Advertisement

పవన్ కు తెలంగాణలో ఫాలోయింగ్ ఉందా?

Fri 17th Mar 2017 10:34 AM
pawan kalyan,janasena,telangana,andhra pradesh,jagga reddy  పవన్ కు తెలంగాణలో ఫాలోయింగ్ ఉందా?
పవన్ కు తెలంగాణలో ఫాలోయింగ్ ఉందా?
Advertisement

2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ సభా సమావేశం జరిపినా చెప్పుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఆయన వ్యవహార శైలి, చేస్తున్న పోరాటం, పట్టించుకుంటున్న ప్రజాసమస్యలు అన్నీ కూడా ఆంధ్రాకే పరిమితం అవుతుండటంతో పవన్ కళ్యాణ్ పార్టీ కేవలం ఆంధ్రాకే పరిమితం అవుతుందేమోనని భావించారు ప్రజలంతా. కానీ  తాజాగా ఆయన మాట్లాడుతూ... రాబోవు సాధారణ ఎన్నికల్లో తన పార్టీ ఆంధ్రాతోపాటు తెలంగాణలో కూడా అన్నీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించేశాడు. ఇరు రాష్ట్రాల్లోనూ అన్ని స్థానాల‌కూ అభ్య‌ర్థుల్ని నిల‌బెడతామని ఒక స్పష్టత ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇలా పవన్ స్పందించాడో లేదో తెలంగాణ‌లో జ‌న‌సేన‌కు నాయ‌కులు ఎవ‌రబ్బా అంటూ సర్వత్రా చర్చ మొదలైంది.

అయితే సినిమా స్టార్ గా పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం కాదనరాని సత్యం. కానీ పవన్ జ‌న‌సేన పార్టీని న‌మ్మి ఎన్నికల్లోకి దిగేంత సాహసం ఏ నాయకులు చేస్తారన్నదే ఇక్కడ అంతటా చర్చ నడుస్తుంది. గతాన్ని తలుచుకొంటే తెలుగు ప్రజలు ఇరు రాష్ట్రాలుగా విడిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు పవన్. ఆ తర్వాత విభజించడం ఓకేగానీ ఆ విభజించిన తీరు తనను బాధించిందని ఆయన బాధ పడ్డ విషయం కూడా అందరికీ విదితమే. అలా గత ఎన్నికల్లో తెలంగాణకి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాగానే ప్ర‌చారం కూడా చేశాడు. ఈ విషయంపై ఖంగుతిన్న తెరాస తదితర పార్టీలు పవన్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇంకా ఎన్నికల తర్వాత కూడా పవన్ ఆంధ్రాకు అన్యాయం జరిగిందంటూ జనసేన సభలన్నీ ఆంధ్రప్రదేశ్ ను ఆశ్రయించే నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ‌లో రెండు మూడు చోట్లకే పరిమితం అయిన పవన్ ఆంధ్రాలో ముమ్మరంగా తిరుగుతూ... ప్ర‌త్యేక హోదా అనీ,  రాజ‌ధాని ప్రాంత రైతుల స‌మ‌స్య‌ల‌నీ, తుందుర్రు మెగా ఆక్వా ప్రాజెక్ట్ అనీ, చేనేత కార్మికుల‌కు చేయూత అనీ,  ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌లు అనీ ఇలా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకున్నంతగా తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదనే చెప్పాలి. అంటే ఒక రకంగా తెలంగాణలో అంతగా సమస్యలు లేవా అంటే ఎక్కడో ఏదో ఒకటి సమస్య ఉంటూనే ఉంటుంది. అందుకోసం కోదండరామ్ లాంటి వ్యక్తులు నిరంతరం పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. గతంలో మల్లన సాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా భూమిని కోల్పోయిన నిర్వాసితుల కోసం పవన్ ఏమాత్రం పోరాటం జరపలేదు సరికదా నోరెత్తి ఏనాడు మాట్లాడని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో తెరాస బలంగా పుంజుకుంటున్న సమయంలో.. ఏదో కొంత ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు నిరంతరం కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఇంకా తెలుగుదేశం పార్టీ తమ ఉనికి కోసమే నిరంతంరం పోరాడుతూ ఉంది. ఇలాంటి సమయంలో మరో కొత్త పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే ఎలాంటి అనుకూలత వస్తుంది అంటే ఏమీ రాకపోవచ్చ అనే సమాధానం దొరుకుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే తెలంగాణలో భాజపా పుంజుకోవాలని నిరంతరం తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకోసం ప్రత్యేకంగా అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టాడు కూడాను.

ఇప్పటి ఈ పరిస్థితుల్లో జనసేనకు బలమైన నాయకులు తెలంగాణ నుండి ఎవరొస్తారు అనేది ప్రధానమైన ప్రశ్న. వచ్చినా చోటా నాయకులు వస్తారా? లేకా కాస్తో కూస్తో క్యాడర్ ఉన్న వాళ్ళు వస్తారా? అని కూడా చర్చలు జరుగుతున్నాయి. మరీ బలవంత పెడితే జ‌గ్గారెడ్డి లాంటి నేత‌లు రావచ్చనే చర్చ జరుగుతుంది. ఇదంతా అలా ఉంచితే ఏదో పార్టీ ఉందికదా అనీ.. గుడ్డిగా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయడం కంటే ముందు క్యాడర్ ను డవలప్ చేసుకుంటూ.. ఈ సమయంలో జనసేన తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూ ఆ విధంగా ముందుకు పోతే జనసేన తెలంగాణలో కూడా కాస్తో కూస్తో గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తాయి. అంతకు మించి ఏం చేసినా మిగతా పార్టీల వలె పోటీ చేయడం చాప చుట్టేయడం వంటివే జరుగుతాయి తప్ప అంతకు మించి వొరిగేదేమి లేదన్నది వినిపిస్తున్న సత్యం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement