సూపర్‌స్టార్‌ దానిపై కన్నేశాడా..?

Fri 13th Jan 2017 06:52 AM
సూపర్‌స్టార్‌ దానిపై కన్నేశాడా..?

మలయాళ సూపర్‌ స్టార్‌గానే కాకుండా పరిపూర్ణమైన నటునిగా కూడా మోహన్‌లాల్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 'పులిమురుగన్‌' లాంటి యాక్షన్‌ చిత్రాలనే గాక తాజాగా ఆయన అంధునిగా నటించిన చిత్రం 'ఒప్పం' కూడా మలయాళంలో పెద్ద హిట్టయింది. ఇక ఈ చిత్రాన్ని కన్నడలో శివరాజ్‌కుమార్‌, బాలీవుడ్‌లో అజయ్‌దేవగణ్‌, తమిళంలో కమల్‌ చేసే అవకాశం ఉంది. తెలుగులో మాత్రం ఈ చిత్రాన్ని చేయడానికి పలువురు స్టార్స్‌ ఆసక్తి చూపించినప్పటికీ ఆయన తాజాగా 'జనతా గ్యారేజ్‌, మనమంతా' చిత్రాలతో వచ్చిన ఇమేజ్‌కు అనుగుణంగా దీనిని తెలుగులో 'కనుపాప' పేరుతో డబ్బింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్‌30న విడుదల చేస్తామని చెప్పి, వాయిదా వేశారు తాజాగా ఈ చిత్రం ఆడియోను ఈనెల 25న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి3న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. 

కాగా మోహన్‌లాల్‌కు 'కాలాపానీ'తో పాటు పలు చిత్రాల ద్వారా దేశవ్యాప్త గుర్తింపు ఉంది. సౌత్‌ఇండియన్‌ ఇండస్ట్రీలో రజనీ, కమల్‌, చిరు, మమ్ముట్టి, విక్రమ్‌... వంటి వారి సరసన ఆయన పేరు ఎప్పుడో లిఖితమైపోయింది. ఇక తాజాగా ఆయన 'జిల్లా' వంటి తమిళ చిత్రంలో యంగ్‌స్టార్‌ విజయ్‌తో కలిసి నటించి కోలీవుడ్‌ మార్కెట్‌ను కూడా బాగా పెంచుకున్నాడు. తెలుగులో త్వరలో పవన్‌-త్రివిక్రమ్‌ల చిత్రంలో ఆయన కీలకపాత్రను పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.కేవలం హీరోగానే కాదు... బిజినెస్‌మేన్‌గా కూడా ఆయనకు ఎన్నో ఆస్తులున్నాయని వాటి విలువ వేల కోట్లలో ఉంటుందనే విషయాన్ని పలువురు ఒప్పుకుంటున్నారు. 

మోహన్‌లాల్‌ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. 'బాహుబలి, 2.0' చిత్రాలను మించిన బడ్జెట్‌తో అంటే సుమారు 600కోట్లతో ఆయన ఓ చిత్రాన్ని స్వయంగా నిర్మించి, నటించనున్నాడని, ఆ చిత్రం తర్వాత ఇక సినిమాలకు గుడ్‌బై చెబుతాడని సమాచారం. ఈ చిత్రం ఎం.టి. వాసుదేవ నాయర్‌ రచించిన నవల ఆధారంగా తెరకెక్కనుందని, ఇది మహాభారతంలో భీముని కోణంలో ఉంటుందని సమాచారం. మరి ఇదే కనుక నిజమైతే, ఇందులో తనకున్న పరిచయాలతో పలువురు స్టార్స్‌ని ఇతర పాత్రల్లో నటించడానికి ఒప్పిస్తాడంటున్నారు. మరి ఇది నిజమో? కాదో? తెలియాలంటే మోహన్‌లాల్‌ స్పందిస్తే గానీ కన్‌ఫర్మ్‌ కాదు. 

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2016