Advertisement

సినీజోష్‌ రివ్యూ: వివేకం

Fri 25th Aug 2017 12:26 PM
vivekam review,vivekam movie review,cinejosh review vivekam,ajith kumar,kajal agarwal,siva director  సినీజోష్‌ రివ్యూ: వివేకం
Vivekam Movie Review సినీజోష్‌ రివ్యూ: వివేకం
సినీజోష్‌ రివ్యూ: వివేకం Rating: 2.25 / 5
Advertisement

సత్యజ్యోతి ఫిలింస్‌ 

వివేకం 

తారాగణం: అజిత్‌కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, అక్షర హాసన్‌, వివేక్‌ ఓబెరాయ్‌, శరత్‌ సక్సేనా, కరుణాకరన్‌, భరత్‌రెడ్డి తదితరులు 

సినిమాటోగ్రఫీ: వెట్రి 

సంగీతం: అనిరుధ్‌ 

ఎడిటింగ్‌: రూబెన్‌ 

మాటలు: రాజేష్‌ 

సమర్పణ: టి.జి.త్యాగరాజన్‌ 

నిర్మాతలు: సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ 

రచన, దర్శకత్వం: శివ 

విడుదల తేదీ: 24.08.2017 

తమిళ్‌లో హీరో అజిత్‌కి ఎంత ఫాలోయింగ్‌ వుందో అందరికీ తెలిసిందే. అతని సినిమాలు తెలుగులో డబ్‌ అయి విజయం సాధించినవి కూడా వున్నాయి. ఈ మధ్యకాలంలో అజిత్‌ చేసిన వీరం, వేదాలమ్‌ చిత్రాలు వరసగా విజయాలు సాధించాయి. ఆ రెండు సినిమాలకీ దర్శకుడు శివ. ఇప్పుడు శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా రూపొందిన మూడో సినిమా వివేగం. ఈ చిత్రాన్ని తెలుగులో వివేకం పేరుతో విడుదల చేశారు. స్టైలిష్‌ మూవీగా రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు హిట్‌ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వివేకం ప్రేక్షకులను ఏమేర ఎంటర్‌టైన్‌ చేసింది? అజిత్‌ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అజిత్‌కి తమిళ్‌ మాస్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. అతన్నుంచి వారు కోరుకునేవి చప్పట్లు కొట్టించే డైలాగ్స్‌, థ్రిల్‌ చేసే యాక్షన్‌ ఎపిసోడ్స్‌, మంచి పాటలు. వివేకం విషయానికి వస్తే ఇందులో కేవలం యాక్షన్‌ ఎపిసోడ్స్‌, ఛేజింగ్‌ సీన్స్‌ పైనే ఎక్కువ శ్రద్ధ చూపించినట్టు కనిపిస్తుంది. కథపరంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో విశేషాలంటూ ఏమీ లేవు. ప్లుటోనియం వెపన్‌ని తయారు చేసి ఇండియాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో అమరుస్తారు కొందరు దేశద్రోహులు. అది పేలడం వల్ల భూకంపం సంభవిస్తుంది. తద్వారా ఇండియాలోని ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుంది. అప్పుడు కార్పొరేట్‌ కంపెనీలకు బిజినెస్‌పరంగా మంచి లాభాలు చేకూరుతాయి. బాంబ్‌ని ఏర్పాటు చేసిన గ్యాంగ్‌తో కొన్ని సీక్రెట్‌ ఏజెన్సీలు కూడా చేతులు కలుపుతాయి. ఒక సీక్రెట్‌ ఏజెన్సీలో పనిచేసే అజయ్‌కుమార్‌(అజిత్‌) సిన్సియర్‌ ఆఫీసర్‌. అతన్ని అడ్డు తొలగించుకోవడానికి అతనితో కలిసి పనిచేసే స్నేహితులే వెన్నుపోటు పొడుస్తారు. ప్రాణాలతో బయటపడ్డ అజిత్‌ ప్లుటోనియం వెపన్స్‌ ఎక్కడ వున్నాయో తెలుసుకొని అవి పేలకుండా అడ్డుకుంటాడు. ఇదీ క్లుప్తంగా కథ. 

ఈ కథలో ఇంకా చాలా ఎలిమెంట్స్‌ జోడించారు. అయితే అవి సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఏ సెంటర్స్‌ ఆడియన్స్‌కీ అర్థంకాని కథ ఇది. సీన్స్‌ అన్నీ స్పీడ్‌గా వెళ్లిపోవడం, మధ్య మధ్యలో భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ రావడం, ఏ క్యారెక్టర్‌ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కాకపోవడం వంటివి సినిమాలో కోకొల్లలుగా కనిపిస్తాయి. కేవలం మనం యాక్షన్‌ సీక్వెన్స్‌లు చూడడానికే సినిమాకి వచ్చామా అనే ఫీలింగ్‌ కూడా కలుగుతుంది. సినిమాలో ఏ సీన్‌కీ లాజిక్‌ అనేది వుండదు. హీరోని విలన్స్‌ ఎన్ని గన్స్‌తో కాల్చినా తప్పించుకుంటాడు. ఒకవేళ బుల్లెట్స్‌ దిగినా ప్రాణాలతో తిరిగి వస్తుంటాడు. ఇలాంటి సీన్స్‌ మనం ఎన్నో సంవత్సరాలుగా మన సినిమాల్లో చూస్తున్నాం. ఈ సినిమాలో అవే రిపీట్‌ అయ్యాయి. సినిమాలో ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే కథ¸, ఆకట్టుకునే కథనం, అందరికీ అర్థమయ్యే డైలాగ్స్‌, మధ్య మధ్య వచ్చే మంచి పాటలు, ఎంటర్‌టైన్‌మెంట్‌, థ్రిల్‌ చేసే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇవన్నీ సమపాళ్ళలో వుంటేనే రెండున్నర గంటల సేపు సినిమా చూసే అవకాశం వుంటుంది. కేవలం స్టైలిష్‌ టేకింగ్‌, భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ఆడియన్స్‌ని కట్టిపడెయ్యాలనుకోవడం కరెక్ట్‌ కాదు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. చెప్పాలనుకున్న పాయింట్‌ ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్‌ అవుతుందనేది డైరెక్టర్‌ ఆలోచించలేదు. దీంతో సినిమా స్టార్టింగ్‌ నుంచే కన్‌ఫ్యూజన్‌ మొదలవుతుంది. సినిమా ఎండ్‌ అయ్యేవరకు అదే కన్‌ఫ్యూజన్‌ కంటిన్యూ అవుతుంది. విలన్‌ని హీరో ఎదుర్కొనే క్లైమాక్స్‌ ఫైట్‌లో హీరోని ఎంకరేజ్‌ చేస్తూ హీరోయిన్‌ పాట పాడడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్‌ కొన్ని దశాబ్దాలుగా మన సినిమాల్లో చూస్తున్నాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంత కష్టపడినా ఒక నాసిరకం క్లైమాక్స్‌తో సినిమాని ఎండ్‌ చెయ్యడంతో యూనిట్‌ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. 

టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌ మెయిన్‌టెయిన్‌ చేసి చాలా రిచ్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందించారు. నిర్మాతలు పెట్టిన ఖర్చంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. హీరో అజిత్‌ పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చాలా కేర్‌ తీసుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌ సైతం ఎంతో రిస్క్‌ తీసుకొని చేశాడు. హీరోయిన్‌ కాజల్‌ ఒక గృహిణి పాత్రలో ఓకే అనిపించింది. విలన్‌గా వివేక్‌ ఓబెరాయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాలో ఎంతో కీలకమైన పాత్రలా అనిపించే నటాషా క్యారెక్టర్‌లో అక్షరహాసన్‌ నటించింది. సినిమా స్టార్టింగ్‌ ఈ క్యారెక్టర్‌ని బాగా హైలైట్‌ చేసి ఒక్కసారిగా ఆ క్యారెక్టర్‌ని చంపెయ్యడంతో కథ మీద ఇంట్రెస్ట్‌ కూడా ఒక్కసారిగా చచ్చిపోతుంది. వెట్రి సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా పెద్ద ప్లస్‌ అని చెప్పాలి. సినిమా మొత్తం యాక్షన్‌ సీన్స్‌తో నిండి వుంటుంది. ఫైట్‌మాస్టర్స్‌ కూడా ఫైట్స్‌ని డిఫరెంట్‌గా కంపోజ్‌ చేశారు. నైట్‌ ఎఫెక్ట్‌లో ఫారిన్‌లో తీసిన యాక్షన్‌ ఎపిసోడ్‌ అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే రైల్వే ట్రాక్‌ పక్కన తీసిన ఫైట్‌ కూడా బాగుంది. అలాగే హీరోయిన్‌ని చంపడానికి విలన్‌ గ్యాంగ్‌ ఇంటికి వచ్చినపుడు హీరో దూరంగా వుండి వాళ్ళని మట్టుపెట్టే యాక్షన్‌ సీన్‌ని కూడా అద్భుతంగా చేశారు. ఇలా ఈ సినిమాలో అద్భుతం, మహా అద్భుతం అని చెప్పుకోవడానికి యాక్షన్‌ సీక్వెన్స్‌లు మాత్రమే మిగిలాయి. ఇక అనిరుధ్‌ అందించిన మ్యూజిక్‌ సినిమా పెద్ద మైనస్‌ అని చెప్పాలి. ఇందులో ఆకట్టుకునే పాటలు లేవు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా లౌడ్‌గా వుంటూ రణగొణ ధ్వనిలా అనిపిస్తుంది తప్ప ఏ సీన్‌లోనూ ఆకట్టుకోదు. డైరెక్టర్‌ శివ గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం అతను రాసుకున్న కథలోనే పెద్ద లోపం వుంది. అది అతనికి మాత్రమే అర్థమైతే చాలు అనుకున్నాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అర్థం కావాలన్న వివేకాన్ని కోల్పోయాడు. విజువల్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎంత అద్భుతంగా వున్నా విషయం లేకపోతే ఏ సినిమా అయినా పరాజయాన్ని చవి చూడాల్సిందే. వివేకం సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే విషయం లేకుండా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో స్టైలిష్‌ మూవీగా రూపొందిన వివేకం చూడాలంటే కాస్తయినా వివేకం వుండాలి. బి, సి సెంటర్స్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం ఈ సినిమా చూస్తారు తప్ప కథపరంగా ఏమాత్రం ఎంజాయ్‌ చెయ్యలేరు. 

ఫినిషింగ్‌ టచ్‌: కథ నిల్.. యాక్షన్‌ ఫుల్‌

Vivekam Movie Review:

Ajith, Kajal Agarwal, Vivek Oberoi And Others Starring Vivekam Movie Reveiw and Cinejosh website Rating

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement