Advertisement

సినీజోష్ రివ్యూ: హనుమాన్

Fri 12th Jan 2024 01:01 PM
hanuman movie review  సినీజోష్ రివ్యూ: హనుమాన్
Cinejosh HanuMan Movie Review సినీజోష్ రివ్యూ: హనుమాన్
Advertisement

సినీజోష్ రివ్యూ: హనుమాన్

బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌

నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను తదితరులు

ఎడిటింగ్: సాయిబాబు తలారి

స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే

సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర

సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్

నిర్మాత: కె. నిరంజన్ రెడ్డి

రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ 

సంక్రాంతి అంటే సినిమాకే ఓ సెలబ్రేషన్. సినిమా పరంగా ఈ మూడురోజుల పండుగ.. ఇయర్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే సంక్రాంతికి సినిమాని దింపేందుకు నిర్మాతలు ఆరాటపడుతుంటారు. ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ నుండి నాలుగు సినిమాలు పోటీలో ఉన్నాయి. అందులో మూడు సినిమాలు అగ్రహీరోలవి అయితే.. మరో చిత్రం ఇప్పుడిప్పుడే మీసం మొలుస్తోన్న కుర్ర హీరో తేజ సజ్జాది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై ఎలాంటి వార్తలు వినబడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా.. భారీ పోటీలోనూ ఈసారి సంక్రాంతి బరిలో వచ్చే తొలి చిత్రంగా అందరినీ ప్రిపేర్ చేసింది. అన్ని హర్డిల్స్ దాటుకుని అగ్ర హీరోలకు పోటీగా దిగింది. సూపర్ హీరో సినిమా అనే నేపథ్యం, దర్శకుడు ప్రశాంత్ వర్మ గత చిత్రాల ప్రభావం, సినిమా విడుదల విషయంలో ఇండస్ట్రీ తీరు, విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు వెరసీ, సినిమాకు కావాల్సినంత క్రేజ్‌, అదే టైమ్‌లో సింపతీ యాడ్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు బోనస్‌గా పెయిడ్ ప్రీమియర్స్‌కి వచ్చిన టాక్.. సినిమా ప్రేమికుడి మెదడులో ఈ సినిమాని కచ్చితంగా చూడాలనేంత థాట్‌కి దారితీశాయి. మరి అలాంటి ఆలోచనతో థియేటర్‌లోకి అడుగుపెట్టిన సినిమా ప్రేమికుడిని ఈ హనుమాన్ మ్యాజిక్ మెప్పించిందా? ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి వచ్చిన ఈ ప్రథమ ప్రయోగం సక్సెస్ అయిందా? అగ్రహీరోలకు ధీటుగా ఈ కుర్రహీరో బాక్సాఫీస్ వద్ద నిలబడగలడా? వంటి ప్రశ్నలకు ఈ సమీక్షలో సమాధానం తెలుసుకుందాం..

హనుమాన్ స్టోరీ రివ్యూ : 

అంజనాద్రి అనే ఊరిలో అల్లరిచిల్లరిగా తిరిగే హనుమంతు(తేజ సజ్జా).. అక్క అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) సంరక్షణలో పెరుగుతుంటాడు. హనుమంతుకి తన చిన్నప్పటి స్నేహితురాలు మీనాక్షి (అమృత అయ్యర్) అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యి ప్రేమగా మారుతుంది. ఆమెని ఓ ఆపద నుండి కాపాడే క్రమంలో హనుమంతు తీవ్రంగా గాయపడి నీళ్లలో పడిపోతాడు. ఆ నీళ్లల్లో అతడికి ఆంజనేయుని రక్తబిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది. ఆ రుధిరమణి హనుమంతు చేతికి వచ్చిన తర్వాత హనుమంతు జీవితం ఎలా మారింది? ఆ రుధిరమణి బ్యాక్‌డ్రాప్ ఏంటి? అదే సమయంలో చిన్నప్పటి నుండి సూపర్ హీరో అవ్వాలని కలలు కంటూ.. ఎన్నో ప్రయోగాలు చేస్తున్న మైఖేల్ (వినయ్ రాయ్)కు రుధిరమణి విషయం ఎలా తెలిసింది? దాని కోసం మైఖేల్ ఏం చేశాడు? మైఖేల్ నుండి వచ్చిన ముప్పుని హనుమంతు ఎలా ఎదుర్కొన్నాడు? రామాయణంలో రాములోరికి సహయం చేసిన విభీషణుడు (సముద్రఖని) పాత్ర.. ఈ హనుమాన్‌లో హనుమంతుకి ఎలాంటి సహాయం చేసింది? ఈ ప్రశ్నలన్నింటికీ గూజ్‌బంప్స్ తెప్పించే స్క్రీన్‌ప్లే‌తో అల్లిన సమాహారమే ఈ  హనుమన్ కథ.

హనుమాన్ స్క్రీన్‌ప్లే‌: 

ఈ కథకి స్క్రీన్‌ప్లే చాలా బలంగా నిలిచింది. టైటిల్ కార్డ్స్ నుండే ప్రేక్షకుడికి కథని పరిచయం చేసేలా స్ర్కీన్‌ప్లేని సెట్ చేశారు. రుధిరమణికి సంబంధించిన విశేషాలతో ప్రారంభించి.. దానికున్న శక్తిని వివరించి, ఆ శక్తి కోసం తహతహలాడుతున్న విలన్ పాత్రని పరిచయం చేసిన తీరు.. సగటు ప్రేక్షకుడికి స్టార్టింగే మంచి ఫీల్‌ని ఇస్తుంది. సాధారణంగా ఇలాంటి సూపర్ హీరో సినిమాలకు పెద్దగా కథేం ఉండదు. ఆ ఉన్న కథని స్క్రీన్‌ప్లే‌తో చెప్పడంలోనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ప్రశాంత్ వర్మ అండ్ యూనిట్ విజయవంతమయ్యారనే చెప్పుకోవాలి. ఈ కథకి పురాణ ఇతిహాసాలని జోడించిన తీరు అందరినీ కథలో లీనమయ్యేలా చేస్తుంది. సూపర్ పవర్స్ వచ్చిన హీరో.. అంజనాద్రిలో ఆ తర్వాత చేసే పనులన్నీ సరదాగా అనిపిస్తాయి. ఆ సరదా సన్నివేశాల నడుస్తుండగానే.. విలన్‌ని అంజనాద్రిలో ప్రవేశపెట్టి సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని కలిగించారు. ఇక సెకండాఫ్‌లో గ్రాఫ్ పడిపోకుండా.. గూజ్‌బంప్స్ సీన్లతో నడిపించి చివరి 20 నిమిషాలు చూపుతిప్పుకోలేనంత ఆసక్తిగా కథని నడిపించారు. అలాగే రెండో పార్ట్‌‌ జై హనుమాన్ అంటూ ఇచ్చిన లీడ్ కూడా.. ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందా? అని వేచి చూసేలా చేస్తుంది.

హనుమాన్ ఎఫర్ట్స్: 

బాలనటుడిగా బోలెడంత అనుభవం ఉన్నా.. హీరోగా తేజా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. అడుగులు నేర్చుకుంటున్న ఈ హీరో.. సూపర్ హీరో అయ్యే ప్రయత్నం కోసం ఎంతగా ప్రయత్నించాలో అంతా ప్రయత్నించాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరిచిల్లరిగా తిరిగే హనుమంతు పాత్రకి, సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత మారే హనుమాన్ పాత్రకి తేజ సజ్జా పెట్టిన ఎఫర్ట్స్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. యాక్షన్, ఎమోషన్స్ అన్ని చక్కగా కనబరిచి నటుడిగా మరో మెట్టు ఎక్కానని అనిపించుకున్నాడు. కథలో కీలకమైన ఓ పాత్ర అమృత అయ్యర్‌కి దక్కింది. అలాగే ఆమె అందంగానూ కనిపించి సినిమాకు కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోకి అక్కగా చక్కగా సెట్ అయింది. కాకపోతే ఆమె పలికే డైలాగ్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వరలక్ష్మీ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. విలన్‌గా చేసిన వినయ్ రాయ్ ఎఫర్ట్స్‌ని మెచ్చుకోవాలి. స్టైలిష్ విలన్‌గా వినయ్ రాయ్‌ మరోసారి తన మార్క్ ప్రదర్శించాడు. ఇక అనుభవశాలి, ఈ హనుమాన్‌కి మార్గశీలి అయిన పాత్రలో సముద్రఖని తన అనుభవాన్ని రంగరించాడు. ఆయనకిది ప్రత్యేక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర పాత్రలలో చేసిన వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సత్య వంటి వారంతా తమ పాత్రల పరిధిమేర ఈ సినిమాకు తమ ఎఫర్ట్ పెట్టారు.

ఈ సినిమాకు సాంకేతిక అంశాలన్నీ ప్లస్ అయ్యాయని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా విఎఫ్‌ఎక్స్ ఈ మధ్య వచ్చిన ఓ రాములోరి సినిమాలో డామినేట్ చేసినట్లుగా కాకుండా.. క్వాలిటీగా కనిపించాయి. అలాగే సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన హైలెట్. దాశరథి శివేంద్ర ఎఫర్ట్‌ని కచ్చితంగా మెచ్చుకోవాలి. అలాగే ముగ్గురు సంగీత దర్శకులు ఈ సినిమాకు పని చేశారు. ముగ్గురూ తమ ప్రతిభను కనబరిచారు. ఇక ఎడిటింగ్ విషయంలో మాత్రం ఫస్టాఫ్‌లో ఇంకాస్త స్పీడ్ పెంచితే బాగుండేది. ప్రతి పాత్రని పరిచయం చేసిన తీరు.. నత్తనడకలా సినిమా సాగుతుందనే ఫీల్‌ని ఇస్తుంది. సినిమాకు అవసరమైన మేరకు ఖర్చుపెట్టి.. ఇండస్ట్రీలోని చాలా మందికి.. తక్కువ బడ్జెట్‌తో కూడా ఇలాంటి క్వాలిటీ అవుట్‌ఫుట్ ఇవ్వవచ్చనేలా నిర్మాణ విలువలు ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. వర్త్ వర్మ వర్త్ అని అనిపించుకున్నాడు. పురాణ ఇతిహాసాలను టచ్ చేస్తూ.. తెలుగులో ఓ సూపర్ హీరోని తయారు చేసే క్రమంలో ప్రశాంత్ వర్మ ఫుల్ మార్క్స్ వేయించుకున్నాడు. చిన్నపిల్లాడిలా కనిపించే వర్మ.. మొదటి నుండి చిన్నపిల్లలనే టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఈ హనుమాన్ విషయంలో కూడా వర్మ తన పంథాని కొనసాగించాడు. తక్కువ బడ్జెట్‌తో అత్యద్భుతమైన అవుట్‌ఫుట్ ఇచ్చి.. శభాష్ అనిపించుకున్నాడు.

హనుమాన్ ఎనాలిసిస్: 

హాలీవుడ్‌లో కనిపించే సూపర్ హీరోల గురించి అందరికీ తెలుసు. సూపర్ హీరోలకు కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్‌ని దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో వారు ధ్వంసానికి పూనుకోవడం వంటివి ప్రధానాంశంగా ఉంటాయి. అలాంటి వారికి ఆ శక్తులు దొరకకుండా, లేదంటే వారి బారి నుండి సామాన్యులని, ఇంకా ఇతర శక్తులు ఉన్నవారిని ఈ సూపర్ హీరోలు ఎలా రక్షించారనేదే సూపర్ హీరోల చిత్రాలలో మెయిన్ కథాంశంగా ఉంటుంది. ఈ హనుమాన్‌లో కూడా దాదాపు అలాంటి కథే ఉంటుంది. కాకపోతే.. దానిని మన పురాణ ఇతిహాసాలతో, మనం చిన్నప్పటి నుండి విన్న కథతో లింక్ చేస్తూ.. ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్ కథని సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నుకున్న, ఎంచుకున్న పాత్రలన్నీ కన్విన్సెంగ్‌గానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారతీయులు గర్వపడే, ఆరాధించే, అభిమానించే హీరో అయిన హనుమంతుడిని సూపర్ హీరో‌గా చూపించాలనుకునే థాట్‌తోనే ప్రశాంత్ వర్మ సగం సక్సెస్ కొట్టాడు. అంజనాద్రి, రుధిరమణి, అంజమ్మ ఇలాంటి పేర్లన్నీ ఆ హనుమంతులోరి గాథలో వినిపిస్తూనే ఉంటాయి. అక్కడక్కడ కాస్త లాగింగ్ అనిపించినా.. గూజ్‌బంప్స్ తెప్పించేలా కొన్ని సీన్లు, రవితేజ వాయిస్ ఓవర్, తేజ నటన, విఎఫ్‌ఎక్స్, క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. అయోధ్య రామమందిర ప్రారంభం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా అయితే.. ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ రీసౌండ్ చేసే చిత్రంగా హనుమాన్ నిలబడటం మాత్రం తధ్యం. 

సినీజోష్ ట్యాగ్‌లైన్: సంక్రాంతి సంజీవని

సినీజోష్ రేటింగ్: 3/5

Cinejosh HanuMan Movie Review :

Tollywood First Super Hero Film HanuMan Review and Rating

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement