Advertisement

ప్రస్తుతం రజనీ మౌనం వెనుక వున్న అర్ధం ఇదే..!

Thu 08th Dec 2016 06:30 PM
rajinkanth,jayalalitha,tamil nadu cm seat,super star rajini silence  ప్రస్తుతం రజనీ మౌనం వెనుక వున్న అర్ధం ఇదే..!
ప్రస్తుతం రజనీ మౌనం వెనుక వున్న అర్ధం ఇదే..!
Advertisement

తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత.. తాను అనుకున్నది చేయడంలో తెగింపు, తనను కాదన్నవారిని వేధించి, కక్ష్య కట్టి వారి అంతు చూసే దాకా నిద్రపోని విప్లవ నాయకిగా పేరు తెచ్చుకుంది. ఆమె మరణంతో తమిళనాడు మొత్తం తీవ్ర శోకసంద్రంలో ఉంది. పురచ్చితలైవి మరణాన్ని ఇంకా తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె జ్ఞాపకాలతోనే గడుపుతున్నారు. కాగా ఇదే సమయంలో డిఎంకే అధినేత కరుణానిధి కూడా వయోవృద్దుడయ్యారు. ఆయన కూడా ఇక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించలేడు. ఇటు జయలలితను నమ్ముకుని, ఆమె స్థానంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌సెల్వంకు గానీ, జయ ప్రియసఖి శశికళకు గానీ జయ స్థానాన్ని భర్తీ చేసే ప్రజాకర్షణ ఉన్న నాయకులు కారు. ఇదే సమయంలో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు తమిళనాడులో పాగా వేసి, బలపడేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. కానీ ప్రాంతీయ ఉద్యమాలకు పుట్టినిల్లు, ద్రవిడ ఉద్యమానికి చిరునామా, ప్రాంతీయాభిమానులకు పట్టం కట్టే తమిళనాడులో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు బలపడటం వీలుకాని పని. అక్కడి ప్రజలు ప్రాంతీయ పార్టీలకే పెద్దపీట వేస్తారనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక తమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు విడదీయరాని బంధం ఉంది. ఎంజిఆర్‌ నుంచి జయలలిత, విజయ్‌కాంత్‌, శరత్‌కుమార్‌ వంటి వారందరూ సినీ క్రేజ్‌ను వెంటతెచ్చుకున్నవారే. 

కాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అనే వాదన కూడా వినిపిస్తోంది. బిజెపి పార్టీ, స్వయాన ప్రధాని మోదీ, అమిత్‌షాలు కూడా రజనీని తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నప్పటికీ ఆయన మాత్రం మౌనాన్నే పాటిస్తున్నారు. రాజకీయాల్లో తెగింపు, ధైర్యం, విమర్శలకు వెరవని వారినే ప్రజలు ఇష్టపడతారు. వారినే కొందరు నియంతలు అని కూడా అంటుంటారు. ఇందిరాగాంధీ, పివినరసింహారావు, ఎన్టీఆర్‌, రాజశేఖర్‌ రెడ్డి, జయలలిత నుంచి నేటి కేసీఆర్‌, మోదీ వరకు ఇలా ఎదిగిన, ఎదుగుతున్న వారే కావడం గమనార్హం. అంతేగానీ అటు ఇటు ఊగిసలాడే వారు ఎంతటి వారైనా ప్రజలను ఆకర్షించలేరు. దీనికి చిరంజీవి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, హరికృష్ణ, కృష్ణ వంటి పలువురిని ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం రజనీ విషయంలో తమిళ ప్రజలకు నమ్మకం పోతుండటానికి కూడా నిర్ణయం తీసుకోవడంలో ఆయన పడుతున్న అవస్దలే కారణమంటున్నారు. రజనీ వివాదరహితుడు, సేవాతత్పరుడు, అంతకు మించి ప్రస్తుతం తమిళనాడులో అత్యంత క్రేజ్‌ ఉన్న వ్యక్తి. ఇంతకాలం ఆయన తమిళనాడులోని కక్ష్యాపూరిత రాజకీయాలకు భయపడి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం అలా శాసించగలిగిన వారు ఎవ్వరూ లేరు. కానీ రజనీ మాత్రం ఇంకా అమ్మపై ఉన్న సెంటిమెంట్‌ వల్ల తన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాడంటున్నారు. ఆయనది కూడా చంచల మనస్తత్వం. ఏ నిర్ణయం గట్టిగా తీసుకోలేడు. ఇక బిజెపి అగ్రనాయకులు కూడా రజనీ నాన్చుడు ధోరణి నచ్చక, ఇక బతిమాలేది లేదని ఖండితంగా చెప్పారట. రజనీ ఉద్దేశ్యంలో రాజకీయాలలోకి ఎంటర్‌ అవ్వాలనే ఉద్దేశ్యం ఉన్నా, ఆయన అమ్మ సెంటిమెంట్‌ తగ్గేదాకా అంటే కనీసం మరో ఏడాది తర్వాతే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన బిజెపి ద్వారా ఎంట్రీ ఇవ్వడం తమిళనాడులో తనకు ఉన్న పేరును చెడగొడుతుందని భావించి, పాలిటిక్స్‌లోకి రాదలుచుకుంటే అది కేవలం కొత్త ప్రాంతీయ పార్టీ ద్వారానే వస్తాడని అంటున్నారు. ఇలా రజనీ ఆలోచించడంలో కూడా వాస్తవం ఉందనే ఒప్పుకోవాలి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement