Advertisement

సినీజోష్‌ రివ్యూ: ఎంసిఎ

Thu 21st Dec 2017 08:11 PM
telugu movie mca,mca movie review,mca movie review in cinejosh,mca movie cinejosh review,nani and saipallavi in mca,mca movie director sriram venu,dil raju new movie mca  సినీజోష్‌ రివ్యూ: ఎంసిఎ
mca movie review సినీజోష్‌ రివ్యూ: ఎంసిఎ
సినీజోష్‌ రివ్యూ: ఎంసిఎ Rating: 2.25 / 5
Advertisement

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ 

ఎంసిఎ 

తారాగణం: నాని, సాయిపల్లవి, భూమిక, రాజీవ్‌ కనకాల, నరేష్‌, పోసాని, వెన్నెల కిషోర్‌, శుభలేక సుధాకర్‌, విజయ్‌, ప్రియదర్శి, పవిత్ర లోకేష్‌, ఆమని తదితరులు 

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

నిర్మాతలు: రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ 

రచన, దర్శకత్వం: శ్రీరామ్‌ వేణు 

వరస హిట్‌లతో యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన నాని ఈసారి మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా మరో హిట్‌ కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఓ మై ఫ్రెండ్‌ అనే ఓ ఫ్లాప్‌ సినిమాని డైరెక్ట్‌ చేసిన వేణు శ్రీరామ్‌ ఎం.సి.ఎ.తో శ్రీరామ్‌ వేణుగా మారి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఓ మై ఫ్రెండ్‌ చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజే ఈ చిత్రాన్ని తన బేనర్‌లో చేశాడు. ఎంసిఎ అనే ఓ ఆసక్తికరమైన టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాలో ఫిదా ఫేం సాయిపల్లవి నటించడం సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమైంది. మిడిల్‌ క్లాస్‌ నేపథ్యం తీసుకున్న డైరెక్టర్‌ తన కథ, కథనాలతో ఎంతవరకు ఆకట్టుకున్నాడు? నానికి, దిల్‌రాజుకి ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్‌ అయింది? సాయిపల్లవి సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అయింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథగా చెప్పుకోవాలంటే ఇది సాదా సీదా కథ. ఓ మధ్య తరగతి కుటుంబం. అన్నయ్య, వదిన, బాబాయ్‌, పిన్ని.. వారి మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు, ఒకరి బాగు కోసం ఒకరు తమ సంతోషాల్ని త్యాగం చేసే మనస్తత్వాలు. ఇవి మనం చాలా సినిమాల్లో చూసేశాం. ఈ సినిమాలో విశేషం ఏమిటంటే వదిన, మరిది మధ్య నడిచే సన్నివేశాలు, జీవితంలో మరిది సెటిల్‌ అవ్వడానికి వదిన పడే తాపత్రయం కొత్తగా అనిపిస్తాయి. రాజీవ్‌, నాని అన్నదమ్ములు. ఇద్దరూ స్నేహితుల్లా ఎంతో ఎంజాయ్‌ చేస్తుంటారు. వారిద్దరి మధ్యలోకి వదిన జ్యోతి(భూమిక) వస్తుంది. దాంతో తమ్ముడ్ని పక్కన పెట్టి భార్యకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తుంటాడు రాజీవ్‌. ఇక అక్కడ ఉండలేక తన బాబాయ్‌ ఇంటికి వచ్చేస్తాడు నాని. ఓరోజు నానికి రాజీవ్‌ నుంచి పిలుపు వస్తుంది. ఆర్‌.టి.ఓ. ఆఫీసర్‌ అయిన జ్యోతికి వరంగల్‌ ట్రాన్స్‌ఫర్‌ అయిందని, ఆమెతోపాటు వరంగల్‌ వెళ్ళాలని రాజీవ్‌ చెప్తాడు. ఇష్టం లేకపోయినా అన్నయ్య కోసం వదినతోపాటు వరంగల్‌ వస్తాడు. ఇంటి పనులన్నీ నానితోనే చేయిస్తుంటుంది జ్యోతి. ఇది భరించలేని నాని బాబాయ్‌ ఇంటికి వెళ్లిపోదామని బయల్దేరతాడు. దారిలో పల్లవి(సాయిపల్లవి)ని చూసి ఆగిపోతాడు. సడన్‌గా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఐ లవ్‌యూ చెప్తుంది. దాంతో ఊరికి వెళ్ళే ఆలోచన మానుకొని పల్లవి కోసం వెతుకుతుంటాడు. పల్లవి తన వదిన చెల్లెలేనని తర్వాత తెలుస్తుంది. ఇదిలా వుంటే వరంగల్‌లో శివశక్తి ట్రావెల్స్‌ని రన్‌ చేసే శివ(విజయ్‌) అంటే సిటీలో అందరికీ భయమే. రూల్స్‌ని బ్రేక్‌ చేస్తూ, నిబంధనలు పాటించకుండా బస్సులు తిప్పుతుంటాడు. అలాంటి బస్సు నడిపించడం వల్ల 40 ప్రాణాలు కూడా కోల్పోతారు. బస్సుల్ని చెక్‌ చేసిన జ్యోతి రెండు బస్సులు సీజ్‌ చేస్తుంది. జ్యోతిని చంపుతానని బెదిరించిన శివకు దేహశుద్ది చేస్తాడు నాని. జ్యోతిపై పగ పెంచుకున్న శివ ఆమెను చంపడానికి డిసైడ్‌ అవుతాడు. ఇది తెలుసుకున్న నాని వదినకు తెలియకుండా నీడలా ఉంటూ వదినని కాపాడుతూ ఉంటాడు. అయితే నానికి శివ పదిరోజులు టైమ్‌ ఇచ్చి వదినని కాపాడుకోమని ఛాలెంజ్‌ చేస్తాడు. శివను నాని ఎలా ఎదుర్కొన్నాడు? తన వదినని కాపాడు కోవడానికి నాని ఏం చేశాడు? అనేది మిగతా కథ. 

ఈమధ్యకాలంలో వచ్చిన నాని సినిమాలన్నీ ఓకేలా అనిపిస్తున్నాయి తప్ప ఏ సినిమాలోనూ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌గానీ, డిఫరెంట్‌ కథగానీ కనిపించడం లేదు. ప్రతి సినిమాలోనూ నాని గెటప్‌ ఒకేలా ఉండడం కూడా దానికి కారణం కావచ్చు. ఈ సినిమా విషయానికి వస్తే గత సినిమాల్లో నానిని చూసినట్టుగానే అనిపిస్తుంది తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. అయితే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా నాని పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. అన్నిరకాల ఎమోషన్స్‌ని పర్‌ఫరెక్ట్‌గా చూపించాడు. ఫిదాతో ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయేలా చేసిన సాయిపల్లవి క్యారెక్టర్‌ సినిమాలో అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. పెర్‌ఫార్మెన్స్‌ కూడా సోసోగానే ఉంది. అయితే పాటల్లో డాన్సులు మాత్రం బాగా చేసింది. ఈ చిత్రంలో శివగా నటించిన విజయ్‌ ఆ క్యారెక్టర్‌కి ఏమాత్రం సూట్‌ అవ్వలేదు. మొహంలో ఎక్స్‌ఫ్రెషన్స్‌ పలకని ఆర్టిస్టుతో అంత పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేయించడం కాస్త కామెడీగానే అనిపిస్తుంది. ఎవర్నీ లెక్కచేయని ఆర్‌.టి.ఓ. క్యారెక్టర్‌లో భూమిక గెటప్‌ బాగున్నా దానికి తగ్గ పెర్‌ఫార్మెన్స్‌ ఆమె నుంచి రాబట్టలేకపోయాడు దర్శకుడు. కొన్ని సీన్స్‌లో ఆమె మొహంలో ఎక్స్‌ప్రెషన్స్‌ అస్సలు పలకలేదు. మిగతా క్యారెక్టర్స్‌ చేసిన ఆర్టిస్టులు ఫర్వాలేదు అనిపించారు. 

ఈ సినిమాకి టెక్నికల్‌ ఎస్సెట్స్‌ ఏమీ లేవని చెప్పొచ్చు. ఈమధ్యకాలంలో శతమానం భవతి చిత్రంలో అద్భుతమైన ఫోటోగ్రఫీని చూపించిన సమీర్‌ ఈ సినిమాని సాదాసీదాగా తీసేసినట్టుగా అనిపిస్తుంది. ఫారిన్‌లో తీసిన పాటలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ చేసిన పాటల్లో ఒక్కపాట కూడా ఆకట్టుకునేలా లేదు. సాయి పల్లవి కోసమైనా పాటలు చూద్దామనుకున్న ఆడియన్స్‌కి విసుగుపుట్టేలా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంతంత మాత్రంగానే వుంది. ఫస్ట్‌హాఫ్‌ 1 గంట 15 నిమిషాలు, సెకండాఫ్‌ 1 గంట 5 నిమిషాలు సినిమా నడుస్తుంది. కానీ, సెకండాఫ్‌లో బోరింగ్‌ సీన్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఎడిటర్‌ కాస్త చొరవ తీసుకున్నట్టయితే బాగుండేది. దిల్‌రాజు ప్రొడక్షన్‌ వేల్యూస్‌ కూడా అంత బాగా లేదు. ఫారిన్‌లో తీసిన పాటలు తప్ప సినిమాలో ఎక్కడా రిచ్‌నెస్‌ కనిపించదు. డైరెక్టర్‌ శ్రీరామ్‌ వేణు గురించి చెప్పాలంటే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి అంటూ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనే కలర్‌ ఇచ్చి తీరా చూస్తే సెకండాఫ్‌ నుంచి హీరో, విలన్‌ మధ్య నడిచే యాక్షన్‌ సినిమాలా టర్న్‌ చేసేశాడు. ఫస్ట్‌హాఫ్‌ని హీరో, హీరోయిన్‌తో ఫన్నీగా బాగానే నడిపించినా సెకండాఫ్‌కి వచ్చే సరికి రెగ్యులర్‌ సినిమాలా మారిపోయింది. ఏ దశలోనూ నెక్స్‌ట్‌ జరగబోయే సీన్‌ గురించి ఎలాంటి క్యూరియాసిటీ కలగదు. సినిమా చూస్తున్నామంటే చూస్తున్నాం అనేలా ఉంటుంది. ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని డైలాగ్స్‌ కొత్తగా, ఫన్నీగా అనిపిస్తాయి. మిగతా డైలాగ్స్‌ అన్నీ చాలా సాదాసీదాగా ఉంటాయి. ముఖ్యంగా మిడిల్‌ క్లాస్‌ వారి గురించి చెప్పే డైలాగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. క్లైమాక్స్‌ చాలా కొత్తగా చెయ్యాలన్న కన్‌ఫ్యూజన్‌లో ఏదో ఒకటిలే అని ముగించేసినట్టుగా అనిపిస్తుంది. నాని, సాయిపల్లవి వంటి ఆర్టిస్టుల నుంచి నాసిరకం కథతో సినిమా వస్తుందని ప్రేక్షకులు ఊహించరు. వారి ఊహకి అందని విధంగా ఈ సినిమాని తియ్యడంలో దర్శకుడు శ్రీరామ్‌వేణు సక్సెస్‌ అయ్యాడు. ఫైనల్‌గా చెప్పాలంటే నాని, దిల్‌ రాజు కాంబినేషన్‌లో ఇలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు. మరి ఆడియన్స్‌ ఈ సినిమాని పాజిటివ్‌గా తీసుకుంటారా? కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందా? అనేది డౌటే. 

ఫినిషింగ్‌ టచ్‌: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.

mca movie review:

nani new movie mca

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement