Advertisement

కేసీఆర్‌తో చంద్రబాబును పోల్చడం తగదు!

Wed 04th May 2016 03:34 PM
kcr,chandrababu,tdp,trs,andhra pradesh,politics,kcr vs chandrababu  కేసీఆర్‌తో చంద్రబాబును పోల్చడం తగదు!
కేసీఆర్‌తో చంద్రబాబును పోల్చడం తగదు!
Advertisement

సమైక్య ఆంద్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌, బిజెపిలు కలిసికట్టుగా విడిగొట్టాయి. ఇక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో చంద్రబాబులు ముఖ్యమంత్రి పీఠాలను అధిరోహించారు. ఇప్పుడు ఈ ఇద్దరి పాలనపై అనేకమంది కుహనా రాజకీయ విశ్లేషకులు పోలికలు పెడుతూ... ఇద్దరి పాలనా విధానాలను పోలుస్తున్నారు. అసలు తెలంగాణ, ఏపీల మధ్య పోలిక తేవడమే పెద్ద తప్పు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ మిగులు బడ్జెట్‌తో ఉండగా, ఏపీ ఆర్దిక లోటుతో, రాజధాని కూడా లేకుండా బిత్తర చూపులు చూస్తోంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధను గాడిలో పెట్టడానికి, కేంద్రం నుండి అంతో ఇంతో నిధులు తెచ్చుకోవడంలో సఫలం అవుతూనే ఉన్నాడు. తెలంగాణతో పోటీ పడి మరీ సంక్షేమ, అభివృధ్ది పథకాలపై దృష్టి పెడుతున్నారు. అసలు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి నుండి ఎలాగోలా రాష్ట్రాన్ని అభివృద్దిపథంలో నడిపిస్తున్నాడు. కానీ ఈ విషయాన్ని మరిచిన కొందరు కేసీఆర్‌లా చంద్రబాబు పాలన చేయలేకపోతున్నాడనే అంశాన్ని లేవనెత్తుతున్నారు. 

ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు టిఆర్‌ఎస్‌ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీలో మరింత చిన్న ప్రాంతీయపార్టీ. వారికి ఇటు ఏపీతో కానీ, ఇతర రాష్ట్రాలతో గానీ పనిలేదు. కేవలం తెలంగాణ కోసమే ఆ పార్టీ పాటుపడే పార్టీ, కానీ టిడిపి అలా కాదు. అది తెలుగు ప్రజలందరికీ చెందిన పార్టీ. ఆ విషయంలో టిడిపి ఏపీతో పాటు తెలంగాణలో కూడా తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇక ఏపీలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అవుతోంది. దాంతో వారు తెలంగాణ విషయంలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ వారి అక్రమ ప్రాజెక్ట్‌లను ఆపాలని, కేసీఆర్‌ను ఎదిరించాలని హెచ్చరికలు చేస్తున్నారు. కానీ టిడిపికి ఏపీ ఎంత ముఖ్యమో తెలంగాణ కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో టిడిపికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా మన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక ఆపరేషన్‌ ఆకర్ష్‌ విషయానికి వస్తే తెలంగాణలో టిడిపిని, కాంగ్రెస్‌ను, వైయస్సార్‌సీపీని భూస్దాపితం చేయాలని కేసీఆర్‌ కంకణం కట్టుకున్నాడు. అక్కడ కేసీఆర్‌ విపక్షాల నుండి వలసలను ప్రోత్సహిస్తే అది కేసీఆర్‌ వ్యూహచతురత అని మన వారే పొగుడుతున్నారు. అదే పనిని ఏపీలో చంద్రబాబు చేస్తే ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయంలో టిడిపిది రెండు కళ్ల సిద్దాంతం అనేది మర్చి, తాము కూడా రెండు కళ్ల సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణలో కేసీఆర్‌ తన కుమార్తె, కుమారుడు, మేనల్లుడు.. ఇలా అందరికీ పదవులు ఇచ్చి కుటుంబ పాలన చేస్తుంటే విమర్శించే దమ్ములేని కొందరు ఏపీకి వచ్చేసరికి లోకేష్‌ విషయంలో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేయడం వారి రెండు నాల్కల ధోరణికి నిలువుటద్దం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement