Advertisement

విశాల్‌ భేషైన నిర్ణయం తీసుకున్నాడు!

Tue 19th Jun 2018 01:25 PM
  విశాల్‌ భేషైన నిర్ణయం తీసుకున్నాడు!
Kollywood Boycotts Filmfare Awards విశాల్‌ భేషైన నిర్ణయం తీసుకున్నాడు!
Advertisement

సినీ పరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులే పెద్ద వివాదాలకు కేంద్రంగా మారుతూ, రాజకీయ నాయకులు, నిర్వాహకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్నాయి. ఏ అవార్డులను ఏ చిత్రాలకు ఎందుకు ఇస్తారో అన్నది ఎవ్వరికీ అంతు చిక్కని విషయం. దీంతో నంది అవార్డుల వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కూడా తమ విలువలను కోల్పోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సినీ పత్రికలు, మేగజైన్లు, చానెల్స్‌ ఇచ్చే అవార్డులకు ఏ పాటి విలువ ఉంటుందో ఇట్టే అర్ధమవుతుంది. తమ వేడుకలకు విచ్చేస్తామని హామీ ఇచ్చిన నటీనటులకు, డ్యాన్స్‌ ప్రోగ్రాంలు, స్కిట్స్‌ చేస్తామని చెప్పిన నటీనటులకు వీరు పెద్ద పీట వేస్తున్నారు. వీరి దృష్టిలో తమ అవార్డుల కార్యక్రమాలకు హాజరై తమకు కావాల్సినంత పేరును, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా భారీ మొత్తాలను అందించగలిగే నటీనటులకే వారు అవార్డులను ఇస్తున్నారు. 

ఈ విషయంలో దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్వాహకులు కీలకమైన చర్యలను చేపట్టారు. ఇక నుంచి సినీ అవార్డుల పేరుతో, డ్యాన్స్‌ప్రోగ్రాంలు, పాటల పోటీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే సదరు సంస్థలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే నటీనటులకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చాలని, లేదా నటీనటుల సంఘాలకు, నిర్మాత మండళ్లకు వారు నిధులనైనా ఇవ్వాలని నిర్ణయించింది. అలా ఇవ్వని వారి కార్యక్రమాలకు సినీ నటీనటులు హాజరు కాకూడదని తీర్మానించింది. ఇటీవల విజయ్‌ టివి, గలాటా డాట్‌కామ్‌, కలర్స్‌ టివి వంటి వారు ఈ నిర్వాహకుల షరతులకు అంగీకరించారు. 

కానీ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కమిటీకి తాము ఈ నియమ నిబంధనలను తెలియజేసినా కూడా వారు తమ కండీషన్లకు ఓకే చెప్పలేదని, అందువల్ల ఆ ప్రోగ్రాంలో పాల్గొనకూడదని తాము నటీనటులకు తెలియజేస్తున్నామని విశాల్‌ తెలిపాడు. మా విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్న నయనతార, ఖుష్బూ, సుందర్‌, విజయ్‌సేతుపతి, కార్తీ వంటి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని విశాల్‌ ప్రకటించాడు. నేడు ఈ కార్యక్రమాలు వ్యాపారంగా మారుతున్నాయి కాబట్టి ఆ లాభంలో నటీనటులకు వాటా గానీ లేదా నిర్మాత సంఘం, నటీనటుల సంఘాలకు నిధులను గానీ ఇవ్వాల్సిందేనని విశాల్‌ స్పష్టం చేశాడు. దీంతో రోజుకో కొత్త పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ అవార్డు కార్యక్రమాలకు ఇకనైనా కాస్త చెక్‌ పడే అవకాశం ఉందనే చెప్పాలి.

Kollywood Boycotts Filmfare Awards:

Kollywood boycotts filmfare awards as organisers fefuse to pay donation

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement