Advertisement

సినీజోష్‌ రివ్యూ: యాత్ర

Fri 08th Feb 2019 09:54 PM
telugu movie yatra,yatra movie review,mammotty in yatra,yatra movie review in cinejosh,yatra movie cinejosh review,ysr biopic yatra  సినీజోష్‌ రివ్యూ: యాత్ర
telugu movie yatra review సినీజోష్‌ రివ్యూ: యాత్ర
సినీజోష్‌ రివ్యూ: యాత్ర Rating: 2.5 / 5
Advertisement

70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

యాత్ర 

తారాగణం: మమ్ముట్టి, జగపతిబాబు, రావు రమేష్‌, సుహాసిని, వినోద్‌కుమార్‌, తోటపల్లి మధు, సచిన్‌ ఖేడేకర్‌, ఆశ్రిత వేముగంటి, పోసాని కృష్ణమురళి తదితరులు 

సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌ 

ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌ 

సంగీతం: కె 

నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి 

రచన, దర్శకత్వం: మహి వి. రాఘవ్‌ 

విడుదల తేదీ: 08.02.2019 

ఈమధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా బయోపిక్‌ల జోరు పెరిగింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖుల జీవిత కథలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు కారణం కొన్ని బయోపిక్‌లు ప్రేక్షకాదరణ పొందడమే. అయితే ఈ బయోపిక్‌లలో వాస్తవంగా జరిగిన సంఘటనల కంటే కొన్ని కల్పితాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు దర్శకులు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లన్నీ అదే దారిలో వెళ్ళాయి. ఈ శుక్రవారం విడుదలైన యాత్ర కూడా దానికి మినహాయింపు కాదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానంలోని కొంత భాగాన్ని తీసుకొని యాత్ర చిత్రాన్ని తెరకెక్కించారు. వైఎస్‌ఆర్‌ పాత్రలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్‌ ఈ సినిమాను ఏ ఉద్దేశంతో రూపొందించారు? ఈ సినిమా ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమా వల్ల ఎవరికి ప్రయోజనం వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

30 సంవత్సరాలపాటు తిరుగులేని రాజకీయ నాయకుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్న వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి అవ్వాలనేది లక్ష్యం. అతని తండ్రి రాజారెడ్డి కల కూడా అదే. ఆ దిశలోనే ఎన్నో ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి పదవి వైఎస్‌ఆర్‌ని వరించలేదు. 2003లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముందస్తు ఎన్నికల్ని ప్రకటించింది. అప్పటికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అన్నివిధాలుగా బలహీనంగా ఉంది. దాంతో అధికార పార్టీతో ఎన్నికల్లో పోటీపడే సత్తా పార్టీకి లేదనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయం. అదే అభిప్రాయం వై.ఎస్‌.ఆర్‌కి కూడా ఉంది. అలాంటి సయమంలో ఎన్నికల్లో పోటీ చేయాలా లేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలకాలా? అనే సందిగ్ధంలో ఉన్న వైఎస్‌ఆర్‌ను ప్రజల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పోరాటం వైపే నడిపిస్తాయి. తమకు ఏం కావాలో ఆలోచించుకుంటున్నాం కానీ, ప్రజలకి ఏం కావాలనేది ఏ నాయకుడూ ఆలోచించడం లేదని గ్రహించిన వైఎస్‌ఆర్‌ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలనుకుంటాడు. అలా పాద యాత్రకు శ్రీకారం చుడతాడు. చేవెళ్ళ నుంచి పాదయాత్ర ప్రారంభించి ప్రతి గడపకూ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటాడు. ఈ పాదయాత్రకు అధిష్టానం నుంచి అనుమతి లేకపోయినా తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఆ పాద యాత్రలో వైఎస్‌ఆర్‌కి ఎదురైన అనుభవాలు ఏమిటి? ప్రజల్లోకి వెళ్లి ప్రజల మనిషిగా వారి సాధకబాధకాలను ఎలా తెలుసుకున్నాడు? వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనుకున్నాడు? అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి తేవాలనుకున్నాడు? ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? హెలికాప్టర్‌ ప్రమాదంలో ఎలా ప్రాణాలు కోల్పోయాడు అనేది మిగతా కథ. 

మమ్ముట్టి గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతను పరిపూర్ణ నటుడు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి ఆ పాత్రకు అందం తెచ్చే సహజనటుడు. వైఎస్‌ఆర్‌ పాత్రలోనూ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. వైఎస్‌ఆర్‌ హావభావాలు, నడక, మాటతీరు, అభివాదం చేసే విధానం యథాతథంగా చూపించే ప్రయత్నం చేశాడు. డబ్బింగ్‌ కూడా తనే చెప్పుకోవడం వల్ల ఆ పాత్రకు మరింత హుందాతనం వచ్చింది. కెవిపిగా రావు రమేష్‌ కూడా సహజంగా కనిపించాడు. సూరీడు పాత్ర చేసిన నటుడు అచ్చంగా సూరీడులాగే ఉన్నాడు. వి.హనుమంతరావు పాత్రకు న్యాయం చేసేందుకు తోటపల్లి మధు ఎంతో కృషి చేశాడు. మిగతా పాత్రలు పోషించిన నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పుకోవాల్సి వస్తే సత్యన్‌ సూర్యన్‌ ఫోటోగ్రఫీ ఎంతో సహజంగా ఉంది. ఎలాంటి హంగూ హడావిడీ లేకుండా నీట్‌గా తన పని చేశాడు. కె అందించిన సంగీతం కూడా సినిమాకి కొంతవరకు ప్లస్‌ అయింది. కొన్ని సిట్యుయేషన్‌ పరంగా వచ్చే పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఫర్వాలేదు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఇక డైరెక్టర్‌ మహి వి. రాఘవ్‌ గురించి చెప్పాలంటే ఈ బయోపిక్‌లో వైఎస్‌ఆర్‌ రాజకీయ జీవితంలోని పాద యాత్రను మాత్రమే కథా వస్తువుగా తీసుకోవడం వల్ల సగటు ప్రేక్షకుడు ఆశించే అంశాలను పొందుపరచలేకపోయాడు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి బయోపిక్‌ అనగానే ఆయన జీవితంలోని అన్ని కోణాలు సినిమాలో ఉంటాయని ఆశించే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ఎందుకంటే సినిమా అంతా పాద యాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఓ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుందే తప్ప సినిమా అనే భావన ఎక్కడా కలగదు. సినిమా ఆద్యంతం వైఎస్‌ఆర్‌కి సంబంధించిన పాజిటివ్‌ అంశాలనే చూపించారు తప్ప నెగెటివ్‌ ఎలిమెంట్స్‌ జోలికి అస్సలు వెళ్ళలేదు. అయితే సొంత నిర్ణయాలు తీసుకోవడం, అధిష్టానం చెప్పిన మాట వినకపోవడం, తనకు ఏది మంచి అనిపిస్తే అది చేసెయ్యడం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇదిలా ఉంటే వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అంటే ఓ పవర్‌ఫుల్‌ లీడర్‌. ప్రతి పక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తన వాగ్ధాటితో ప్రత్యర్థుల్ని గడగడలాడించగల సమర్థుడు. కానీ, ఈ సినిమాలో ఏ ఒక్క సన్నివేశాన్ని కూడా ఆ కోణంలో చూపించే ప్రయత్నం చెయ్యలేదు. రాజశేఖరరెడ్డి ప్రత్యర్థి అయిన చంద్రబాబును ఒక్క సీన్‌లో కూడా చూపించకపోవడం, పూర్తిగా వైఎస్‌ఆర్‌ చేసిన మంచి పనులు, పాద యాత్రపైనే దృష్టి పెట్టడం వల్ల ఓ సాధారణ సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది తప్ప ఒక మహానాయకుడి బయోపిక్‌ చూస్తున్న అనుభూతి కలగదు. అలాగే పాద యాత్రకు సంబంధించిన ప్రతి సీన్‌ ఎంతో నెమ్మదిగా సాగుతుంది తప్ప ఏ దశలోనూ వేగం కనిపించదు. దీంతో సినిమా కాస్తా డాక్కుమెంటరీ రూపం దాల్చింది. అలాగే వైఎస్‌ఆర్‌ హెలికాప్టర్‌లో బయల్దేరడం, మధ్యలోనే సంబంధాలు తెగిపోయి ప్రమాదం జరగడం, ఆ వెంటనే ఆయన చనిపోయారని ప్రకటించడం, అభిమానులు దు:ఖంలో మునిగిపోవడం... ఇవన్నీ ఎంతో స్పీడ్‌గా జరిగిపోతాయి. దీంతో సినిమాని హడావిడిగా ముగించేశారనిపిస్తుంది. పాదయాత్రలో చూపించిన కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా అనిపించినా అవి సినిమాకి ఏమంత ప్లస్‌ అవ్వలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే పవర్‌ఫుల్‌ లీడర్‌ వైఎస్‌ఆర్‌ జీవితాన్ని అనుకున్నంత పవర్‌ఫుల్‌గా తెరకెక్కించలేదన్నది వాస్తవం. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో ఆయన చేసిన పాదయాత్ర ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తండ్రి మార్గంలోనే వై.ఎస్‌.జగన్‌ కూడా పాదయాత్ర చేస్తూ జనంలోకి వెళ్లడం... యాత్ర సినిమా కూడా అదే అంశంతో రూపొందడం వంటివి జగన్‌కి సానుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఫినిషింగ్‌ టచ్‌: వైఎస్‌ఆర్‌ విజయ యాత్ర

telugu movie yatra review:

YSR BIOPIC YATRA

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement