Advertisement

సినీజోష్‌ రివ్యూ: గౌతమ్‌నంద

Fri 28th Jul 2017 09:29 PM
telugu movie gowtham nanda,gowtham nanda movie review,gopichand new movie gowtham nanda,gowtham nanda review in cinejosh,gowtham nanda cinejosh review  సినీజోష్‌ రివ్యూ: గౌతమ్‌నంద
gowtham nanda review సినీజోష్‌ రివ్యూ: గౌతమ్‌నంద
సినీజోష్‌ రివ్యూ: గౌతమ్‌నంద Rating: 3 / 5
Advertisement

 

 

 

శ్రీ బాలాజీ సినీ మీడియా 

గౌతమ్‌నంద 

తారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌ త్రెస, ముఖేష్‌ రుషి, చంద్రమోహన్‌, వెన్నెల కిషోర్‌, అజయ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఎస్‌.సౌందర్‌రాజన్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌ 

నిర్మాతలు: జె.భగవాన్‌, జె.పుల్లారావు 

రచన, దర్శకత్వం: సంపత్‌నంది 

విడుదల తేదీ: 28.07.2017 

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మించిన భారీ చిత్రం గౌతమ్‌నంద. గోపీచంద్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ఈరోజు విడుదలైన గౌతమ్‌నంద చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది? గోపీచంద్‌ కెరీర్‌కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్‌ అవుతుంది? ఈ చిత్రంలో సంపత్‌నంది చూపించిన కొత్తదనం ఏమిటి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

ప్రతి మనిషికీ డబ్బు చాలా అవసరం. ఒక విధంగా చెప్పాలంటే డబ్బు అవసరం లేనివారు ప్రపంచంలో ఎవ్వరూ వుండరు. డబ్బు ప్రాధాన్యం పెరిగిన తర్వాత మనిషి డబ్బు చుట్టూనే తిరుగుతున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించాలన్నది కొందరి ఆలోచన. డబ్బు కోసం దేనికైనా సిద్ధపడతారు కొంతమంది. అలాంటి ఆసక్తికరమైన ఇతివృత్తంతో రూపొందిన చిత్రం గౌతమ్‌నంద. ఈ చిత్రం కథ విషయానికి వస్తే అతని పేరు గౌతమ్‌(గోపీచంద్‌). కోటీశ్వరుడైన ఘట్టమనేని విష్ణుప్రసాద్‌(సచిన్‌ ఖేడేకర్‌) ఎకైక పుత్రుడు. ప్రపంచంలోని టాప్‌ 50 మంది ధనవంతుల జాబితాలో వున్నవాడు. అలా అతని ఫోటో ఫోబ్స్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీగా వచ్చింది. తండ్రి సంపాదనను దేశాలు తిరిగి ఎంజాయ్‌ చేస్తూ వుంటాడు గౌతమ్‌. ఓరోజు పబ్‌లో వెయిటర్‌ చేసిన పొరపాటుకు చేయి చేసుకుంటాడు గౌతమ్‌. దానికి ఆ వెయిటర్‌ అన్న మాటలు గౌతమ్‌ని ఆలోచింపజేస్తాయి. చిన్నప్పటి నుంచి బాధంటే ఏమిటో, ఎమోషన్స్‌ అంటే ఏమిటో తెలియని గౌతమ్‌ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. మద్యం మత్తులో కారు నడుపుతున్న గౌతమ్‌ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. ఆ వ్యక్తి తనలాగే వుండడం చూసి ఆశ్చర్యపోతాడు గౌతమ్‌. అతని పేరు నంద(గోపీచంద్‌). పేదరికంతో బాధపడుతున్న చావాలనుకుని గౌతమ్‌ కారు కింద పడతాడు. అతనెందుకు చనిపోవాలనుకుంటున్నాడో చెబుతాడు. నంద చెప్పిన కథ విన్న గౌతమ్‌ నెలరోజులు ఒకరి స్థానంలోకి ఒకరం మారిపోదాం అంటాడు. అలా గౌతమ్‌ స్థానంలోకి నందకిషోర్‌, నందకిషోర్‌ స్థానంలోకి గౌతమ్‌ వస్తారు. అలా మారిన తర్వాత వారి వారి జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులు ఏమిటి? గౌతమ్‌ తీసుకున్న నిర్ణయం వల్ల అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

కోటీశ్వరుడి కొడుకుగా గడ్డంతో కనిపించే గౌతమ్‌ పాత్రలో గోపీచంద్‌ చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. ఫారిన్‌ లొకేషన్స్‌లో మోడల్స్‌తో తీసిన గోపీచంద్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే మాస్‌గా వుండే నంద క్యారెక్టర్‌కి కూడా పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు. సెకండాఫ్‌లో నెగెటివ్‌ షేడ్స్‌ వున్న నంద క్యారెక్టర్‌లో గోపీచంద్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. హీరోయిన్లు హన్సిక, కేథరిన్‌ల గ్లామర్‌ సినిమాకి ప్లస్‌ అయింది. ముఖ్యంగా కేథరిన్‌ బికినీలో కనిపంచిన సన్నివేశం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ కథ ముఖ్యంగా గౌతమ్‌, నందల మధ్య జరుగుతుంది కాబట్టి మిగతా ఆర్టిస్టులకు పెర్‌ఫార్మెన్స్‌ చేసే అవకాశం తక్కువ. అక్కడక్కడ కొంత కామెడీని పుట్టించేందుకు వెన్నెల కిషోర్‌, బిత్తిరి సత్తి తమ శాయశక్తులా కృషి చేశారు. 

టెక్నీషియన్స్‌ గురించి చెప్పాలంటే సౌందర్‌రాజన్‌ సినిమాటోగ్రఫీ గురించి హైలైట్‌గా చెప్పుకోవాలి. ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా చూపించడంలో సౌందర్‌రాజన్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ఫారిన్‌ లొకేషన్స్‌ అందాల్ని మరింత అందంగా చూపించాడు. హీరో, హీరోయిన్ల గ్లామర్‌ రెట్టింపు అయ్యిందా అన్నంత బాగా తీశాడు. గౌతంరాజు ఎడిటింగ్‌ బాగుంది. థమన్‌ చేసిన పాటల్లో హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌, బోలేరామ్‌ సాంగ్‌ చాలా బాగున్నాయి. చిత్రీకరణ పరంగా అన్ని పాటలూ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగానే చేశాడు. సంపత్‌ నంది రాసిన కొన్ని మాటలు ఆలోచింపజేసేవిగా వున్నాయి. కొన్ని డైలాగ్స్‌కి థియేటర్‌లో క్లాప్స్‌ వినిపించాయి. కథ గురించి చెప్పాలంటే హీరో డ్యూయల్‌ రోల్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు అందరు టాప్‌ హీరోలు డ్యూయల్‌ రోల్స్‌ చేశారు. దాదాపు అన్ని సినిమాల్లోనూ ఒకే కథ వుంటుంది. ఒక హీరో డల్‌గా వుంటే, మరో హీరో హుషారుగా వుంటాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలూ యాక్టివ్‌గానే వుంటారు. ఒక హీరో సెకండాఫ్‌లో విలన్‌గా మారతాడు. అదే ఈ కథలోని కొత్తదనంగా చెప్పుకోవాలి. రెగ్యులర్‌గా వచ్చే డ్యూయల్‌ రోల్‌ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు సంపత్‌నంది. డబ్బు ముఖ్యం కాదు, మానవతా విలువలు ముఖ్యం అనే దర్శకుడి ఆలోచన ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. ఎవ్వరూ ఊహించని విధంగా నంద విలన్‌గా మారడం, గౌతమ్‌ని చంపాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా సినిమా గ్రాఫ్‌ పైకి లేచింది. అలా క్లైమాక్స్‌ వరకు తల తిప్పనివ్వకుండా కథ ముందుకు వెళ్తుంది. క్లైమాక్స్‌లో ఏం జరగబోతోందన్నది చివరి నిముషం వరకు సస్పెన్స్‌గానే వుంటుంది. ఈ సినిమా ఇంత రిచ్‌గా వచ్చిందంటే దానికి నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావులను అభినందించాల్సిందే. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు స్క్రీన్‌పై రిచ్‌నెస్‌ తప్ప మరేమీ కనిపించదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఇప్పటి వరకు మనం చూసిన డ్యూయల్‌ రోల్‌ సినిమాలకు పూర్తి భిన్నంగా రూపొందిన గౌతమ్‌నంద ప్రేక్షకులకు పైసా వసూల్‌ చిత్రమనే చెప్పాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: ఇది గోపీచంద్‌, సంపత్‌ నంది షో 

 

gowtham nanda review:

gopichand latest movie with gopichand gowtham nanda

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement