Advertisement

సినీజోష్‌ రివ్యూ: కిరాక్‌ పార్టీ

Sat 17th Mar 2018 02:18 PM
telugu movie kiraak party review,nikhil new movie kiraak party,kiraak party movie review in cinejosh,kiraak party cinejosh review  సినీజోష్‌ రివ్యూ: కిరాక్‌ పార్టీ
kiraak party movie review సినీజోష్‌ రివ్యూ: కిరాక్‌ పార్టీ
సినీజోష్‌ రివ్యూ: కిరాక్‌ పార్టీ Rating: 2.75 / 5
Advertisement

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

కిరాక్‌ పార్టీ 

తారాగణం: నిఖిల్‌, సిమ్రాన్‌ పరింజ, సంయుక్త హెగ్డే, బ్రహ్మాజీ, రాకేందు మౌళి, సిజ్జు, కారుమంచి రఘు, హేమంత్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి 

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ 

సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌ 

కథ: రిషబ్‌ శెట్టి 

మాటలు: చందు మొండేటి 

స్క్రీన్‌ప్లే: సుధీర్‌వర్మ 

నిర్మాత: రామబ్రహ్మం సుంకర 

దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి 

విడుదల తేదీ: 16.03.2018 

ప్రతి మనిషి జీవితంలో కాలేజ్‌ రోజులు చాలా ముఖ్యమైనవి. స్నేహితులు, సరదాలు, చిన్న చిన్న గొడవలు, ప్రేమ వ్యవహారాలు, ఎమోషన్స్‌.. ఇలా అన్నీ కలగలిసి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి జ్ఞాపకాలను మరోసారి తెరపై ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే కిరాక్‌ పార్టీ చిత్రం. అయితే ఇంతకుముందే హ్యాపీడేస్‌, కొత్త బంగారులోకం, కేరింత వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. అయితే తాజాగా నిఖిల్‌ హీరోగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన కిరాక్‌ పార్టీ చిత్రంలో ప్రేక్షకులు కొత్తగా ఫీల్‌ అయ్యే అంశాలు, కాలేజీ రోజుల్లోని ఎవరూ టచ్‌ చేయని విషయాలు ఏమున్నాయి? కన్నడలో కిరిక్‌ పార్టీ పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయి 50 కోట్లు కలెక్ట్‌ చేసేంత కంటెంట్‌ సినిమాలో ఏముంది? ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు మన సినిమాల్లో చూసేసిన కాలేజీ లైఫ్‌ని ఈ శుక్రవారం విడుదలైన కిరాక్‌ పార్టీ చిత్రంతో యూత్‌ కనెక్ట్‌ అయ్యే రూపొందించడంలో దర్శకుడు ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

ఓ ఇంజనీరింగ్‌ కాలేజీకి ఫ్రెషర్స్‌గా వచ్చిన కృష్ణ(నిఖిల్‌) అతని ఫ్రెండ్స్‌కి రొటీన్‌గా ర్యాగింగ్‌ వంటివి ఎదురవుతాయి. తనకన్నా పెద్దదైనా లెక్చరర్‌ మీరా(సిమ్రాన్‌ పరింజా)తో ప్రేమలో పడతాడు కృష్ణ. ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. ఆమెకు నచ్చిన పనులు చేస్తూ ఆమె మనసును గెలుచుకుంటాడు. ఓరోజు హాస్టల్‌లోని ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొడుతూ ప్రమాదవశాత్తూ బిల్డింగ్‌ పైనుంచి పడి చనిపోతుంది మీరా. ఆమె పడిపోయిన వీడియో వైరల్‌గా మారుతుంది. మీరా గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆమె గురించి తప్పుగా మాట్లాడిన ఓ స్టూడెంట్‌ని చితకబాదుతాడు కృష్ణ. అప్పటివరకు అతనిలో కనిపించని ఓ కొత్త కోణం బయటికి వస్తుంది. కాలేజీలో సీనియర్‌ అయిపోయిన కృష్ణ కొత్తగా వచ్చేవారు ఎంత అల్లరి చేసినా అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడవద్దని, అలా చేస్తే తను సీరియస్‌గా తీసుకుంటానని అందరికీ వార్నింగ్‌ ఇస్తాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తనతో వున్న ఫ్రెండ్స్‌ కూడా అతనికి విరోధులుగా మారతారు. కాలేజీ ఎలక్షన్స్‌లో కృష్ణకు పోటీ అవుతారు. అన్నింటినీ అధిగమించి కాలేజీ ప్రెసిడెంట్‌గా గెలుస్తాడు. కృష్ణ. అతని లైఫ్‌లోకి జూనియర్‌ స్టూడెంట్‌ అయిన సత్య(సంయుక్త హెగ్డే) ఎంటర్‌ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ లైఫ్‌ ఎన్ని మలుపులు తిరిగింది? చనిపోయిన మీరా జ్ఞాపకాల నుంచి అతను బయటపడ్డాడా? విడిపోయిన స్నేహితులు మళ్ళీ కలుసుకున్నారా? సత్య ప్రేమను కృష్ణ యాక్సెప్ట్‌ చేశాడా? అనేది మిగతా కథ. 

ఫ్రెషర్‌గా, సీనియర్‌ స్టూడెంట్‌గా రెండు షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో నిఖిల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకుంటుంది. చిలిపి పనులు చేసే కుర్రాడిగా, తన జీవితంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ వల్ల పరివర్తన చెందిన మెచ్యూర్డ్‌ పర్సన్‌గా రెండు వేరియేషన్స్‌ని సమర్థవంతంగా పోషించాడు. మీరా క్యారెక్టర్‌లో సిమ్రాన్‌ తనవంతు నటనను ప్రదర్శించే ప్రయత్నం చేసింది. సెకండాఫ్‌లో కనిపించే సత్య పాత్రలో కనిపించే సంయుక్తా హెగ్డే కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేసినట్టు అనిపించినా ఫర్వాలేదు అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్‌ క్యారెక్టర్స్‌లో రాకేందుమౌళి, హేమంత్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మెకానిక్‌ పండుగా బ్రహ్మాజీ తనవంతు నవ్వించేందుకు ట్రై చేశాడు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. 

సాంకేతికంగా చూస్తే ఈ సినిమాలో ప్లస్‌ అనిపించేవి తక్కువగానే కనిపిస్తాయి. అద్వైత గురుమూర్తి ఫోటోగ్రఫీ చాలా సాదా సీదాగా ఉంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఎక్కడా అద్భుతం అనిపించే విజువల్స్‌ కనిపించవు. పాటలన్నీ సిట్యుయేషన్‌ పరంగా వచ్చేవే కావడంతో పాటల్లో కూడా అతని స్కిల్స్‌ కనిపించలేదు. ఒరిజినల్‌ వెర్షన్‌ కిరిక్‌పార్టీకి సంగీతం అందించిన అజనీష్‌ లోకనాథ్‌ తెలుగు వెర్షన్‌కి కూడా సంగీతం సమకూర్చాడు. పాటల పరంగా ఓకే అనిపించిన అజనీష్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో ఎక్కువ కేర్‌ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎం.ఆర్‌.వర్మ ఎడిటింగ్‌ బాగానే ఉన్నా 2 గంటల 25 నిమిషాల నిడివిని మరికాస్త తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ నార్మల్‌గా ఉన్నాయి. రిషబ్‌ శెట్టి రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయినా కన్నడలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఇలాంటి కథలతో తెలుగులో చాలా సినిమాలు వచ్చేశాయి కాబట్టి తెలుగు ప్రేక్షకులకు ఇందులో కొత్తదనం అనేది కనిపించదు. ఈ సినిమా ద్వారా పరిచయమైన శరణ్‌ కొప్పిశెట్టి ఆల్రెడీ ప్రూవ్‌ అయిన కథని తెలుగుకు అనుగుణంగా తెరకెక్కించడంలో దర్శకుడుగా సక్సెస్‌ అయ్యాడు. ఈ సినిమాకి చందు మొండేటి మాటలు, సుధీర్‌వర్మ స్క్రీన్‌ప్లే అంతగా ఉపయోగపడలేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో చెప్పుకోదగ్గ, గుర్తుంచుకోదగ్గ మాటలు లేవు. అలాగే స్క్రీన్‌ప్లేలో కూడా కొత్తదనం కనిపించదు. ఫస్ట్‌హాఫ్‌లో రెగ్యులర్‌గా కాలేజీలో ఉండే కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసిన దర్శకుడు కొన్ని సందర్భాల్లో అనవసరమైన కామెడీతో బలవంతంగా నవ్విస్తున్నాడా అనే డౌట్‌ కూడా వస్తుంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ కావడంతో చూసిన సీన్సే మళ్ళీ మళ్ళీ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అదే అల్లరి, అదే క్లాస్‌రూమ్‌ కామెడీ. ఇంటర్వెల్‌ సీన్‌లో చనిపోయిన హీరోయిన్‌ గురించి ఓ స్టూడెంట్‌ కామెంట్‌ చెయ్యడంతో రెచ్చిపోయిన హీరో అలాంటి వారికి సింహస్వప్నంలా మారతాడు. ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోయిన హీరో సెకండాఫ్‌లో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో, అమ్మాయిలను కామెంట్‌ చేసే వారికి ఎలా బుద్ధి చెబుతాడో అని ఎదురుచూసే ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. కాసేపు సీరియస్‌గా నడిచిన కథ మళ్ళీ ఫస్ట్‌హాఫ్‌ మాదిరిగానే కామెడీ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. స్టూడెంట్‌ లీడర్‌గా ఎలక్ట్‌ అయిన హీరో ఏం చెయ్యదలుచుకున్నాడు? అతని ఎయిమ్‌ ఏమిటి అనేది అర్థం కాదు. ఎంతసేపూ ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొట్టడం, సిగరెట్లు తాగడం, మధ్య మధ్యలో రెండో హీరోయిన్‌తో కొన్ని సీన్స్‌... ఇలా నడిచిపోతుంటుంది. ఫైనల్‌గా ఫేర్‌వెల్‌ ఫంక్షన్‌లో విడిపోయిన ఫ్రెండ్స్‌ అందరూ కలుసుకోవడం, ఓ పాట పాడుకోవడంతో సినిమా ముగుస్తుంది. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు మనం చూడని కొత్త సీన్స్‌ ఎక్కువగా కనిపించవు. చనిపోయిన మీరా ఓ సెక్స్‌ వర్కర్‌కి చేసిన సాయం, తనకు పుట్టిన అమ్మాయిని చదివించుకోలేని స్థితిలో ఉన్న ఆ సెక్స్‌వర్కర్‌కి 4 లక్షలు ఫిక్స్‌ డిపాజిట్‌ చేయించడం వంటి సీన్స్‌ హృదయానికి హత్తుకుంటాయి. మిగతా సినిమా అంతా రొటీనే. ఫైనల్‌గా చెప్పాలంటే కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చాలా చూసేసిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా రుచించకపోవచ్చు. ఇక టైటిల్‌ విషయానికి వస్తే కిరాక్‌ పార్టీ అనే టైటిల్‌కి, కథకి ఎలాంటి సంబంధం లేదు. సినిమాలో కిరాక్‌ అనిపించే పార్టీ ఒక్కటీ ఉండదు. అయితే తప్రస్తుతం కాలేజీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నవారికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. సినిమాలోని చాలా సీన్స్‌కి యూత్‌ కనెక్ట్‌ అవుతారు. కాలేజీలో తమకు రోజూ అనుభవంలోకి వచ్చే సంఘటనలనే స్క్రీన్‌పై చూస్తారు. ఓవరాల్‌గా కిరాక్‌ పార్టీ సినిమా మహా అద్భుతం కాకపోయినా ఏవరేజ్‌ సినిమా అనిపించుకుంటుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: కిరాక్‌ కాదు.. ఓకే పార్టీ.

kiraak party movie review:

telugu movie kiraak party 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement