భారతీయ సినిమా హిస్టరీలో అన్ని రికార్డుల్ని తిరగరాసే పురాణేతిహాస కథ `రామాయణం`ను దంగల్ ఫేం నితీష్ తివారీ ఎంపిక చేసుకుని సాహసం చేస్తున్నాడు. రామాయణం చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న అతడు మొదటి భాగం చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసాడు. ఈ ఆదివారం నాటికి టాకీ చిత్రణ ముగించి గుమ్మడి కాయ కార్యక్రమం చేసేసారు. ఈవెంట్లో ఎమోషనల్ గా మాట్లాడిన రణబీర్ కపూర్ మాటలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
ఈనెల 3న ప్రతిష్ఠాత్మకంగా రామాయణం మొదటి మీడియా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే రామాయణం లోగో టైటిల్ లాంచ్ కార్యక్రమం జరుగుతుంది. అయితే అత్యంత కీలకమైన ఈ సమావేశానికి శ్రీరాముడి పాత్రధారి అయిన రణబీర్ కపూర్, రావణాసురుడి పాత్రధారి అయిన యష్ హాజరు కావడం లేదని తెలిసింది. దీనికి కారణం ఆ ఇద్దరూ విదేశాలలో ఉండటమే. యష్ తన కుటుంబంతో ఇప్పటికే అమెరికాకు వెళ్లారు.
టాక్సిక్, రామాయణం ఎడతెరిపి లేని షెడ్యూళ్లతో అలసిపోయిన యష్ కొన్ని వారాల పాటు అక్కడ విశ్రాంతి తీసుకుంటాడని తెలిసింది. అలాగే రణబీర్ ఇప్పటికే తన కుటుంబంతో లండన్ లో ఉన్నాడు. అంటే ఆ ఇద్దరూ ఇక కీలక ఈవెంట్లో కనిపించరు. వేడుకను నితీస్ తివారీ, ఇతర కాస్ట్ అండ్ క్రూతో కలిసి నిర్వహించనున్నాడు. సాయిపల్లవి, లారా దత్తా, సన్నీడియోల్, దూబే వంటి ప్రముఖులు అటెండవుతారని తెలుస్తోంది.