Advertisement

ఈసీ దెబ్బ.. సజ్జల అబ్బా!

Wed 17th Apr 2024 09:53 AM
sajjala ramakrishna reddy  ఈసీ దెబ్బ.. సజ్జల అబ్బా!
EC action on Sajjala ఈసీ దెబ్బ.. సజ్జల అబ్బా!
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పేరుకే సలహాదారే కానీ.. సకల శాఖలు ఈయన పరిధిలేనో.. కనుసన్నల్లోనే నడుస్తుంటాయ్!. అంతేకాదండోయ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లినప్పుడు ఒక్క ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడం తప్పితే.. షాడో చీఫ్ మినిస్టర్‌గా కూడా పనిచేశారు. ఇక ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్ ఇవ్వాలన్నా.. ప్రభుత్వం తరఫున మీడియా ముందుకొచ్చి మాట్లాడాలన్నా.. ఏదైనా సమస్యలపై ఉద్యోగులు, ఆయా రంగాల వారితో మాట్లాడాలన్నా ముందుండి నడిపిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎప్పుడు, ఎక్కడ చూసినా సజ్జల.. సజ్జల అనే మాటే వినిపిస్తుంటుంది. సలహాదారు మించి పనులు చేస్తూ ఇలా అస్తమానూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అంతేకాదండోయ్.. ఈయన చేసే అతికి ఒక్కోసారి వైసీపీకి తీవ్ర నష్టమే వాటిల్లుతోంది. రేపొద్దున్న వైసీపీ ఓడిపోతే.. ఇందుకు కర్త, కర్మ, క్రియ కూడా సజ్జలే అని చెప్పడంలో బహుశా ఎలాంటి అతిశయోక్తి అక్కర్లేదేమో..!

ఏం జరుగుతోంది..?

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా.. వైసీపీ తరఫున రోజూ మీడియా ముందుకొచ్చి సజ్జల మాట్లాడితే చాలు ప్రతిపక్ష పార్టీల నేతల ఒంట్లో తేళ్లు పాకినట్లవుతుంటుంది. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ రెడ్డిపై దాడి జరిగిన తర్వాత ఆయన ఎలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో.. ప్రతిపక్షాలపై ఏ రేంజ్‌లో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సజ్జల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఈసీకి ఫిర్యాదు చేద్దామనుకున్న టైములో ఈసీనే దిమ్మదిరిగే షాకిచ్చింది. ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతున్న 40 మంది ఏపీ సలహాదారులు కోడ్ పరిధిలోనికి వస్తారని ఈసీ పేర్కొంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని సలహాదారులపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులపై పూర్వ, పరాలు పరిశీలించిన తర్వాత.. ప్రతిపక్షాలను విమర్శిస్తూ సలహాదారులు మీడియా సమావేశాలు పెడుతున్నట్లు ఎన్నికల కమిషన్ గుర్తించి.. వారికి కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని తొలి హెచ్చరికలు, అంతకుమించి సలహాదారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

దెబ్బ అదుర్స్ కదూ!

నిజానికి వైసీపీ అంటే సజ్జల.. సజ్జల అంటే వైసీపీగా పరిస్థితులు నెలకొని ఉండేవి. ఆయన ఏదైనా మాట్లాడితే.. అది ఇక వైఎస్ జగన్ నోటి నుంచే వచ్చినట్లుగా వీరాభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఇక మీడియా ముందుకు రాకూడదని ఈసీ చెప్పడంతో సజ్జల ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఒక్క సజ్జలను నోరు మూయిస్తే వైసీపీని ఎదుర్కోవడం చాలా సులువు అని టీడీపీ కూడా భావిస్తున్న పరిస్థితి.. సైకిల్ పార్టీకి ఇదొక సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. సజ్జల మాట్లాడటానికి వీల్లేదు.. అని ఈసీకి ఇంకాస్త గట్టిగా పట్టుబడితే మాత్రం.. ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి వైసీపీ నేతగా పనిచేయడానికి ఏ మాత్రం ఆలోచించరనే టాక్ కూడా నడుస్తోంది. ఇదే జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో సజ్జల ఏం చేయబోతున్నాడు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి అంతకుమించి ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

EC action on Sajjala:

Sajjala Ramakrishna Reddy

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement