Advertisement

సినీజోష్‌ రివ్యూ: భలే మంచి చౌక బేరమ్‌

Sat 06th Oct 2018 02:07 PM
  సినీజోష్‌ రివ్యూ: భలే మంచి చౌక బేరమ్‌
bhale manchi chowka beram review సినీజోష్‌ రివ్యూ: భలే మంచి చౌక బేరమ్‌
సినీజోష్‌ రివ్యూ: భలే మంచి చౌక బేరమ్‌ Rating: 2.5 / 5
Advertisement

ఎరోల్ల గ్రూప్‌, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ 

భలే మంచి చౌక బేరమ్‌ 

తారాగణం: నవీద్‌, కేరింత నూకరాజు, రాజారవీంద్ర, యామిని భాస్కర్‌, ముజ్‌తబా అలీఖాన్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి. 

ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్దవ్‌ 

సంగీతం: హరి గౌర 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జె.బి. 

కాన్సెప్ట్‌: మారుతి 

కథ, మాటలు: రవి నంబూరి 

నిర్మాత: డా.ఎరోల్ల సతీష్‌కుమార్‌ 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీకృష్ణ ముడిదాని 

విడుదల తేదీ: 05.10.2018 

డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందిన సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవ ఉండదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలు విజయాలు సాధించాయి. దర్శకుడు మారుతి అలాంటి ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ భలే మంచి చౌక బేరమ్‌ చిత్రం కోసం అందించారు. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీద్‌, కేరింత నూకరాజు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది? డబ్బు అనే కాన్సెప్ట్‌ ఈసారి వర్కవుట్‌ అయిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. 

పార్థు(నవీద్‌), సలీమ్‌(కేరింత నూకరాజు) ఇద్దరూ ఫ్రెండ్స్‌. దుబాయ్‌ వెళ్లడానికి విలేజ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తారు. కానీ, తాము మీడియేటర్‌ చేతిలో మోసపోయామని తెలుసుకుంటారు. వెనక్కి వెళ్ళే ఉద్దేశం లేని ఇద్దరూ సిటీలోనే పార్థు క్యాబ్‌ డ్రైవర్‌గా, సలీమ్‌ కొరియర్‌ సర్వీస్‌లో పనిచేస్తుంటారు. కట్‌ చేస్తే డిఫెన్స్‌లో మేజర్‌గా పనిచేసిన రాజా రవీంద్ర దేశ రహస్యాలు పేరుతో ఒక ఫైల్‌ తయారు చేస్తాడు. ఆ ఫైల్‌ని అమ్మకానికి పెడతాడు. అనుకోకుండా ఆ ఫైల్‌ కొరియర్‌ బాయ్‌ అయిన సలీమ్‌కి దొరుకుతుంది. ఆ ఫైల్‌ని పాకిస్థాన్‌ టెర్రరిస్టుల ముందు అమ్మకానికి పెడతారు. 30 కోట్లకు బేరం కుదుర్చుకుంటారు. తను రాసిన ఫైల్‌ మిస్‌ అవడంతో మేజర్‌ కంగారు పడిపోతాడు. మొత్తానికి ఆ ఇద్దరు స్నేహితుల దగ్గర తన ఫైల్‌ ఉందని, 30 కోట్లకు డీల్‌ కుదిరిందని తెలుసుకొని ఆ మొత్తాన్ని వారితో కలిసి పంచుకోవడానికి సిద్ధపడతాడు. అలా ముగ్గురూ టెర్రరిస్టు స్థావరానికి చేరుకుంటారు. అక్కడ వారికి అసలు సమస్య మొదలవుతుంది? ఏమిటా సమస్య? కొన్ని కారణాల వల్ల ముగ్గురినీ తీవ్రవాదులు నిర్బంధిస్తారు. అసలు ఆ ఫైల్‌లో ఎలాంటి రహస్యాలు ఉన్నాయి? ఆ ముగ్గురూ ఎలా బయటపడ్డారు? అనేది మిగతా కథ. 

పార్థు పాత్రలో నవీద్‌ నటన ఫర్వాలేదు అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో అతని నటన నవ్వు తెప్పిస్తుంది. అలాగే సలీమ్‌ తండ్రిని హాస్పిటల్‌లో కలిసినపుడు అతని పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. ఇక ఎప్పుడూ చిరాగ్గా ఉండే సలీమ్‌ క్యారెక్టర్‌ని బాగా పండించాలన్న అత్యుత్సాహంలో ఆడియన్స్‌కి చిరాకు తెప్పించాడు నూకరాజు. ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్‌ అయ్యే సలీమ్‌ తన ప్రవర్తనతో ప్రేక్షకుల్ని ఇరిటేట్‌ చేస్తాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో అతని కామెడీ బాగానే పండింది. ఈమధ్యకాలంలో పూర్తి నిడివి ఉన్న పాత్రలో రాజారవీంద్ర నటించింది ఈ సినిమాలోనే. పార్థు, సలీమ్‌ ప్రవర్తనకు కన్‌ఫ్యూజ్‌ అవుతూ తను కూడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ముగ్గురూ కలిసి చేసిన చాలా సీన్స్‌ ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. టెర్రరిస్టు నాయకుడి పాత్రలో ముజ్‌తబా అలీఖాన్‌ నటన కూడా బాగుంది. హీరోయిన్‌గా నటించిన యామిని భాస్కర్‌ తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను గ్లామర్‌గా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించలేదు. 

ఈ సినిమాలో సాంకేతికంగా చెప్పుకోదగిన అంశాలు లేకపోయినప్పటికీ బాల్‌రెడ్డి అందించిన ఫోటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా అనిపించింది. అయితే విజువల్‌గా సినిమాలో ఎలాంటి వండర్స్‌ కనిపించవు. ప్రతి సీన్‌ చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. ఉద్దవ్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఫస్ట్‌హాఫ్‌ అంతా స్పీడ్‌గానే సాగుతుంది. సెకండాఫ్‌లో కొన్ని సాగతీత సన్నివేశాలున్నాయి. సినిమా నిడివి తక్కువే కాబట్టి ఎక్కువగా స్ట్రెయిన్‌ అయినట్టు ఉండదు. హరిగౌర చేసిన పాటల్లో ఒకటి, రెండు ఫర్వాలేదు అనిపించాయి. జె.బి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా బాగుంది. కొన్ని సీన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్లే బాగా హైలైట్‌ అయ్యాయి. ఇక దర్శకుడు మురళీకృష్ణ గురించి చెప్పాలంటే... ముందుగా కాన్సెప్ట్‌ గురించి, కథ, మాటల గురించి చెప్పాలి. మారుతి అందించిన కాన్సెప్ట్‌ కొత్తగానే ఉన్నా రవి నంబూరి రాసుకున్న కథ, మాటలు గొప్పగా అనిపించవు. కథలో నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందనే విషయం కొన్ని సందర్భాల్లో ముందుగానే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఈ కథను దర్శకుడు డీల్‌ చేసిన విధానం కూడా మామూలుగా వుంది. కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో గ్రిప్పింగ్‌ అనేది లోపించింది. పాకిస్థాన్‌ టెర్రరిస్టు నాయకుడ్ని చాలా సిల్లీగా చూపించేశాడు. టెర్రరిస్టుల ముందు సలీమ్‌ రెచ్చిపోయి మాట్లాడే సన్నివేశాలు ఆడియన్స్‌కి చిరాకు తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో పార్థు, సలీమ్‌, మేజర్‌లతో పాకిస్థాన్‌ జిందాబాద్‌ అనిపించేందుకు టెర్రరిస్టు నాయకుడు ప్రయత్నం చేస్తే మేజర్‌ మాత్రం హిందుస్థాన్‌ జిందాబాద్‌ అనే సీన్‌, దేశభక్తి గురించి పార్థు, సలీమ్‌లకు వివరించే సీన్‌ ఆకట్టుకుంటాయి. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. అయితే ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాల్లో ఎక్కువ ట్విస్టులు ఉంటే ఆడియన్స్‌ ఎక్కువ థ్రిల్‌ అవుతారు. ఈ సినిమాలో మాత్రం అలాంటివి ఒకటి, రెండు మినహా కనిపించవు. డైరెక్టర్‌ కాన్సెప్ట్‌ మీదే ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్‌ చేయడం వల్ల హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ ఎక్కువ సేపు నడిపించలేకపోయాడు. కామెడీ అక్కడక్కడా ఉన్నా యూత్‌ని ఆకట్టుకునే లవ్‌ సీన్స్‌ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. ఫైనల్‌గా చెప్పాలంటే భలే మంచి చౌక బేరమ్‌... డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ని ఇష్టపడేవారికి, ట్విస్టులను ఎంజాయ్‌ చేసేవారికి, కామెడీని ఆస్వాదించే వారికి నచ్చుతుంది. బి, సి సెంటర్లలో ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ఫినిషింగ్‌ టచ్‌: కాన్సెప్ట్‌ బేస్డ్‌ ఎంటర్‌టైనర్‌

bhale manchi chowka beram review:

telugu movie bhale manchi chowka beram review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement