సినీజోష్‌ రివ్యూ: సింగం 3

Fri 10th Feb 2017 01:07 PM
surya latest movie singham 3,telugu movie s3,s3 movie reivew in cinejosh,s3 cinejosh review,director hari new movie s3  సినీజోష్‌ రివ్యూ: సింగం 3
సినీజోష్‌ రివ్యూ: సింగం 3

స్టూడియో గ్రీన్‌, పెన్‌ మూవీస్‌, సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 

సింగం 3 

తారాగణం: సూర్య, అనుష్క, శృతి హాసన్‌, శరత్‌ సక్సేనా, శరత్‌బాబు, 

సూరి, రాధిక, సుమన్‌, ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ప్రియన్‌ 

సంగీతం: హేరిస్‌ జయరాజ్‌ 

ఎడిటింగ్‌: వి.టి.విజయన్‌, టి.ఎస్‌.జయ్‌ 

ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

నిర్మాతలు: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, ధవళ్‌ జయంతిలాల్‌ గాడ, మల్కాపురం శివకుమార్‌ 

రచన, దర్శకత్వం: హరి 

విడుదల తేదీ: 09.02.2017 

సూర్య, హరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. సింగం 3 ఐదో సినిమా. సింగం సిరీస్‌లో భాగంగా తెలుగులో వచ్చిన యముడు, సింగం 2 చిత్రాల తర్వాత వచ్చిన మరో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సింగం 3. సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ నరసింహంగా యముడు, సింగం 2 చిత్రాలతో పవర్‌ఫుల్‌ పెర్‌ఫార్మర్‌ అనిపించుకున్న సూర్యతో సింగం 3 చిత్రాన్ని ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో హరి కొత్తగా చూపించిందేమిటి? సూర్యకి ఇది ఎలాంటి సినిమా అవుతుంది? ఈ పోలీస్‌ స్టోరీని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

సింగం సిరీస్‌ చిత్రాల స్టోరీని ఓసారి రీవైండ్‌ చేసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఊరిలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే నరసింహం(సూర్య) నేరస్తులకు నిద్ర లేకుండా చేస్తుంటాడు. అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిని ఏరిపారేస్తుంటాడు. కాస్త తేడాతో మొదటి రెండు పార్టులు ఇదే కథతో రన్‌ అవుతూ వుంటుంది. ఇప్పుడు మూడో పార్ట్‌ సింగం 3 కథలోకి వస్తే కర్ణాటక ప్రభుత్వానికి, పోలీసులకు అక్కడి పోలీస్‌ కమిషనర్‌ హత్య తలనొప్పిగా మారుతుంది. ఆ హత్య వెనుక బడా బాబుల హస్తం వుండడంతో అక్కడి పోలీసుల వల్ల హంతకుడ్ని పట్టుకోవడం వారి వల్ల కాదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నరసింహంని పిలిపించి కమిషనర్‌ హత్య కేసుని అతనికి అప్పగిస్తారు. తనకి ఎవరూ లేరని, భార్యకి విడాకులు ఇచ్చానని అందరికీ చెప్తాడు నరసింహం. అదే టైమ్‌లో నరసింహని పరిచయం చేసుకోవడానికి అతని వెంట పడుతూ వుంటుంది విద్య(శృతి హాసన్‌). కమిషనర్‌ హత్య కేసుని ఛేదించడానికి వచ్చిన నరసింహానికి అక్కడ జరుగుతున్న ఎన్నో అక్రమాల గురించి తెలుస్తుంది. వాటన్నింటినీ క్లియర్‌ చెయ్యాలని డిసైడ్‌ అవుతాడు. కమిషనర్‌ని ఎవరు హత్య చేశారో నరసింహ కనుక్కోగలిగాడా? తన భార్యకి విడాకులు ఇచ్చానని నరసింహ ఎందుకు చెప్పాడు? నరసింహ వెంటపడుతున్న విద్య ఎవరు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

నరసింహగా యముడు, సింగం2 చిత్రాల్లో తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్న సూర్య ఇప్పుడు ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి. ఫైట్‌ సీక్వెన్స్‌ల్లో, డాన్సులో, ఎమోషనల్‌ డైలాగ్స్‌ చెప్పడంలో సూర్య అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. అతని భార్యగా అనుష్క పాత్ర చాలా సాధారణంగా వుంది. అలాగే ఆమె పెర్‌ఫార్మెన్స్‌ కూడా దానికి తగ్గట్టుగానే వుంది. ఈ చిత్రంలో చేరిన కొత్త క్యారెక్టర్‌ విద్య పాత్రలో శృతి హాసన్‌ చాలా క్యూట్‌గా కనిపించింది. తన క్యారెక్టర్‌కి తగ్గట్టుగా పెర్‌ఫార్మ్‌ చేసింది. ఇద్దరు హీరోయిన్లు వున్నారు కాబట్టి సూర్యతో చెరో డ్యూయెట్‌ని షేర్‌ చేశాడు డైరెక్టర్‌ హరి. విలన్‌గా వెటరన్‌ యాక్టర్‌ శరత్‌ సక్సేనా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరో విలన్‌ విఠల్‌ ప్రసాద్‌గా ఆ క్యారెక్టర్‌ని హైలైట్‌ చేసేలా పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌. సీరియస్‌గా నడుస్తున్న కథలో మధ్య మధ్యలో సూరితో కామెడీ చేయించి కాస్త ఎంటర్‌టైన్‌ చేద్దామనుకున్నాడు హరి. ఆ కామెడీ పెద్దగా పండకపోయినా సీరియస్‌గా నడిచే స్టోరీలో ఆడియన్స్‌కి కాస్త రిలీఫ్‌ దొరుకుతుంది. 

హీరో పెర్‌ఫార్మెన్స్‌ తర్వాత చెప్పుకోవాల్సింది టెక్నీషియన్స్‌ గురించి. తన కథ, కథనాలతో సీన్స్‌తో సినిమాని హై స్పీడ్‌లో పరిగెట్టించే హరి ఈ సినిమాలో తన స్పీడ్‌ని కాస్త పెంచినట్టే అనిపిస్తోంది. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండింగ్‌ వరకు ఆడియన్స్‌కి ఏ దశలోనూ బోర్‌ కొట్టించకుండా 2 గంటల 36 నిముషాలు సీట్లలో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే మొదటి రెండు పార్టుల కంటే సింగం 3 కంటెంట్‌ పరంగా, టేకింగ్‌ పరంగా, మేకింగ్‌ పరంగా మంచి మార్కులు సంపాదించుకుందని చెప్పాలి. డైరెక్టర్‌ తర్వాత చెప్పుకోవాల్సింది కెమెరామెన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఫైట్‌ మాస్టర్‌ల గురించి, ఎడిటర్‌ గురించి. డైరెక్టర్‌ హరి కథ గురించి ఎంత ఆలోచిస్తాడో, తన కథనంతో సినిమాని ఎలా పరిగెట్టిస్తాడో తెలిసిన ప్రియన్‌ తన అద్భుతమైన కెమెరా వర్క్‌తో సినిమాని చాలా అందంగా చూపించారు. విజువల్‌గా పాటలు కూడా బాగున్నాయి. మొదటి రెండు సినిమాలకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించగా, ఈ సినిమాకి హేరిస్‌ జయరాజ్‌ మ్యూజిక్‌ చేశాడు. పాటలు ఆడియో పరంగా, విజువల్‌గా కూడా ఫర్వాలేదు అనిపిస్తాయి. హై స్పీడ్‌లో వెళ్ళే కథకి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగా చేశాడు హేరిస్‌. ఈ సినిమాకి పనిచేసిన ఇద్దరు ఎడిటర్స్‌ తమ వర్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేశారనిపిస్తుంది. డైరెక్టర్‌ అనుకున్న స్పీడ్‌ ఏమాత్రం తగ్గకుండా తమ ఎడిటింగ్‌ని చేశారు. వీరి తర్వాత చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన టెక్నీషియన్‌ కనల్‌ కణ్ణన్‌. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఫైట్స్‌కి ఎక్కువ స్కోప్‌ వుండడం వల్ల డిఫరెంట్‌ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో యాక్షన్‌ సీక్వెన్స్‌లను కంపోజ్‌ చేశాడు. దానికి సూర్య పెర్‌ఫార్మెన్స్‌ తోడవడంతో ఆడియన్స్‌ ఆ ఫైట్స్‌ని బాగా ఎంజాయ్‌ చేశారు. శశాంక్‌ వెన్నెలకంటి రాసిన మాటలు కూడా బాగున్నాయి. మన దేశం గొప్పతనాన్ని, ఇండియన్‌ పోలీస్‌ పవర్‌ని తెలిపేలా రాసిన డైలాగ్స్‌కి థియేటర్‌లో చప్పట్లు మోగాయి. మేకింగ్‌ విషయానికి వస్తే హై క్వాలిటీతో ఎంతో రిచ్‌గా ఈ సినిమా తీశారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. సూర్య పెర్‌ఫార్మెన్స్‌, హరి టేకింగ్‌, ప్రియన్‌ ఫోటోగ్రఫీ, హేరిస్‌ జయరాజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, కనల్‌ కణ్ణన్‌ ఫైట్స్‌.. సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ అయితే, సినిమాని స్పీడ్‌గా నడిపించాలన్న తాపత్రయం అక్కడక్కడా ఓవర్‌ స్పీడ్‌ కావడం, ఒక్కో సందర్భంలో సీన్‌లో ఏం జరుగుతోందో అర్థం కాకపోవడం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అక్కడక్కడా రణగొణ ధ్వనుల్లా వినిపించడం, మాటి మాటికీ సింహం.. సింహం.. నరసింహం.. అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే పాట ప్రేక్షకుల్ని విసిగిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ మూవీస్‌ని ఇష్టపడే వారికి, పోలీస్‌ స్టోరీలు లైక్‌ చేసేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో కమర్షియల్‌గా ఈ సినిమాకి మంచి ఫిగర్స్‌ వచ్చే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: హై స్పీడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017