సినీజోష్‌ రివ్యూ: ఘాజీ

Sat 18th Feb 2017 11:42 AM
ghazi,ghazi movie review,cinejosh review ghazi,ghazi telugu review,ghazi movie cinejosh review and rating,daggubati rana,sankalp director,the ghazi attack  సినీజోష్‌ రివ్యూ: ఘాజీ
సినీజోష్‌ రివ్యూ: ఘాజీ

పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

ఘాజీ 

తారాగణం: దగ్గబాటి రానా, ఓంపురి, నాజర్‌, తాప్సీ, కె.కె.మీనన్‌, నాజర్‌, అతుల్‌ కులకర్ణి, సత్యదేవ్‌, భరత్‌రెడ్డి, రవివర్మ తదితరులు 

సినిమాటోగ్రఫీ: మది 

సంగీతం: కె 

ఎడిటింగ్‌: ఎ.శ్రీకరప్రసాద్‌ 

మాటలు: గుణ్ణం గంగరాజు 

నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, పెరల్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె 

రచన, దర్శకత్వం: సంకల్ప్‌ 

విడుదల తేదీ: 17.02.2017 

యుద్ధానికి సంబంధించిన సినిమాలు, యుద్ధ నేపథ్యంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సినిమాలు చాలా వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఇండియాలో రాని బ్యాక్‌డ్రాప్‌లో ఘాజీ చిత్రాన్ని నిర్మించారు. అండర్‌ వాటర్‌లో జరిగే వార్‌ నేపథ్యంలో వచ్చిన మొట్ట మొదటి చిత్రంగా ఘాజీ నిలుస్తుంది. రానా, కెకె మీనన్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కొత్త దర్శకుడు సంకల్ప్‌ తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, తెలుగులో చిరంజీవి ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ చెప్పడం విశేషం. ఈరోజు విడుదలైన ఘాజీ ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ నిచ్చింది? సంకల్ప్‌కి డైరెక్టర్‌గా ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుంది? ఈ చిత్రంలో ఆడియన్స్‌ని కట్టి పడేసే అంశాలు ఏమిటి? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

1971లో తూర్పు పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల్లో హింస చెలరేగింది. భారతదేశానికి అనుకూలంగా వున్నవారందరినీ పశ్చిమ పాకిస్థాన్‌ సైన్యం నిర్ధాక్షిణ్యంగా చంపేసింది. తూర్పు పాకిస్థాన్‌ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. తూర్పు పాకిస్థాన్‌లో జరిగిన హింసకు భారతదేశమే కారణమని ఆరోపించింది పశ్చిమ పాకిస్థాన్‌. దీన్ని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఖండించారు. పాకిస్థాన్‌ హింసకు పాల్పడితే తగిన సమాధానం చెప్పేందుకు తమ త్రివిధ దళాలు సిద్ధంగా వున్నాయని భారత ప్రధాని హెచ్చరించారు. తూర్పు పాకిస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించాలంటే అక్కడ వున్న ఆర్మీకి మరిన్ని ఆయుధాలు సమకూర్చాల్సి వుంది. తూర్పు పాకిస్థాన్‌కి ఆయుధాలతో చేరుకోవాలంటే మూడు వైపులా ఆ దేశాన్ని ఇండియా కవర్‌ చేస్తుండడంతో భూమార్గంలో కుదరదు. అలాగే ఆకాశ మార్గంలో కూడా సాధ్యం కాదు. దీంతో పశ్చిమ పాకిస్థాన్‌ సముద్ర మార్గం గుండా ఆయుధాలను చేరవేయాలని నిర్ణయించుకుంటుంటుంది. పాకిస్థాన్‌ నుంది దక్షిణ మార్గం గుండా ఇండియా చుట్టూ వుండే సముద్రాన్ని తమ మార్గంగా ఎంచుకుంది. అయితే ఇండియాకు బ్రహ్మాస్త్రం లాంటి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ని దాటుకుని వెళ్ళడం సాధ్యం కాదని, దాన్ని నాశనం చేయడం అంత సులభం కాదని వారికి తెలుసు. అలా కాని పక్షంలో ఇండియాలోని ఏదో ఒక పోర్ట్‌పై సర్‌ప్రైజ్‌ ఎటాక్‌ చేసి నేవీ దృష్టిని మళ్ళించి సముద్ర మార్గాన్ని సుగమం చేసుకోవాలని ప్లాన్‌ వేసింది పాకిస్థాన్‌. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇండియన్‌ నేవీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ఆపరేషన్‌ సీసైడ్‌ పేరుతో ఓ పాసీవ్‌ మిషన్‌ని ప్లాన్‌ చేస్తారు. కెప్టెన్‌ రణ్‌విజయ్‌ సింగ్‌(కెకె మీనన్‌) నేతృత్వంలో ఎస్‌ 21 సబ్‌మెరీన్‌లో లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ అర్జున్‌(రానా), దేవరాజ్‌(అతుల్‌ కులకర్ణి) తమ సిబ్బందితో కలిసి బయల్దేరతారు. సముద్రంలో శత్రువుల కదలికల గురించి అనుక్షణం పరిశీలిస్తుంటారు. ఆ సమయంలోనే పశ్చిమ పాకిస్థాన్‌ నుంచి తూర్పు పాకిస్థాన్‌కి సబ్‌ మెరీన్‌ ఘాజీ వెళ్తున్నట్టు గమనిస్తుంది రణ్‌విజయ్‌ సింగ్‌ బృందం. అప్పుడు ఏం జరిగింది? పాకిస్థాన్‌ సబ్‌మెరీన్‌ని ఇండియన్‌ నేవీ ఎలా అడ్డుకుంది? ఆ ప్రయత్నంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? సీసైడ్‌ మిషన్‌ సక్సెస్‌ అయిందా? ఘాజీని మన ఎస్‌21 సబ్‌మెరీన్‌ ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా కథ. 

కెప్టెన్‌ రణ్‌విజయ్‌ సింగ్‌గా కె.కె.మీనన్‌, లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌గా రానా, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ దేవరాజ్‌గా అతుల్‌ కులకర్ణి... ఈ సినిమా విషయానికి వస్తే ఈ మూడు పాత్రలే ప్రధానం. ఈ ముగ్గురూ పెర్‌ఫార్మెన్స్‌ విషయంలో తమ క్యారెక్టర్స్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. ముఖ్యంగా కె.కె. మీనన్‌ తన క్యారెక్టర్‌ని ఎంతో అద్భుతంగా చేశాడు. కెప్టెన్‌ని ఎదిరించి నిలబడే లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌గా రానా చాలా సీన్స్‌లో ఎంతో డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. అతను చెప్పిన డైలాగులు, ఇచ్చిన పెర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకుంటాయి. చాలా కాలం తర్వాత అతుల్‌ కులకర్ణికి ఓ మంచి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చింది. దాన్ని ఉపయోగించుకున్నాడు. మిగిలిన క్యారెక్టర్స్‌లో నేవీ ఆఫీసర్స్‌గా నాజర్‌, ఓంపురి కొద్ది సేపటికి మాత్రమే పరిమితమయ్యారు. తమ అఫీషియల్స్‌కి సపోర్ట్‌ చేసే పాత్రల్లో సత్యదేవ్‌, రవివర్మ రాణించారు. ఇక ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్‌ తాప్సీది. ముఖ్యంగా ఎందుకు చెప్పుకోవాలంటే ఆమెను ఈ సినిమాలో ఏ ఉద్దేశంతో తీసుకున్నారో తెలీదు. ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్ర. కనీసం డైలాగులు కూడా లేని క్యారెక్టర్‌. మొదటి నుంచి చివరి వరకు అలా చూస్తూ వుండే క్యారెక్టరే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. కానీ, స్టార్టింగ్‌లో సినిమా ఇతివృత్తాన్ని తెలిపేందుకు మాత్రమే చిరంజీవి వాయిస్‌ని ఉపయోగించారు. మధ్య మధ్యలో అవసరమైన చోట కూడా వాయిస్‌ ఓవర్‌ చెప్పించి వుంటే మరింత అందంగా వుండేది. 

సాంకేతిక విభాగానికి వస్తే మది సినిమాని ఎంతో రిచ్‌గా, ఎంతో అందంగా చిత్రీకరించాడు. ప్రతి షాట్‌లోనూ రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. సీరియస్‌గా రన్‌ అయ్యే సినిమాలో పాటలు పెట్టి చెడగొట్టకుండా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె ని కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి మాత్రమే పరిమితం చేశారు. శ్రీకరప్రసాద్‌ ఎడిటింగ్‌ చాలా బాగుంది. కళ్ళకి ఇబ్బంది కలిగించని విధంగా మంచి ఎడిటింగ్‌ చేశారు. గుణ్ణం గంగరాజు రాసిన మాటలు అంత చెప్పుకోదగ్గవిగా లేవు. కథకు తగ్గట్టు సాధారణమైన డైలాగ్స్‌తోనే సరిపెట్టారు. ఎవా మోషన్‌ స్టూడియోస్‌ చేసిన గ్రాఫిక్స్‌ చాలా నేచురల్‌గా వున్నాయి. నిర్మాత పి.వి.పి మంచి ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన సంకల్ప్‌ యదార్థ సంఘటనల నేపథ్యంలో రాసుకున్న కథ  చాలా అద్భుతంగా వుంది. రెండ‌వ ప్రపంచ యుద్ధ నేప‌థ్యంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు వెలుగులోకి రాలేదు. వాటిని అంద‌రికీ తెలిపే ఉద్దేశంతో సంక‌ల్ప్ రాసుకున్న క‌థ కొత్త‌గా వున్న‌ప్ప‌టికీ దాన్నితెర‌పై అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించ‌లేక‌పోయాడు. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు స‌బ్ మెరీన్‌లోనే క‌థ న‌డుస్తుండ‌డం, అందులో వున్న పాత్ర‌ల న‌డుమ స‌రైన ఎమోష‌న్ క్యారీ అవ్వ‌క‌పోవ‌డంతో సినిమా చాలా సాదా సీదాగా అనిపిస్తుంది.ఫస్ట్‌ హాఫ్‌ వున్నంత స్పీడ్‌గా, గ్రిప్పింగ్‌గా సెకండాఫ్‌ లేదు. ఎస్‌ 21 సబ్‌ మెరీన్‌కు ఘాజీ ఎదురుపడడంతో ఇంటర్వెల్‌ పడుతుంది. అక్కడి వరకు సక్సెస్‌ఫుల్‌గా నడిచిన కథ సెకండాఫ్‌కి వచ్చేసరికి నెమ్మదిస్తుంది. అక్కడి నుంచి క్లైమాక్స్‌ వరకు క‌థ‌లో పెద్ద మార్పు క‌నిపించ‌దు.  క్లైమాక్స్‌లో ఘాజీని పేల్చేయడంతో సినిమా ఎండ్‌ అవుతుంది. సినిమా సార్టింగ్ నుంచి ఫాలో అవుతూ వ‌చ్చే ఆడియ‌న్స్‌  క్లైమాక్స్ చాలా గొప్ప‌గా వుంటుంద‌ని ఆశిస్తారు. కానీ, చాలా నార్మ‌ల్‌గా సినిమా ఎండ్ అవుతుంది. కథగా చెప్పుకుంటే చాలా చిన్నపాయింటే అయినా దాన్ని రెండున్నర గంటల సినిమాగా తీర్చిదిద్దాలంటే ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సవాళ్ళను ఎదుర్కొని అందర్నీ ఆకట్టుకునే సినిమాగా ఘాజీని తియ్యలేకపోయాడు సంకల్ప్‌. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు నేవీకి సంబంధించిన అంశాలు, శత్రువు ఎంత దూరంలో వున్నాడు అనే వివరాలు తెలిపే ఫిగర్స్‌, కొన్ని టెక్నికల్‌ నేమ్స్‌ సగటు ప్రేక్షకుడికి అర్థం కాకుండా వుంటాయి కాబట్టి అయోమయంలో పడిపోతాడు. విజువల్‌గా సినిమాని కాసేపు ఎంజాయ్‌ చేసినా ఎంతసేపూ సినిమా సబ్‌మెరీన్‌లో వుంటుంది కాబట్టి తర్వాత తర్వాత కథలో ఏం జరుగుతుందనే ఆసక్తి సన్నగిల్లుతుంది. రెగ్యులర్‌ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఓ నాలుగు అందమైన పాటలు, కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌, కొంత యాక్షన్‌ కోరుకోవడంలో తప్పులేదు. అవి ఈ సినిమాలో లేకపోవడంతో వారికి ఈ సినిమా రుచించ‌క‌పోవచ్చు. యుద్ధ నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటనలతో తయారు చేసిన కథ అయినప్పటికీ ఇందులో ప్రేక్షకుల్ని రెండున్నర గంటల సేపు సీట్లలో కూర్చోబెట్టే అంశాలు, వారికి కనెక్ట్‌ అయ్యే ఎమోషన్స్‌ లేకపోవడంతో సినిమా ఎప్పుడు క్లైమాక్స్‌కి వస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఇండియాలోనే ఫస్ట్‌ టైమ్‌ అండర్‌ వాటర్‌ వార్‌ నేపథ్యంలో రూపొందిన ఘాజీ టేకింగ్‌ పరంగా, మేకింగ్‌ పరంగా, పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఓకే అనిపించుకున్నా పాత్ర‌ల మ‌ధ్య స‌రైన ఎమోష‌న్స్ లేక‌పోవ‌డం,తో ఒక సాధార‌ణ చిత్రంగా నిలుస్తుంది. అయితే ఒక కొత్త క‌థ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు వెలుగులోకి రాని క‌థ‌ని తీసుకొని మంచి ఆర్టిస్టుల‌తో తెర‌కెక్కించిన సంక‌ల్ప్‌ని, అత‌న్ని ఎంక‌రేజ్ చేస్తూ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా చిత్రాన్ని నిర్మించిన నిర్మాత‌ల‌ను అప్రిషియేట్ చెయ్యాల్సిందే. 

ఫినిషింగ్‌ టచ్‌: అప్రిషియేట్ చెయ్య‌ద‌గ్గ గుడ్ అటెమ్ట్‌

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017