Advertisement

సినీజోష్ రివ్యూ : వీరసింహారెడ్డి

Sat 21st Jan 2023 11:43 AM
veera simha reddy telugu review  సినీజోష్  రివ్యూ : వీరసింహారెడ్డి
Veera Simha Reddy Review సినీజోష్ రివ్యూ : వీరసింహారెడ్డి
Advertisement

సినీ తారగా విలన్లనే కాదు.. విపత్తులను సైతం సవాల్ చేసే సత్తా, సామర్ధ్యం తన సొంతమని చాటుతూ కరోనా కల్లోలాన్ని పల్లంవైపు మళ్లించిన అఖండ విజయంతో తన కెరీర్ బెస్ట్ ఫేజ్ లోకి ఎంటర్ అయిన నందమూరి నటసింహం బాలయ్య ఇక తన వేగం అన్ స్టాపబుల్ అంటూ అందర్నీ అలరించే షో మ్యాన్ అయ్యారు. ఇన్ ఫ్యాక్ట్ తెలుగు వారందరి ఫామిలీ పర్సన్ గా మారారు. మరీ నేపథ్యంలో మళ్ళీ నందమూరి నటసింహం విజృంభణని ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తామా అంటూ ఉవ్విళ్లూరుతోన్న అభిమాన వీక్షకుల నిరీక్షణకు తెరదించుతూ నేడు విచ్చేశాడు వీరసింహారెడ్డి. క్రాక్ తో సూపర్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని తన అభిమాన కథానాయకుడైన బాలకృష్ణ చెంతకు చేరడం, విలక్షణమైన కథాంశాలను ఎంచుకుని విషయమున్న సినిమాలు చేస్తారనే మైటీ గుడ్ విల్ పొందిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ యాడ్ అవడంతో వీరసింహారెడ్డి పై అంచనాలు ఆరంభం నుంచే భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే సినిమా ఫస్ట్ లుక్ నుండి, టీజర్, టైటిల్, ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్నీ ఆ పాజిటివ్ బజ్ ను కంటిన్యూ చేశాయి. చిత్రం విడుదల సమయానికి అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనకి నప్పే, ప్రేక్షకులకు తను నచ్చే, మెచ్చే పాత్రలో వీరసింహారెడ్డి గా పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేసిన బాలయ్య స్క్రీన్ పై సృష్టించిన విధ్వంసం, సాగించిన వీరవిహారం ఎలా ఉందో సమీక్ష లో చూద్దాం.!

వీరసింహారెడ్డి స్టోరీ రివ్యూ : టర్కీ, ఇస్తాంబుల్ లో రాయలసీమ రెస్టారెంట్ రన్ చేసే మీనాక్షి (హనీ రోజ్) ఆవిడ కొడుకు జై సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ) ల పరిచయం తో ప్రారంభమయ్యే కథ రాయలసీమ కి పెద్ద దిక్కులా ఉండే పులిచెర్ల కి చెందిన వీరసింహారెడ్డి (నందమూరి బాలకృష్ణ) మీదకి షిఫ్ట్ అవుతుంది. మొసళ్ళమడుగు కి చెందిన ప్రతాప రెడ్డి (దునియా విజయ్) ఆయన భార్య భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) వీర సింహా రెడ్డి ని చంపడానికి చేయని ప్రయత్నం ఉండదు. బలం, బలగం, రాజకీయం ఎన్ని అస్త్రాలు వాడినా వీర సింహా రెడ్డి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోతారు. చివరికి వీరసింహారెడ్డి బెంగుళూరు వెళుతున్న విషయం తెలుసుకుని అధికారాన్ని, అనుచరగణాన్ని అడ్డం పెట్టుకుని అంతమొందించాలని చూస్తారు. కానీ మీనాక్షి పిలుపు మేరకు వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వెళ్తాడు. అక్కడ తన కొడుకు జై కి ఈషా (శ్రుతి హాసన్) కి పెళ్ళి సంబంధం మాట్లాడటానికి వెళ్లిన వీరసింహారెడ్డి కి ఏం ఎదురయ్యింది,  ప్రతాప రెడ్డి,  భానుమతి లకు ఆయనతో శతృత్వం ఎందుకు,  వీరసింహారెడ్డితో మీనాక్షి ఎడబాటుకి కారణం - తండ్రి తాపత్రయం అర్ధం చేసుకుని తనయుడు చేసే రణం ఏంటి అనే అంశాలే పూర్తి కథ. కథగా ఇది కొత్తది అనే చెప్పలేం. అలాగని ఈ ప్రయత్నాన్ని తప్పు పట్టలేం. గాడ్ ఆఫ్ మాసెస్ అనిపించుకునే బాలకృష్ణ వంటి హ్యూజ్ స్టార్ ని గ్రాండ్ గా తెరపైన చూపించే అటెంప్ట్ చేసాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇందులో కథ పలుచగా ఉండొచ్చు - హీరోయిజం ప్రతాపం చూపిస్తుంది. ఎలివేషన్స్ ఎక్కువ ఉండొచ్చు - ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. స్లో మోషన్ షాట్స్ ఓవర్ అయ్యుండొచ్చు - ఫాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుంది. వయొలెన్స్ ఓవర్ ది బోర్డు వెళ్ళుండొచ్చు - ఓవరాల్ గా మాస్ కి కనెక్ట్ అవ్వుద్ది. ఇప్పుడిక వీరసింహారెడ్డి కథనంలో జరిగిన మేజర్ మిస్టేక్స్ ఏంటో.. అవుట్ ఫుట్ వైజ్ జరిగిన అవకతవకలేంటో స్క్రీన్ ప్లే చాప్టర్ లో చర్చించుకుందాం. 

వీరసింహారెడ్డి స్క్రీన్ ప్లే రివ్యూ : ముందుగా ఈ చిత్రంలో కథనం పరంగా కనిపించే లోపాలేమిటో చెప్పేసుకుందాం. ఆపై సర్దుకుపోగలిగే సరుకేంటో సమీక్షించుకుందాం. ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నీ చాలా అంటే చాలా గ్రాంటెడ్ గా తీసేసుకున్న దర్శకుడు తెరపై జై పాత్రలో బాలయ్యే కనిపిస్తున్నా.. ఎంటర్ టైన్ చేసే ప్రాసెస్ లో శృతి హాసన్ ఎక్స్ పోజ్ చేస్తున్నా కూడా ఆడియన్స్ భారంగా భరిస్తున్నారంటే అది కథన లోపమే.. ఆయా సన్నివేశాల పాపమే.! ఒక్కసారి వీరసింహారెడ్డి పాత్ర తెరపైకి రాగానే ఊపందుకునే కథనం ఇక జనం చూపుని తిప్పుకోనివ్వదు.. వేరే ఏ డిస్ట్రబెన్స్ నీ ఒప్పుకోనివ్వదు. కానీ అక్కడే మరొక్క తప్పటడుగు వేసేసిన గోపీచంద్ ఇంటర్వెల్ బ్యాంగ్ కి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చేందుకై వీరసింహారెడ్డి పాత్రని ట్రీట్ చేసిన విధానం అభిమానులకే కాదు.. సగటు ప్రేక్షకులకి కూడా రుచించదు. సహించదు. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్టు ఈ కథేం కొత్తది కాకపోయినా కథనంలో  చేసిన కొత్త ప్రయత్నాలే సో కాల్డ్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ కి అడ్డంకులుగా మారాయి. విషం తీసుకుని అపస్మారక స్థితిలో ఉన్న సమరసింహారెడ్డి గతం జనాన్ని గడగడలాడించింది. తానే కాపాడుకుంటూ వస్తోన్న అమ్మాయి కత్తితో పొడిచేసిన సింహాద్రి గతం వీక్షకులని ఉర్రూతలూగించింది. కానీ ఈ కథలో వీరసింహారెడ్డి పాత్రని డైరెక్టర్ ట్రీట్ చేసిన స్టైల్, లాగ్ చేసిన సీన్స్ ఇరిటేషన్ తెప్పించడంతో పాటు ఇంట్రెస్టింగ్ గా అనిపించాల్సిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై ఆసక్తిని తగ్గించేస్తుంది. ఆ కారణం చేతనే విషయమున్న వీరసింహ గతం వీక్ అనే కామెంట్స్ కి కారణంగా మారిపోతుంది. 

వీరసింహారెడ్డి ఎఫర్ట్స్: పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ ముందైనా వినిపించే స్లోగన్ అని తన పేరు తాలూకు పవర్ ని బాహాటంగా, ఘనంగా చాటి చెప్పగలిగే బాలయ్య సినిమా థియేటర్స్ లో షో బిగినింగ్ కి పదినిమిషాల ముందునుంచే అదే స్లోగన్ సైరన్ మోత మోగిపోతుందంటే కారణం ఏమిటో.. మరోసారి తన ఎలక్ట్రి ఫయింగ్ పెరఫార్మెన్స్ తో ఎగ్జామ్పుల్ ఇచ్చాడు వీరసింహారెడ్డిగా నందమూరి నటసింహం. వీరసింహారెడ్డి పాత్రలో రెండు యాంగిల్స్ ఉంటాయి. చుట్ట కాలుస్తాడు, సిగరెట్ పీలుస్తాడు. ఆవేశం ప్రదర్శిస్తాడు, అనుబంధాన్ని చూపిస్తాడు. రెండు కోణాల్లో సాటిలేని మేటి అభినయాన్ని ప్రదర్శించే బాలయ్యని చూడడానికి అభిమానుల రెండు కళ్ళు చాలవు. ఫస్ట్ హాఫ్ లో మినిస్టర్ మీటింగ్ లో అభివృద్ధి గురించి, రాయలసీమ గొప్పదనం గురించి వచ్చే డైలాగులు, సెకండ్ హాఫ్ లో రిజిస్టర్ ఆఫీస్ ఫైట్ లో వచ్చే డైలాగులు బాలయ్యకి మాత్రమే సాధ్యం అనేలా ఉన్నాయి. అటు ఫైట్స్ లో ఇటు డాన్స్ లో తనదైన శైలిలో చెలరేగిపోయిన బాలయ్య ఎమోషనల్ థింగ్స్ లో అనుభవరీత్యా వచ్చిన అద్భుత ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. 

శృతి హాసన్ వినోదం పంచే ప్రయత్నంలో వీక్షకులకు గ్లామర్ డోస్ అందించింది. కేరెక్టర్ వైజ్ స్కోప్ లేకపోయినా సాంగ్స్ లో మాత్రం బాలయ్యకి సరిసాటిగా నిలిచింది. వరలక్ష్మి శరత్ కుమార్ చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో చిక్కిన అవకాశాన్ని సరిగ్గా దక్కించుకుంది, లెక్కకు మిక్కిలి ప్రశంశలు అందేలా ప్రతిభని ప్రదర్శించింది. హానీ రోజ్ పేరుకి తగ్గట్టే హానీలాంటి పాత్రలో రాణించింది. దునియా విజయ్ పాత్రకి దుక్కేంత దునియా లభించలేదు కానీ.. బాలయ్య వంటి పెద్ద స్టార్ సినిమాలో దక్కిన లక్కుని వాడుకునేలా వాడి చూపించాడు. సచిన్ ఖేద్కర్, మురళి శర్మ, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, రవి శంకర్, అజయ్ ఘోష్ తదితరులు తమ పాత్రల మేరకు న్యాయం చేసారు. 

ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ లు వీరసింహారెడ్డి వీరోచిత్వాన్ని ప్రదర్శించే పనిలో విపరీతమైన జోష్ చూపించేసారు. అలాగే లెంగ్త్ కూడా ఎక్కువ తీసుకున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ లో మొహమాటం చూపించాడు.. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ గా తన ఎక్సలెన్సీ ప్రదర్శించాడు. ఆర్ట్ డైరెక్టర్ సినిమాపై పెట్టిన ఖర్చుని స్క్రీన్ మీదకి తెచ్చాడు.. డాన్స్ డైరెక్టర్స్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గ మూమెంట్స్ ని కరెక్ట్ గా, కేలిక్యులేటెడ్ గా కంపోజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సెన్స్ ని తక్కువ వాడి డ్రమ్స్ ని ఎక్కువగా వాడాడా అనిపించేలా ఉంది BGM. పాటలు ఆకట్టుకునేలానే ఉన్నా వీరసింహరెడ్డి పాత్రని ప్రే చేస్తూ ఉండాల్సిన పాట జై బాలయ్యగా ఎందుకు వచ్చిందో, ఎలా తెచ్చారో సంగీత దర్శకుడే కాదు దర్శకుడు కూడా బాధ్యుడే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వంకలు వెతకలేం, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సాకులు చెప్పలేం. ఈ సినిమా తాలూకు ఏ చిన్న నెగిటివిటి అయినా ఆపాదించాల్సింది గోపీచంద్ కే.. ఆమోదించాల్సింది ఆయనే. NBK వంటి మాసెస్ట్ గాడ్ హీరోగా దొరికాక, మైత్రి మూవీ మేకర్స్ వంటి బిగ్గెస్ట్ బ్యానర్ అండగా చేరాక స్క్రిప్ట్ దశలో తీసుకోవాల్సిన సరైన జాగ్రత్తలు పాటించి ఉంటే.. ఈపాటికే ఇదే సినిమా రిజల్ట్ యునానమస్ బ్లాక్ బస్టర్ స్థాయిలో వినిపించి ఉండేది. టోటాలిటీ మిస్ అయిన గోపీచంద్ తొందరలోనే ఈ అంశంపై రియలైజ్ అవుతాడని ఆశిద్దాం.! 

వీరసింహారెడ్డి ఎనాలసిస్: వీరసింహారెడ్డి సినిమాకి సంబందించిన ఒక పెద్ద మైనస్ పాయింట్ ని, అలాగే అక్కడే ఉన్న ఓ బలమైన ప్లస్ పాయింట్ ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకుని తీరాలి. వ్యూవర్స్ అందరూ కామెంట్ చేసే రెగ్యులర్ రొటీన్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ప్యాకేజ్ వీరసింహారెడ్డి అనేది కాదనలేని మైనస్ పాయింట్. యట్ థిస్ సేమ్ టైమ్ అదే ప్యాకేజ్ కి నందమూరి నటసింహం నటవిశ్వరూపం ఏ ఒక్కరూ అభ్యర్ధన చెప్పలేని అత్యద్భుతమైన యాడెడ్ అడ్వాంటేజ్ అనడంలో సందేహం లేదు. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో మార్కెట్ లోకి ల్యాండ్ అయిన ఈ సినిమా ఏ రేంజ్ కి వెళుతుంది అనేది రాబోయే రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. కానీ వీరసింహారెడ్డిగా బాలయ్య చూపించిన అభినయం మాత్రం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. 

పంచ్ లైన్: వీరసింహారెడ్డి-సంక్రాంతికి వెలిగిన చిచ్చుబుడ్డి 

రేటింగ్: 2.75/5

Veera Simha Reddy Review:

Veera Simha Reddy Movie Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement