికెట్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించడానికి సిద్ధపడి చివరికి విఫలమయ్యాడు. ఇలా జరుగుతున్న నేపధ్యంలో..

త్వరలో ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు జరుగ నున్నాయి. ఈ ఎన్నికల్లో ఛాంబర్‌ లో ఉన్న శాఖల్లో ఉన్న స్టూడియో సెక్టార్‌.. ఎగ్జిబ్యూటర్‌ సెక్టార్‌ .. డిస్ట్రిబ్యూటర్‌ సెక్టార్‌ ..ప్రొడ్యూసర్‌ సెక్టార్‌ లలో  ఏడాదికి ఒక సెక్టార్‌  వారు అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న  పరిస్థితుల్లో తెలంగాణాకు చెందిన వారు ఈ అధ్యక్ష పదవి పొందే అవకాశం ఉంది. అయితే ఈ సారి తెలంగాణాకు చెందిన వారు ఈ ఛాంబర్‌ అధ్యక్ష పదవిని చేపట్టరాదు అని తెలంగాణా చిత్ర పరిశ్రమకు చెందిన వారు పట్టు పడుతున్నారు.. ఈ ఛాంబర్‌ ఎన్నికల్లో పాల్గొనాలా వద్దా లేక పోతే తామే సొంతంగా తెలంగాణా ఫిలిం ఛాంబర్‌ పేర ఎన్నికలు జరుపు కోవాలా అని చర్చించుకుంటున్నారు. అయితే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి దీన్ని ఏ విధంగా  పరిష్కరిస్తుంది అనే విషయాలు ఇప్పటి వరకు చర్చకు రాక పోయినప్పటికి ఈ సారి ఎన్నికలు కాస్తా వివాదాస్పదంగానే జరుగ నున్నట్లు సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. 

                                                                                                              -పర్వతనేని రాంబాబు 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement